ఊహించని విషాదం..
లండన్: వారిద్దరికి పెళ్లయి 25 ఏళ్లైంది. ఈ వారంలో తమ పెళ్లిరోజును ఘనంగా నిర్వహించుకోవాలని భావించారు. కానీ ‘ఉగ్ర’భూతం వారి ఆశలను వమ్ము చేసింది. వివాహ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలకున్న ఆ దంపతులకు ఊహించని విషాదం ఎదురైంది. లండన్ లో జరిగిన ఉగ్రదాడిలో భర్త చనిపోగా, భార‍్య తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైంది.
బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది బుధవారం సాగించిన దమనకాండలో కర్త్ కొక్రన్ అనే అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్య మిలిసా గాయాలపాలైంది. అమెరికాలోని ఉతాహ్ ప్రాంతానికి చెందిన ఈ దంపతులు లండన్ కు వచ్చి ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై ఉగ్రవాది కారుతో దూసుకురావడంతో గాయాలపాలై కర్త్ చనిపోయాడని మిలిసా సోదరి సారా పేనె-మెక్ ఫర్లాండ్ తెలిపింది. తన సోదరి తీవ్రగాయాలతో చావుబతుల్లో ఉందని వెల్లడించింది.
‘మిలిసా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. మా గుండె పగిలింది. మరో చావును చూడడానికి సిద్ధంగా లేము. మాకెంతో ఇష్టమైన బావను పోగొట్టుకున్నాం. కర్త్.. నువ్వు నిజమైన హీరోవి. నిన్ను ఎప్పటికీ మర్చిపోమ’ని సారా తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. మిలిసా, కర్ట్ దంపతులు పదేళ్ల నుంచి రికార్డింగ్ స్టూడియో నడుపుతున్నారని సోషల్ మీడియా ద్వారా వెల్లడైంది. కర్ట్ మృతి తమను ఎంతగానో కలిసి వేసిందని మిలిసా సోదరుడు క్లింట్ పేనె పేర్కొన్నాడు. కర్ట్ చాలా మంచివాడని, తమ సోదరిని బాగా చూసుకునే వాడని వెల్లడించాడు.
సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి:
‘లండన్’ దాడి మా పనే!