
పొన్కల్‌లో నిజామాబాద్ జిల్లావాసి ఆత్మహత్య
జన్నారం : టైగర్‌జోన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కెమెరాలు అమర్చి, పరిశీలించే ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జన్నారం మండలంలోని పొన్కల్‌లో చోటుచేసుకుంది. ఏఎస్సై మజార్ కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం కిసాన్‌పేట్ గ్రామానికి చెందిన ప్రశాంత్(23) హైదరబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడు. ఇటీవల కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో జంతుగణనలో భాగంగా కెమరాలు అమర్చి, వివరాలు సేకరించే విషయమై శిక్షణ పొందుతున్నాడు. ఇందులో భాగంగా జన్నారం మండలం పొన్కల్ గ్రామంలో అద్దె గదిలో ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి తన గదిలో ఇనుపరాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లావారాక 8 గంటలైన తలుపు తెరవ కపోవడంతో అనుమానంతో యజమాని కిటికీలోంచి చూశాడు. లోపలి గదిలో అతడు ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రశాంత్‌ను ఎవరో చంపి ఉంటారని వారు ఆరోపించారు. అరుుతే గది లోపలి వైపు గడియ పెట్టి ఉండడంతో ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ మోహన్ పరిశీలించారు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మజార్ తెలిపారు. ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు.