భద్రతా దళాల కాల్పుల్లో హతమైన ఖలీద్ మసూద్
లండన్: తన భర్త ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని బ్రిటన్ పార్లమెంట్ పై దాడికి ప్రయత్నించి హతమైన ఉగ్రవాది ఖలీద్ మసూద్ భార్య రోహే హైదరా పేర్కొంది. మసూద్ చర్యతో దిగ్భ్రాంతికి గురయ్యానని, దాడికి ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షించింది. మెట్రోపాలిటన్ పోలీసుల ద్వారా యూకే ప్రెస్ అసోసియేషన్ కు ప్రతికా ప్రకటన విడుదల చేసింది.
‘ఖలీద్ చేసిన పని నాకెంతో బాధ, దిగ్భ్రాంతి కలిగించింది. అతడి చర్యను పూర్తిగా ఖండిస్తున్నాను. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెల్పుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబాన్ని ఏకాంతంగా వదిలేయాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా పిల్లల కోసం మమ్మల్ని ఒంటరిగా వదిలేయాల’ని రోహే హైదరా వేడుకుంది.
బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా గత బుధవారం లండన్ లో ఖలీద్ మసూద్ జరిపిన దాడిలో పోలీసు అధికారితో సహా నలుగురు మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఖలీద్ హతమయ్యాడు.