Nayi Disha Seema Seth: కార్పొరేట్‌ రంగం నుంచి కార్మిక లోకానికి... | NGO Nayi Disha Is Helping Marginalised Kids Get Formal Education | Sakshi
Sakshi News home page

Nayi Disha Seema Seth: కార్పొరేట్‌ రంగం నుంచి కార్మిక లోకానికి...

Published Thu, Mar 14 2024 12:24 AM | Last Updated on Thu, Mar 14 2024 12:24 AM

NGO Nayi Disha Is Helping Marginalised Kids Get Formal Education - Sakshi

కొత్తదారి

కార్పొరేట్‌ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సీమా సేథ్‌ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్‌ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది....

‘ఇంజినీర్‌ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్‌ దాస్‌ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్‌ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్‌ నుంచి గురుగ్రామ్‌కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్‌ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు.

‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్‌ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు.
‘సీమా మేడమ్‌ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్‌.
బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్‌ను మార్చివేసింది సీమ.
‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ.

ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్‌ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్‌ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు.
‘లేదు’ అని చెప్పింది సీమ.
తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు.
‘ఎందుకు?’ అని అడిగింది సీమ.

‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్‌. ఆ తరువాత...
‘మేడమ్‌... మీరు అక్కడ స్కూల్‌ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్‌.
సీమ ఆలోచనలో పడింది.
ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్‌ ఎక్కడ స్టార్ట్‌ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్‌ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్‌ స్టార్ట్‌ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్‌ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది.

గురుగ్రామ్‌లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్‌కు వచ్చి కంప్యూటర్‌ నుంచి థియేటర్‌ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది.
 ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్‌ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు.
‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ.

‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్‌లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్‌.
‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్‌ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్‌లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు.

సిలబస్‌ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్‌–టీచర్‌ మీటింగ్‌ కూడా ఉంటుంది.
‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్‌ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్‌ ఒక మీటింగ్‌లో చెప్పారు’ అంటున్నాడు అశోక్‌రావు అనే పేరెంట్‌.
 
వినే వారు తప్పకుండా ఉంటారు

మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి.
– సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement