‘ఒంటరిగానే ఈ పని చేశాడనుకుంటున్నాం’
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడి యత్నం ఘటనకు సంబంధించి ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్ అధికారి మార్క్ రౌలే చెప్పారు. థేమ్స్ నది బ్రిడ్జిపై కారుతో విధ్వంసం సృష్టించి దాదాపు 40మందిని గాయపరిచిన దుండగుడు అనంతరం నేరుగా పార్లమెంటు రెయిలింగ్ వద్దకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఓ పోలీసు అధికారిని చంపి అనంతరం బలగాల కాల్పుల్లో చనిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించి తాజా వివరాలు వెల్లడించిన మార్క్ రౌలే.. లండన్, బర్మింగ్‌హామ్‌లలో విచారణలో భాగంగా గాలింపులు చేపడుతున్నారు. వేరే వాళ్ల ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందా అనే యోచన చేస్తున్నామన్నారు. అయితే, అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రేరేపితుడై అతడొక్కడే ఈ దాడికి దిగినట్లు విశ్వసిస్తున్నామని అన్నారు. ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువగా చెప్పలేమన్నారు. ఈ దాడిలో దుండగుడితో సహా నలుగురు చనిపోయారని చెప్పారు. మృత్యువాతపడిన వారు వేరు వేరు ప్రాంతాలకు చెందినవారని వారి వివరాలు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం 29మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని వివరించారు.