‘లండన్‌’ దాడి మా పనే! | Islamic State Claims Responsibility for London Attack | Sakshi
Sakshi News home page

‘లండన్‌’ దాడి మా పనే!

Published Fri, Mar 24 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

‘లండన్‌’ దాడి మా పనే!

‘లండన్‌’ దాడి మా పనే!

ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటన
దుండగుడ్ని ఖాలిద్‌ మసూద్‌గా గుర్తించిన పోలీసులు
దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ప్రపంచ దేశాధినేతలు


లండన్‌: బ్రిటన్‌ పార్లమెంట్‌పై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ప్రకటించుకుంది. సంకీర్ణ దళాల దాడులకు ప్రతీకారంగానే దాడి చేశామని వెల్లడించింది. మరోవైపు బుధవారం నాటి ఉగ్రదాడితో బ్రిటన్‌ భయపడలేదని, యథాప్రకారం పార్లమెంట్‌ సమావేశమైందని, ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఆ దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. బ్రిటన్‌ పార్లమెంట్‌పై దాడి జరిగిన 24 గంటల్లోపే గురువారం  హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

దుండగుడు ఇస్లామిక్‌ భావజాలంతో ప్రభావితమయ్యాడని, పోలీసులకు అతని వివరాలు తెలుసని, తర్వాత వెల్లడిస్తామని మే చెప్పారు. అయితే దుండగుడ్ని ఖాలిద్‌ మసూద్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఉగ్రదాడికి సంబంధించి 8 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బ్రిటన్‌ పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు, ఒక పోలీసు అధికారి సహా ఐసిస్‌ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే.

‘ఉగ్రవాద చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసినా ఆ బెదిరింపులకు మనం భయపడలేదు. ఈ రోజు యథాప్రకారం సమావేశమయ్యాం. ఉగ్రవాదానికి మేం భయపడలేదు అన్న సందేశాన్ని మన పూర్వీకులు చెప్పారు, భవిష్యత్‌ తరాలు కూడా చాటి చెప్తాయి. ఎప్పటికైనా ప్రజాస్వామ్య విలువలదే పైచేయ’ని ప్రధాని మే ఉద్ఘాటించారు. పార్లమెంట్‌పై దాడి చేసింది బ్రిటన్‌లో జన్మించిన వ్యక్తేనని , హింసాత్మక కార్యక్రమాలతో సంబంధాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం పోలీసులు అతన్ని విచారించారని మే వెల్లడించారు.  దుండగులు దాడికి పాల్పడతాడనే ముందస్తు నిఘా సమచారం లేదని, ఒక్కడే ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు నమ్ముతున్నారని ఆమె తెలిపారు.

సంకీర్ణ సేనలకు వ్యతిరేకంగానే దాడి: ఇస్లామిక్‌ స్టేట్‌
థెరిసా మే ప్రసంగం ముగిసిన వెంటనే దాడికి తామే సూత్రధారులమంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ పేర్కొంది. ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన అమాక్‌ న్యూస్‌ ఏజెన్సీలో ఆ వివరాల్ని వెల్లడించింది. ఐఎస్‌పై సంకీర్ణ దేశాల దాడులకు వ్యతిరేకంగా దాడి చేసినట్లు ప్రకటించింది. కాగా లండన్, బర్మింగ్‌హామ్‌ నగరాల్లో గురువారం పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మంది అనుమానితుల్ని అరెస్టు చేశారు. దాడి కోసం దుండగుడు వినియోగించిన కారును బర్మింగ్‌హమ్‌లోని సొలిహల్‌ ప్రాంతంలో అద్దెకు తీసుకున్నట్లు తేల్చారు.

విచారణ కీలక దశలో ఉందని, ఉగ్రవాది సమాచారం ప్రస్తుతం వెల్లడించలేమని స్కాట్లాండ్‌ యార్డ్‌ తాత్కాలిక డిప్యూటీ కమిషనర్‌ మార్క్‌ రౌలే చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అనుమానితుల సమాచారం ఎప్పటికప్పుడూ పోలీసులకు చెప్పాలని ఆయన కోరారు. పోలీసుల వార్షిక సెలవులు రద్దు చేసి 24 గంటలూ పహారా పెంచామన్నారు. మరోవైపు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంఘీభావంగా ట్రఫాల్గర్‌ స్క్వేర్‌లో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతుల కుటుంబాలకు బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ సానుభూతి తెలిపారు.   

ప్రపంచ దేశాధినేతల సంఘీభావం: లండన్‌ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బ్రిటన్‌కు భారత్‌ సాయంగా ఉంటుందని ఆయన ట్వీట్‌ చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రపంచ నేతలు బ్రిటన్‌ ప్రధాని థెరెసా మేకు ఫోన్‌ చేసి అండగా ఉంటామని చెప్పారు. దాడి సమయంలో బ్రిటన్‌ భద్రతా దళాలు వేగంగా స్పందించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొనియాడారు. నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టేందుకు బ్రిటన్‌కు అవసరమైన సాయం చేస్తామన్నారు. ఉగ్రవాదం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోందని, బ్రిటన్‌ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫ్రాన్స్‌కు తెలుసని, తాము కూడా ఉగ్ర బాధితులమేనని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్‌ హŸలాండే అన్నారు. బ్రిటన్‌ ప్రజలకు జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌ తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో వారి పక్షాన ఉంటామని హామీనిచ్చారు.

మరిన్ని దాడులపై నిఘా సమాచారం లేదు: మే
బ్రిటన్‌కు ఉగ్రవాద ముప్పు ‘తీవ్ర స్థాయి’లో ఉందని దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. మరిన్ని దాడులు జరగవచ్చన్న దానిపై ఎలాంటి నిఘా సమాచారం లేనందున దాన్ని ‘అతి తీవ్రస్థాయి’కి పెంచడం లేదన్నారు. దాడి వివరాలు వెల్లడిస్తూ.. ‘దుండగుడు వేగంగా కారు నడుపుకుంటూ వెస్ట్‌మినిస్టర్‌ బ్రిడ్జ్‌ దాటుతున్న పాదచారులపై దూసుకెళ్లాడు. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, దాదాపు 40 మంది గాయపడ్డారు. అనంతరం పార్లమెంట్‌ వద్ద ఉన్న క్యారేజీ గేట్స్‌ వద్ద కారు వదిలి పోలీసు అధికారిపై పెద్ద కత్తితో దాడిచేశాడు. అదే సమయంలో మరో అధికారి ఆ దుండగుడ్ని కాల్చి చంపాడు’ అని చెప్పారు.

పలుమార్లు జైలుకెళ్లిన దుండగుడు
లండన్‌ ఉగ్రదాడికి పాల్పడిన దుండగుడ్ని ఖాలిద్‌ మసూద్‌(52)గా గుర్తించారు. బ్రిటన్‌లోని కెంట్‌లో జన్మించిన అతను గతంలో కొన్ని హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడడంతో జైలుశిక్ష అనుభవించినట్లు తెలిసింది. విధ్వంసానికి పాల్పడినందుకు 1983లో శిక్ష అనుభవించగా, కత్తి కలిగిఉన్నందుకు 2003లో విచారణ ఎదుర్కొన్నాడు. గతంలో అతనికి ఉగ్రవాద సంబంధాలు లేవని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement