మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? ‘రోడ్డు మీద పోలీసుల్లేరు కదా, మనం సేఫ్’అనుకోవడానికి ఇకపై వీల్లేదు. ఎందుకంటే తాగి, లేదా డ్రగ్స్ తీసుకుని వాహనం నడిపే వారిని కదలికలను బట్టి పసిగట్టే కృత్రిమ మేధతో కూడిన కెమెరా వచ్చేసింది. ఇకపై పోలీసులు ప్రతి వాహనాన్నీ ఆపి డ్రైవర్‌ను చెక్ చేయాల్సిన పని లేదు. ఈ ఏకై కెమెరాలు డ్రైవర్ స్థితి ఏమిటన్నది గుర్తించి పోలీసులకు సమాచారమిస్తాయి. వాళ్లు వెంటనే వాహనాన్ని ఆపి డ్రైవర్‌ను చెక్ చేస్తారు.
తాగి నడిపేవారిని పట్టుకోవడానికి ఏఐ సాయంతో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కెమెరా ఇది. అత్యాధునిక హెడ్సప్ పరికరంతో తయారు చేసిన ఈ కెమెరాలను బ్రిటన్ పోలీసులు ప్రయోగాత్మకంగా వాడి చూస్తున్నారు. ఈ కెమెరాలు డ్రైవర్లకు కనిపించవు. వీటిని అక్యూసెన్సస్ అనే సంస్థ తయారు చేసింది. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్లు వాడే, సీటు బెల్టు పెట్టుకోని డ్రైవర్లను పట్టుకోవడానికి గతంలో పోలీసులు ఈ సంస్థ కెమెరాల ను వాడారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి ఆస్కారం ఆరు రెట్లు ఎక్కువ. అలాంటివారిని ముందే గుర్తించగలిగితే అనేక ప్రాణాలు కాపాడొచ్చనేది అక్యూసెన్సస్ మోటో. కానీ పోలీసులు అంతటా కాపలా కాయలేరు. ‘‘కనుక ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ప్రమాదాలను తగ్గించడానికి చేపడుతున్న చర్యల్లో ఇదో భాగం’’అంటున్నారు బ్రిటన్ పోలీసులు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment