British Police
-
ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు పోలీసుల వార్నింగ్..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవం ఎదురైంది. అభిమానితో దురుసుగా ప్రవర్తించిన కారణంగా పోలీసులు రొనాల్డోను హెచ్చరించారు. విషయంలోకి వెళితే.. గత ఏప్రిల్ 9న గూడిసన్ పార్క్ వేదికగా ఎవర్టన్ ఎఫ్‌సీ, మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గాయపడ్డాడు. మ్యాచ్‌ను కూడా 1-0తో ఎవర్టన్ ఎఫ్‌సీ కైవసం చేసుకుంది. దీంతో మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పెవిలియన్ వెళ్తున్న రొనాల్డోను కొంత మంది తన ఫోన్ కెమెరాల్లో బందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవర్టన్ ఎఫ్‌సీ అభిమాని ఒకరు రొనాల్డోను ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. చిర్రెత్తికొచ్చిన రొనాల్డో ఆవేశంతో అతని ఫోన్‌ను నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కాసేపటి తర్వాత సదరు వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. ఎంత క్షమాపణ చెప్పినా రొనాల్డో చర్య తప్పిదమే. అందుకే బ్రిటీష్ పోలీసులు రొనాల్డో చర్యను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. తాజాగా బుధవారం రొనాల్డోను హెచ్చరిస్తూ ఒక మెసేజ్ పంపారు. 37 ఏళ్ల రొనాల్డో ఉద్దేశపూర్వకంగానే ఒక అభిమానికి సంబంధించిన వస్తువుకు నష్టం కలిగించాడని మా విచారణలో తేలింది. దీనిపై రొనాల్డోను ప్రశ్నించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. వస్తువును ధ్వంసం చేసి క్రిమినల్ డ్యామేజ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు నిజమని తేలడంతో రొనాల్డోకు హెచ్చరికలు జారీ చేసినట్లు బ్రిటీష్ పోలీసులు తెలిపారు. Cristiano Ronaldo has been cautioned by police after knocking a phone from a supporter's hand at Everton in April. (🎥 @Evertonhub) pic.twitter.com/MY3vVjq5mm — ESPN FC (@ESPNFC) August 17, 2022 చదవండి: అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు Vijender Singh: 19 నెలలు గ్యాప్ వచ్చినా.. ఏ మాత్రం తగ్గని జోరు -
రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
లండన్ : లండన్ చేరింగ్ క్రాస్ రైల్వేస్టేషన్లో బాంబుతో సంచరిస్తున్నట్టు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. తన వద్ద బాంబు ఉందన్న వ్యక్తిని బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్‌పై నిలుచున్న ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని చెప్పడంతో బ్రిటిష్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణీకులు, సిబ్బందిని హుటాహుటిన బయటకు పంపిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా నిమిషాల్లో స్టేషన్‌ను ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున సాయుధ బలగాలను స్టేషన్‌కు రప్పించి, అడుగడుగునా జల్లెడ పట్టారు. కాగా, బాంబు ఉందని హెచ్చరించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో సేవలు పునరుద్ధరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పోలీస్ ప్రతినిధి వెల్లడించారు. అండర్‌గ్రౌండ్ సర్వీసులను అధికారులు క్రమబద్ధీకరించారని, ప్రయాణీకులు ట్రైన్ షెడ్యూల్స్‌లో మార్పులు గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. -
అమ్మాయిల కోసం 20వేల మంది ఆన్లైన్ వేట
లండన్ : బ్రిటన్‌లో ఆన్లైన్ వేదికగా మైనర్ బాలికల కోసం 20 వేల మంది పురుషులు వేట సాగించారని ఆ దేశ పోలీసులు తెలిపారు. మైనర్లపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఈ ఒక్క ఏడాదే వీటికి సంబంధించిన 70వేల ఫిర్యాదులు బ్రీటీష్ నేషనల్ క్రైమ్ ఏజన్సీకి అందాయన్నారు. 2006లో ఈ సంఖ్య 6వేలు ఉండగా ఇప్పుడిన్ని ఫిర్యాదులు రావడం కలవరపెడుతుందన్నారు. చిన్నారుల సంరక్షణ పోలీసు అధికారి మాట్లాడుతూ.. 2017లో యూకే వ్యాప్తంగా ఆన్లైన్ వేదికగా అమ్మాయిల కోసం వెతికిన సుమారు 4వేల మందిని గుర్తించామన్నారు. ఈ సంఖ్య 20వేల వరకు ఉండొచ్చాన్నారు. మైనర్లపై వేధింపులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 31 శాతం పెరిగాయని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. యూకే వ్యాప్తంగా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడే నేరస్థులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారని పేర్కొన్నారు. ఆన్లైన్లో గడిపే చిన్నారులు లైవ్‌స్ట్రీమింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయంలో టెక్ కంపెనీలు ఫేస్బుక్, ట్విట్టర్లకు సూచనలు చేశామన్నారు. ఆన్లైన్ ఆసరా చేసుకొని కొంతమంది పురుషులు చిన్నారులను లైంగిక ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఇవి తెలియక అమాయక మైనర్లు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. చిన్నారుల విషయంలో తల్లితండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. -
‘ఒంటరిగానే ఈ పని చేశాడనుకుంటున్నాం’
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడి యత్నం ఘటనకు సంబంధించి ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్ అధికారి మార్క్ రౌలే చెప్పారు. థేమ్స్ నది బ్రిడ్జిపై కారుతో విధ్వంసం సృష్టించి దాదాపు 40మందిని గాయపరిచిన దుండగుడు అనంతరం నేరుగా పార్లమెంటు రెయిలింగ్ వద్దకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఓ పోలీసు అధికారిని చంపి అనంతరం బలగాల కాల్పుల్లో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి తాజా వివరాలు వెల్లడించిన మార్క్ రౌలే.. లండన్, బర్మింగ్హామ్లలో విచారణలో భాగంగా గాలింపులు చేపడుతున్నారు. వేరే వాళ్ల ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందా అనే యోచన చేస్తున్నామన్నారు. అయితే, అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రేరేపితుడై అతడొక్కడే ఈ దాడికి దిగినట్లు విశ్వసిస్తున్నామని అన్నారు. ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువగా చెప్పలేమన్నారు. ఈ దాడిలో దుండగుడితో సహా నలుగురు చనిపోయారని చెప్పారు. మృత్యువాతపడిన వారు వేరు వేరు ప్రాంతాలకు చెందినవారని వారి వివరాలు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం 29మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. -
ట్వంటీ20 స్పాట్ ఫిక్సింగ్: మరొకరి అరెస్ట్
లండన్: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ పై దృష్టిపెట్టిన బ్రిటన్ జాతీయ నేర విభాగం షెఫీల్డ్ లో స్థానిక పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి బెయిల్ పై విడుదలనట్లు తెలిపింది. ఫిబ్రవరి 13న పాక్ క్రికెటర్లు నాసిర్ జంషెడ్, యూసఫ్ లను అదుపులోకి తీసుకోగా రెండు రోజుల అనంతరం ఏప్రిల్ వరకు బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చారు. పీఎస్ఎల్ కు సంబంధించి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డార్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు పాక్ క్రికెటర్లు షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ లకు రెండు వారాల గడువిస్తూ వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. గత శనివారం పీసీబీ ఈ ఇద్దరు క్రికెటర్ల విషయాన్ని మీడియాకు వెల్లడించింది. మరోవైపు ఫిక్సింగ్ ఆరోపణలతో పీసీబీ ఇదివరకే.. ఇస్లామాబాద్ యూనైటెడ్ ప్లేయర్ షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ ను సస్పెండ్ చేసింది. పీఎస్ఎల్ లో పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై బ్రిటన్ ఎన్సీఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫిక్సింగ్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో మరికొందరిపై నిఘా పెట్టింది. షార్జిల్, లతీఫ్ మాత్రం తమకు ఫిక్సింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని, తమపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వివరాలపై మాట్లాడేందుకు పీసీబీ నిరాకరిస్తోంది. -
బ్రెగ్జిట్‌కు ఓటేసి తప్పు చేశాం!
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలగాలా? వద్దా? అనే అంశంపై జూన్ 23న జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో వైదొలగటానికి (బ్రెగ్జిట్‌కి) అనుకూలంగా ఓటేసినందుకు 23 లక్షల మంది బ్రిటన్ పౌరులు చింతిస్తున్నట్లు ఒపీనియమ్ సర్వే చెప్తోంది. బ్రెగ్జిట్‌లో ఈయూను వీడాలంటూ ఓటేసిన వారిలో 7 శాతం మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. తమకు మళ్లీ అవకాశం ఉంటే ఈయూలో కొనసాగాలని ఓటేస్తామన్నారు. అంటే.. బ్రెగ్జిట్ ఫలితాల్లో అనుకూలంగా పోలైన ఓట్ల నుంచి ఈ 23 లక్షల మంది ఓట్లను తీసేస్తే.. ఆ ఫలితాలు తారుమారవుతాయి. అలాగే.. ఈయూలో కొనసాగాలంటూ ఓటేసిన వారిలో సైతం మూడు శాతం మంది దానిపై విచారం వ్యక్తం చే శారు. మరోపక్క.. బ్రె గ్జిట్ ఫలితాల ప్రకటన అనంతరం బ్రిటన్‌లో జాతి విద్వేష పూరిత నేరాలు పెరిగాయి. ఇటువంటి నేరాలకు సంబంధించి గత వారం రోజుల్లో 331 కేసులను బ్రిటన్ పోలీసులు నమోదు చేశారు. -
85 ఏళ్ల తర్వాత భగత్‌సింగ్ కేసు విచారణ
లాహోర్: బ్రిటీష్ పోలీసు అధికారి శాండర్స్ హత్యకేసులో విప్లవవీరుడు భగత్ సింగ్ నిర్దోషి అంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం నుంచి లాహోర్ హైకోర్టు విచారించనుంది. పాక్‌లోని భగత్ స్మారక ఫౌండేషన్ చైర్మన్, అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి ఈ పిటిషన్ వేశారు. ‘శాండర్స్ కేసులో గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత భగత్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులపై నేరం మోపారు. ఈ కేసులో వీరు జీవితఖైదు అనుభవిస్తుండగానే.. కావాలనే వేరే కేసులో ఇరికించి వీరికి ఉరిశిక్ష అమలు చేశారు’ అని ఖురేషి పేర్కొన్నారు. -
చట్టంపై న్యాయపోరాటం
చేయని నేరం అక్కడి చట్టానికి కళ్లు మాత్రమే కాదు, నిరపరాధుల పట్ల కనీసమైన దయాదాక్షిణ్యాలూ లేకుండా పోయాయి. చేయని నేరానికి వాళ్లంతా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిన తర్వాత, కోర్టుల్లో జరిగిన విచారణల ప్రహసనాల తర్వాత నిరపరాధులుగా విడుదలయ్యారు. ఆలస్యంగానైనా చట్టం మెలకువ తెచ్చుకొని తన పనిని తాను చేసుకు పోయినందుకు సంతోషమే! అయితే, అన్యాయంగా జైళ్లలో మగ్గిన ఆ అమాయకులకు ఎలాంటి పరిహారం చెల్లించనివ్వకుండా అక్కడి చట్టమే అడ్డుపడుతోంది. ఇది నియంతృత్వ దేశాల్లో కాదు, ఆధునిక ప్రపంచానికి ప్రజాస్వామ్య ప్రవచనాలు చెప్పే అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్‌ది. బ్రిటన్‌కు హోంశాఖ మంత్రిగా వెలగబెట్టిన చార్లెస్ క్లార్క్‌కు 2007లో తట్టిన ఆలోచనకు ఫలితమే ఇది. అన్యాయంగా జైళ్లలో మగ్గిన నిరపరాధులకు చెల్లించే పరిహార పథకాన్ని రద్దుచేస్తే, ఖజానాకు బోలెడంత సొమ్ము మిగులుతుందనేది క్లార్క్ ఆలోచన. పార్లమెంటులో చర్చోపచర్చల తర్వాత ఈ పరిహార పథకాన్ని రద్దుచేస్తూ 2014లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. ఇది చాలా అమానుషమైన చట్టం అంటూ మానవ హక్కుల బృందాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. అయితే నిరపరాధులుగా విడుదలైన ఖైదీలు మాత్రం బ్రిటన్ న్యాయశాఖ మంత్రి క్రిస్ గ్రేలింగ్పై న్యాయ పోరాటానికి నడుం బిగించారు. వారిలో ఇద్దరి గాథలు.. డీఎన్ఏ పరీక్షలైనా చేయకుండానే... విక్టర్ నీలన్ సాదాసీదా పోస్ట్‌మ్యాన్. చేయని నేరానికి పదిహేడేళ్లు జైలులో మగ్గిపోయాడు. రెడిచ్ పట్టణంలోని ఒక నైట్‌క్లబ్ వెలుపల 1997లో ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆ కేసులో బ్రిటిష్ పోలీసులు నీలన్ను లోపలేశారు. బాధితురాలి దుస్తుల నుంచి సేకరించిన నమూనాలపై డీఎన్ఏ పరీక్షలను నిర్వహించకుండా, ప్రాసంగిక సాక్ష్యాల (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్) ఆధారంగా అతడిని ఏకపక్షంగా అపరాధిగా తేల్చేశారు. నిందితుడిని గుర్తించడానికి నిర్వహించిన ఐడీ పరేడ్ కూడా తూతూ మంత్రంగా కానిచ్చేశారు. నిజానికి జరిగినదేమిటంటే... బాధితురాలి దుస్తులను సేకరించారు. అయితే, వాటి నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం పంపకుండా, సీలు వేసి భద్రంగా దాచిపెట్టారు. బాధితురాలి దుస్తులపై పోలీసులు డీఎన్ఏ పరీక్షలే నిర్వహించలేదంటూ న్యాయం కోసం నీలన్ అప్పీలు చేసుకున్నాడు. క్రిమినల్ కేసుల రివ్యూ కమిషన్ ఆ అప్పీలును తోసిపుచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా నీలన్ మరో రెండుసార్లు అప్పీలు చేసుకున్నాడు. కోర్టు అతడి మూడో అప్పీలును విచారణకు స్వీకరించింది. కేసు తిరగదోడితే, నీలన్ నిరపరాధి అని తేలింది. కోర్టు తీర్పు ఫలితంగా 2013 డిసెంబర్లో నీలన్ విడుదలయ్యాడు. నీలన్ తరఫున అతడి న్యాయవాది మార్క్ న్యూబీ సర్కారుతో అమీ తుమీ తేల్చుకోవడానికి పోరాటం ప్రారంభించాడు. శిక్ష ఫలితంగా నీలన్ ఉద్యోగాన్ని, డబ్బును, అయిన వారిని పోగొట్టుకున్నాడని, తప్పుడు తీర్పు వల్ల తీవ్రంగా నష్టపోయాడని, ప్రభుత్వం దానికి పరిహారం చెల్లించాల్సిందేనని మార్క్ న్యూబీ అంటున్నాడు. సీసీటీవీ సాక్ష్యమైనా లేకుండానే... శామ్ హల్లామ్ది మరో గాథ. పదిహేడేళ్ల ప్రాయంలో ఒక హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. లండన్‌లోని సెయింట్ ల్యూక్ ఎస్టేట్ వద్ద 2004 అక్టోబర్‌లో ఎస్సాస్ కసాహున్ అనే యువకుడిపై దుండగులు దాడిచేశారు. అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు హల్లామ్ను పట్టుకున్నారు. ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో కొందరు ‘ప్రత్యక్ష’ సాక్షులు దాడికి పాల్పడింది అతడేనని చెప్పారు. ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలను గానీ, సీసీటీవీ దృశ్యాలను గానీ సాక్ష్యాధారాలుగా ప్రవేశపెట్టలేదు. సంఘటనా స్థలంలో తాను లేను మొర్రో అని హాల్లామ్ మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది. అయితే, శామ్ అప్పీలును పరిగణనలోకి తీసుకున్న క్రిమినల్ కేసుల రివ్యూ కమిషన్ తిరిగి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. థేమ్స్‌వ్యాలీ పోలీసు అధికారి దర్యాప్తులో జరిగిన హత్యకు, శామ్ హల్లామ్కు సంబంధం లేదని తేలింది. తాజా దర్యాప్తు ఫలితాలను పరిశీలించిన కోర్టు, 2012లో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. అయితే, అతడికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు. హెలెనా కెన్నడీ అనే న్యాయవాది శామ్కు పరిహారం కోసం న్యాయపోరాటం సాగిస్తోంది. చేయని నేరానికి శిక్ష అనుభవించిన నిరపరాధులకు పరిహారం చెల్లించాల్సిందేనని, దీనిని అడ్డుకునే చట్టంపై విస్తృతంగా చర్చ జరగాలని ఆమె అంటోంది.