london attack
-
‘నా కొడుకు ఇలా చేస్తాడనుకోలేదు.. అదో పీడకలె’
లండన్: తన కుమారుడు ఇలా చేస్తాడని తను అస్సలు ఊహించలేదని బ్రిటన్‌లోని లండన్ నగరంలో ఓ మసీదు వద్ద ముస్లింలను లక్ష్యంగా చేసుకొని వ్యాన్‌తో ఢీకొట్టి తొక్కించిన వ్యక్తి డారెన్ ఓస్బోర్న్ తల్లి చెప్పింది. తన కొడుకు ఉగ్రవాది కాదని, గతంలో ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవరించలేదని తెలిపింది. ‘ఆ రోజు జరిగిన దుర్ఘటనలో బాధితులైన వారందరి తరుపున మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను. అలాంటి సంఘటన ప్రతి తల్లికి ఓ పీడకల. ఏ తల్లి తన కుమారుడిని అలా చూడాలని అనుకోదు’అని ఆమె చెప్పింది. మరోపక్క, అతడు నివాసం ఉండే చుట్టుపక్కల వారు కూడా డారెన్ మంచివాడని, సన్నిహితుడిగా ఉండేవాడని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి ఇటీవల కాలంలోనే ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితుడై ఉండొచ్చని భావిస్తున్నారు. లండన్‌లోని ఫిన్స్‌బరీ పార్క్‌లోగల సెవెన్ సిస్టర్ రోడ్డులోని ఓ మసీదు వద్ద ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లింలపైకి డారెన్ ఓ వ్యాన్‌ను తీసుకొని ఢీకొట్టించి తొక్కేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలుకోల్పోగా మరొకరు పన్నెండుమంది గాయాలపాలయ్యారు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులకు పలు విషయాలు తెలిసాయి. ఇటీవల ఓ పబ్‌కు వెళ్లినప్పుడు కూడా డారెన్ అందులో ముస్లింలతో గొడవపడుతుంటే అందులో నుంచి బయటకు తోసేశారని, ఆ తర్వాత అతడి పార్ట్నర్ కూడా అతడిని వదిలేశాడని తెలిసింది. పబ్‌కు వెళ్లిన ప్రతిసారి ముస్లింలను తిడుతుండేవాడని, వారికి ఏదో ఒక రోజు పెద్ద నష్టాన్ని కలగజేస్తానని చెబుతుండేవాడని అదే పబ్‌కు రెగ్యులర్‌గా వెళుతున్న ఓ వ్యక్తి పోలీసులకు చెప్పారు. -
లండన్‌లో మళ్లీ ఉగ్రదాడి
♦ మసీదు వద్ద పాదచారులపై దూసుకెళ్లిన వ్యాన్ ♦ ఒకరి మృతి, 10 మందికి గాయాలు.. ‘వ్యాన్’ దుండగుడి అరెస్ట్ లండన్: బ్రిటన్ రాజధాని లండన్ మళ్లీ ఉగ్రవాద దాడితో ఉలిక్కిపడింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక సెవెన్ సిస్టర్స్ రోడ్డులోని మసీదు వెలుపల భక్తులపైనుంచి ఓ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. వ్యాన్ నడిపిన దుండగుడిని అరెస్ట్ చేశారు. బ్రిటన్‌లో గత నాలుగు నెలల్లో ఇది నాలుగో ఉగ్రదాడి. సెవెన్ సిస్టర్స్ రోడ్డులోని ముస్లిం వెల్ఫేర్ హౌస్‌లో భక్తులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని బయటకి వస్తుండగా ఒక వ్యక్తి కిందపడిపోయాడు. కొందరు అతనికి ప్రథమ చికిత్స చేస్తుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్ పేవ్మెంట్ ఎక్కి పాదచారులపై నుంచి దూసుకెళ్లింది. అప్పటికే కిందపడిపోయిన వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతడు వ్యాన్‌దాడిలోనే చనిపోయాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. నిందితుణ్ని వేల్స్‌లోని కార్డిఫ్‌లో నివసిస్తున్న డారెన్ ఆస్బర్న్(47) అనే వ్యక్తిగా గుర్తించారు. అతనికి నలుగురు పిల్లలున్నారు. ముస్లింలందర్నీ చంపుతా: దుండగుడు ‘నేను ముస్లింలందర్నీ చంపుతాను’ అని దుండగుడుఅరిచినట్లు అతనికి దేహశుద్ధి చేసిన అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి తెలిపాడు. దుండగుడిని కొట్టొద్దని ఇమామ్ ప్రజలను వారించారు. ‘నేను చేయాల్సిన పని చేశాను’ అని దుండగుడు ఇమామ్‌తో చెప్పాడు. నిందితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వ్యాన్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని కొందరు చెప్పగా పోలీసులు తోసిపుచ్చారు. దాడి హేయమైన ఉగ్రవాద చర్య అని బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. ఆమె ఘటనాస్థలికి దగ్గర్లోని ఫిన్స్‌బరీ మసీదును సందర్శించారు. మాలిలో ఉగ్ర పంజా బమాకో: పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని మాలి రాజధాని బమాకోలో ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు ఆ దేశ సైనికుడు కాగా, మిగిలిన ఐదుగురు విదేశీ పర్యాటకులు. మరో 14 మంది గాయపడ్డారు. ఆది వారం మధ్యాహ్నం బమాకో శివారు ప్రాంతంలోని కంగబా లే క్యాంపెమెంట్ రిసార్ట్‌పై కొందరు దుండగులు పర్యాట కులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన ట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నలుగు రు దుండగులు ఆయుధాలతో ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చి కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. -
లండన్ దాడికి పాక్‌లో లింక్ ఉందా?
ఇస్లామాబాద్/లండన్: లండన్‌లో దాడికి కారణమైన పాకిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తుల బంధువు రెస్టారెంట్, ఇళ్లపై పెద్ద మొత్తంలో పాక్ అధికారులు దాడులు నిర్వహించారు. లండన్ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అనే కోణంలో సెర్చింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇటీవల లండన్ బ్రిడ్జిపై ఓ వ్యాన్‌తో వెళ్లిన ఖుర్రం బట్ అనే పాక్ సంతతి వ్యక్తి, మొరాకోకు చెందిన లిబియా వ్యక్తి రచిడ్ రిడౌన్స్ బ్రిడ్జిపైన జనాలను తొక్కించిన విషయం తెలిసిందే. అనంతరం కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి లండన్‌లోని పాక్ అధికారులు అందించిన సమాచారం మేరకు తాజా దాడులు నిర్వహించారు. వారు చేసింది జాతి విద్వేషపూరిత దాడినా లేక మరింకేదైననా అని ప్రశ్నించగా కచ్చితంగా జాతి వివక్ష దాడి కాదని, ఆ ఇద్దరు వ్యక్తులు సిరియాలో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు తాము నమ్ముతున్నామని లండన్‌లోని పాక్ అధికారులు నమ్ముతున్నారట. ఇదే విషయాన్ని పాక్‌లోని అంతర్గత భద్రతా అధికారులకు చెప్పడంతోపాటు ఖుర్రంబట్కు పాక్‌లో బంధువులు ఉన్నారని చెప్పిన నేపథ్యంలో తాజా తనిఖీలు చేశారు. ‘బ్రిటన్‌లో ఉన్న మా అధికారులు చెప్పిన ప్రకారం లండన్‌లో జరిగింది జాతి వివక్షతో కూడిన దాడి కాదు.. వారు కచ్చితంగా సిరియాలో శిక్షణ పూర్తి చేశారు. ఆ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం బంధువు రెస్టారెంటు, ఇళ్లపైనా సోదాలు నిర్వహిస్తున్నాం. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వివరాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇదంతా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే’ అని పాక్ అధికారులు చెప్పారు. -
‘మా ఆయన అలా చేస్తాడనుకోలేదు’
లండన్: తన భర్త ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని బ్రిటన్ పార్లమెంట్ పై దాడికి ప్రయత్నించి హతమైన ఉగ్రవాది ఖలీద్ మసూద్ భార్య రోహే హైదరా పేర్కొంది. మసూద్ చర్యతో దిగ్భ్రాంతికి గురయ్యానని, దాడికి ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షించింది. మెట్రోపాలిటన్ పోలీసుల ద్వారా యూకే ప్రెస్ అసోసియేషన్ కు ప్రతికా ప్రకటన విడుదల చేసింది. ‘ఖలీద్ చేసిన పని నాకెంతో బాధ, దిగ్భ్రాంతి కలిగించింది. అతడి చర్యను పూర్తిగా ఖండిస్తున్నాను. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెల్పుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబాన్ని ఏకాంతంగా వదిలేయాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా పిల్లల కోసం మమ్మల్ని ఒంటరిగా వదిలేయాల’ని రోహే హైదరా వేడుకుంది. బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా గత బుధవారం లండన్ లో ఖలీద్ మసూద్ జరిపిన దాడిలో పోలీసు అధికారితో సహా నలుగురు మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఖలీద్ హతమయ్యాడు. -
ఊహించని విషాదం..
లండన్: వారిద్దరికి పెళ్లయి 25 ఏళ్లైంది. ఈ వారంలో తమ పెళ్లిరోజును ఘనంగా నిర్వహించుకోవాలని భావించారు. కానీ ‘ఉగ్ర’భూతం వారి ఆశలను వమ్ము చేసింది. వివాహ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలకున్న ఆ దంపతులకు ఊహించని విషాదం ఎదురైంది. లండన్ లో జరిగిన ఉగ్రదాడిలో భర్త చనిపోగా, భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైంది. బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది బుధవారం సాగించిన దమనకాండలో కర్త్ కొక్రన్ అనే అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్య మిలిసా గాయాలపాలైంది. అమెరికాలోని ఉతాహ్ ప్రాంతానికి చెందిన ఈ దంపతులు లండన్ కు వచ్చి ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై ఉగ్రవాది కారుతో దూసుకురావడంతో గాయాలపాలై కర్త్ చనిపోయాడని మిలిసా సోదరి సారా పేనె-మెక్ ఫర్లాండ్ తెలిపింది. తన సోదరి తీవ్రగాయాలతో చావుబతుల్లో ఉందని వెల్లడించింది. ‘మిలిసా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. మా గుండె పగిలింది. మరో చావును చూడడానికి సిద్ధంగా లేము. మాకెంతో ఇష్టమైన బావను పోగొట్టుకున్నాం. కర్త్.. నువ్వు నిజమైన హీరోవి. నిన్ను ఎప్పటికీ మర్చిపోమ’ని సారా తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. మిలిసా, కర్ట్ దంపతులు పదేళ్ల నుంచి రికార్డింగ్ స్టూడియో నడుపుతున్నారని సోషల్ మీడియా ద్వారా వెల్లడైంది. కర్ట్ మృతి తమను ఎంతగానో కలిసి వేసిందని మిలిసా సోదరుడు క్లింట్ పేనె పేర్కొన్నాడు. కర్ట్ చాలా మంచివాడని, తమ సోదరిని బాగా చూసుకునే వాడని వెల్లడించాడు. సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి: ‘లండన్’ దాడి మా పనే! బ్రిటన్ పార్లమెంట్‌పై టెర్రర్ అటాక్ లండన్ లో దాడి బాధాకరం: ప్రధాని మోదీ లండన్ టెర్రర్ అటాక్: భారతీయులు సేఫ్! బ్రసెల్స్ దాడి జరిగిన రోజే లండన్ లో... -
‘లండన్’ దాడి మా పనే!
-
‘లండన్’ దాడి మా పనే!
♦ ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటన ♦ దుండగుడ్ని ఖాలిద్ మసూద్‌గా గుర్తించిన పోలీసులు ♦ దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ప్రపంచ దేశాధినేతలు లండన్: బ్రిటన్ పార్లమెంట్‌పై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకుంది. సంకీర్ణ దళాల దాడులకు ప్రతీకారంగానే దాడి చేశామని వెల్లడించింది. మరోవైపు బుధవారం నాటి ఉగ్రదాడితో బ్రిటన్ భయపడలేదని, యథాప్రకారం పార్లమెంట్ సమావేశమైందని, ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఆ దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంట్‌పై దాడి జరిగిన 24 గంటల్లోపే గురువారం హౌస్ ఆఫ్ కామన్స్‌ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దుండగుడు ఇస్లామిక్ భావజాలంతో ప్రభావితమయ్యాడని, పోలీసులకు అతని వివరాలు తెలుసని, తర్వాత వెల్లడిస్తామని మే చెప్పారు. అయితే దుండగుడ్ని ఖాలిద్ మసూద్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఉగ్రదాడికి సంబంధించి 8 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బ్రిటన్ పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు, ఒక పోలీసు అధికారి సహా ఐసిస్ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే. ‘ఉగ్రవాద చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసినా ఆ బెదిరింపులకు మనం భయపడలేదు. ఈ రోజు యథాప్రకారం సమావేశమయ్యాం. ఉగ్రవాదానికి మేం భయపడలేదు అన్న సందేశాన్ని మన పూర్వీకులు చెప్పారు, భవిష్యత్ తరాలు కూడా చాటి చెప్తాయి. ఎప్పటికైనా ప్రజాస్వామ్య విలువలదే పైచేయ’ని ప్రధాని మే ఉద్ఘాటించారు. పార్లమెంట్‌పై దాడి చేసింది బ్రిటన్‌లో జన్మించిన వ్యక్తేనని , హింసాత్మక కార్యక్రమాలతో సంబంధాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం పోలీసులు అతన్ని విచారించారని మే వెల్లడించారు. దుండగులు దాడికి పాల్పడతాడనే ముందస్తు నిఘా సమచారం లేదని, ఒక్కడే ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు నమ్ముతున్నారని ఆమె తెలిపారు. సంకీర్ణ సేనలకు వ్యతిరేకంగానే దాడి: ఇస్లామిక్ స్టేట్ థెరిసా మే ప్రసంగం ముగిసిన వెంటనే దాడికి తామే సూత్రధారులమంటూ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీలో ఆ వివరాల్ని వెల్లడించింది. ఐఎస్‌పై సంకీర్ణ దేశాల దాడులకు వ్యతిరేకంగా దాడి చేసినట్లు ప్రకటించింది. కాగా లండన్, బర్మింగ్‌హామ్ నగరాల్లో గురువారం పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మంది అనుమానితుల్ని అరెస్టు చేశారు. దాడి కోసం దుండగుడు వినియోగించిన కారును బర్మింగ్హమ్లోని సొలిహల్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్నట్లు తేల్చారు. విచారణ కీలక దశలో ఉందని, ఉగ్రవాది సమాచారం ప్రస్తుతం వెల్లడించలేమని స్కాట్లాండ్ యార్డ్ తాత్కాలిక డిప్యూటీ కమిషనర్ మార్క్ రౌలే చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అనుమానితుల సమాచారం ఎప్పటికప్పుడూ పోలీసులకు చెప్పాలని ఆయన కోరారు. పోలీసుల వార్షిక సెలవులు రద్దు చేసి 24 గంటలూ పహారా పెంచామన్నారు. మరోవైపు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంఘీభావంగా ట్రఫాల్గర్ స్క్వేర్‌లో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతుల కుటుంబాలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ సానుభూతి తెలిపారు. ప్రపంచ దేశాధినేతల సంఘీభావం: లండన్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బ్రిటన్‌కు భారత్ సాయంగా ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రపంచ నేతలు బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు ఫోన్ చేసి అండగా ఉంటామని చెప్పారు. దాడి సమయంలో బ్రిటన్ భద్రతా దళాలు వేగంగా స్పందించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టేందుకు బ్రిటన్‌కు అవసరమైన సాయం చేస్తామన్నారు. ఉగ్రవాదం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోందని, బ్రిటన్ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫ్రాన్స్‌కు తెలుసని, తాము కూడా ఉగ్ర బాధితులమేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హŸలాండే అన్నారు. బ్రిటన్ ప్రజలకు జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో వారి పక్షాన ఉంటామని హామీనిచ్చారు. మరిన్ని దాడులపై నిఘా సమాచారం లేదు: మే బ్రిటన్‌కు ఉగ్రవాద ముప్పు ‘తీవ్ర స్థాయి’లో ఉందని దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. మరిన్ని దాడులు జరగవచ్చన్న దానిపై ఎలాంటి నిఘా సమాచారం లేనందున దాన్ని ‘అతి తీవ్రస్థాయి’కి పెంచడం లేదన్నారు. దాడి వివరాలు వెల్లడిస్తూ.. ‘దుండగుడు వేగంగా కారు నడుపుకుంటూ వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జ్ దాటుతున్న పాదచారులపై దూసుకెళ్లాడు. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, దాదాపు 40 మంది గాయపడ్డారు. అనంతరం పార్లమెంట్ వద్ద ఉన్న క్యారేజీ గేట్స్ వద్ద కారు వదిలి పోలీసు అధికారిపై పెద్ద కత్తితో దాడిచేశాడు. అదే సమయంలో మరో అధికారి ఆ దుండగుడ్ని కాల్చి చంపాడు’ అని చెప్పారు. పలుమార్లు జైలుకెళ్లిన దుండగుడు లండన్ ఉగ్రదాడికి పాల్పడిన దుండగుడ్ని ఖాలిద్ మసూద్(52)గా గుర్తించారు. బ్రిటన్‌లోని కెంట్‌లో జన్మించిన అతను గతంలో కొన్ని హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడడంతో జైలుశిక్ష అనుభవించినట్లు తెలిసింది. విధ్వంసానికి పాల్పడినందుకు 1983లో శిక్ష అనుభవించగా, కత్తి కలిగిఉన్నందుకు 2003లో విచారణ ఎదుర్కొన్నాడు. గతంలో అతనికి ఉగ్రవాద సంబంధాలు లేవని పోలీసులు చెప్పారు. -
‘దాడి చేసింది బ్రిటన్ జాతియుడే’
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తి బ్రిటీష్ పౌరుడేనని ఆ దేశ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఈ విషయం తనకంటే నిఘా వర్గాలకే ఎక్కువగా తెలుసని అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం దాడికి పాల్పడిన వ్యక్తినే గతంలో ఎంఐ5 ఇంటెలిజెన్స్ విభాగం విచారించిందని, గతంలో కూడా అతడు తీవ్రవాదం తాలుకు చర్యలకు పాల్పడిట్లు గురువారం పార్లమెంటులో చెప్పారు. ‘నేను ఏం స్పష్టం చేయగలనంటే పార్లమెంటుపై దాడికి యత్నించిన వ్యక్తి బ్రిటన్ సంతతివాడే. కొన్నేళ్లకిందట అతడిని ఇంటెలిజెన్స్ విభాగం విచారించింది కూడా. ఈ విషయం వారికే బాగా తెలుసు’ అని గురువారం తెలిపారు. ఉగ్రవాదం ఎట్టిపరిస్థితుల్లో పై చేయి సాధించరాదని అన్నారు. ఇలాంటి సమయంలోనే మొత్త బ్రిటీషు జాతి మనోధైర్యంగా ఉంటూ మన విలువలను సంరక్షించుకోవాలని అన్నారు. ఇలా చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని తేలికగా ఓడించవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
వాహనాలతో చంపుతారా? ఉగ్రవాదులను ఆపేదెలా?
లండన్: విశాల వీధులు, పాద చారులు నడిచి వెళ్లేందుకు పెద్ద పెద్ద ఫుట్‌పాత్‌లు.. ఇలాంటివన్నీ కూడా లండన్ సొంతం. అలాగే, ఇతర యూరప్ దేశాల్లో కూడా. ఇప్పుడు ఇలాంటి నగరాలనే ఉగ్రవాదులు ప్రధానంగా ఎంచుకుంటున్నారు. గతంలో మాదిరిగా తుపాకులు బాంబులకంటే వాహనాలే సాధారణ పౌరుల ప్రాణాలు చిదిమేసే మారణాయుధాలుగా ఉపయోగిస్తున్నారు. వీటితో అయితే, కదులుతున్న వ్యక్తి తప్పించుకునే అవకాశం ఉండదు, గురి తప్పదని వారి ఉద్దేశం. పైగా ఇలాంటి దాడులను బలగాలు నియంత్రించడం అంత తేలికైన విషయం కాదు.. మరో వాహనంతో ఆ వాహనాన్ని ఢీకొట్టించడమో లేక, ఆ వాహనం నడుపుతున్న వ్యక్తిని అంతమొందించడమో చేస్తే తప్ప ఆ ఉగ్రవాది రాసే మరణకాండ ఆగదు. ఈ కారణంగానే ఇటీవల ఉగ్రవాదులు వాహనాల ద్వారా ప్రాణాలు తీసే వ్యూహాలు రచిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ‘ఇలాంటి దాడికి ముందస్తుగా ఎలాంటి ప్రత్యేక సన్నద్దత అవసరం లేదు. పైగా దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. పైగా లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తిని వాహనాలతో అయితే వారు చంపేసే అవకాశం ఉంది’ అని ఉగ్రవాద అంశం నిపుణుడు సెబాస్టియన్ పీట్రాసాంత చెప్పారు. ఇలాంటి దాడులు సాధారణంగా ఒక్కరే చేస్తారని, అప్పటికప్పుడు వారి ప్రణాళికలు మార్చుకుంటూ దాడికి దిగుతారని అంటున్నారు. వాహనాలతో దాడికి దిగడం లండన్‌లో మాత్రమే ప్రథమం కాదు. ఇవి 2005లోనే మొదలైనప్పటికీ తాజాగా ప్యారిస్ దాడితో మరింత వెలుగులోకి వచ్చింది. ఓ భారీ ట్రక్‌తో వచ్చిన ఉగ్రవాది జనాలపైకి ఇష్టానుసారం దూసుకెళ్లి 86మందిని హతమార్చాడు. బాస్టిల్ డే సందర్భంగా నైస్ ప్రాంతలో ఈ దారుణం జరిగింది. నైస్‌లో జరిగిన దాడికి తానే కారణం అని ఐసిస్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. బెర్లిన్‌లో కూడా ఇదే తరహా దాడి చోటు చేసుకుని 12మంది ప్రాణాలుకోల్పోయారు. అలాగే, 2008లో సరిగ్గా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనకు ముందు జెరూసలెంలో ఓ పాలస్తీనియన్ ఒక పెద్ద బుల్డోజర్ వేసుకొని వాహనాలపైకి దూసుకెళ్లగా ఆ సమయంలో 16మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా ఉగ్రవాదులు దాడులకు కొత్త పంథాను అనుసరిస్తూ హడలెత్తిస్తున్నారు. సాధారణంగా మారణాయుధాలతో వచ్చే ఉగ్రవాదులనైతే గుర్తించే అవకాశం ఉందికానీ, స్వదేశంలో సామాన్య పౌరుడిగా ఉంటూ ఉగ్రవాద భావజాలం ప్రేరేపితుడై వాహనాల్లో వస్తూ దాడి చేసేవాళ్లను గుర్తించడం పోలీసులకు, బలగాలకు పెద్ద సవాలే అని పలువురు నిపుణులు వాపోతున్నారు. -
‘ఒంటరిగానే ఈ పని చేశాడనుకుంటున్నాం’
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడి యత్నం ఘటనకు సంబంధించి ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్ అధికారి మార్క్ రౌలే చెప్పారు. థేమ్స్ నది బ్రిడ్జిపై కారుతో విధ్వంసం సృష్టించి దాదాపు 40మందిని గాయపరిచిన దుండగుడు అనంతరం నేరుగా పార్లమెంటు రెయిలింగ్ వద్దకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఓ పోలీసు అధికారిని చంపి అనంతరం బలగాల కాల్పుల్లో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి తాజా వివరాలు వెల్లడించిన మార్క్ రౌలే.. లండన్, బర్మింగ్హామ్లలో విచారణలో భాగంగా గాలింపులు చేపడుతున్నారు. వేరే వాళ్ల ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందా అనే యోచన చేస్తున్నామన్నారు. అయితే, అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రేరేపితుడై అతడొక్కడే ఈ దాడికి దిగినట్లు విశ్వసిస్తున్నామని అన్నారు. ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువగా చెప్పలేమన్నారు. ఈ దాడిలో దుండగుడితో సహా నలుగురు చనిపోయారని చెప్పారు. మృత్యువాతపడిన వారు వేరు వేరు ప్రాంతాలకు చెందినవారని వారి వివరాలు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం 29మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. -
లండన్‌లో ఉగ్రదాడి, మహిళ మృతి
-
లండన్‌లో ఉగ్రదాడి, మహిళ మృతి
లండన్‌లోని రసెల్ స్క్వేర్‌లో బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం జరిగింది. కత్తితో దాడి చేసిన ఓ వ్యక్తి ఒక మహిళను చంపడంతో పాటు ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాడు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో.. వెంటనే పోలీసులు దాడిచేసిన వ్యక్తిని అరెస్టుచేశారు. దాడిలో ఆరుగురు గాయపడిన విషయాన్ని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు నిర్ధారించారు. మరో మహిళకు ఘటనా స్థలంలోనే చికిత్స అందించినా, కాసేపటి తర్వాత ఆమె మరణించారు. ఇది బహుశా ఉగ్రదాడి లాంటిదే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకోడానికి ఓ అధికారి స్టన్ గన్ ఉపయోగించాల్సి వచ్చిందని ప్రకటనలో తెలిపారు. బ్రిటిష్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియలేదు.