లండన్ దాడికి పాక్‌లో లింక్ ఉందా?
ఇస్లామాబాద్/లండన్: లండన్‌లో దాడికి కారణమైన పాకిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తుల బంధువు రెస్టారెంట్, ఇళ్లపై పెద్ద మొత్తంలో పాక్ అధికారులు దాడులు నిర్వహించారు. లండన్ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అనే కోణంలో సెర్చింగ్ ఆపరేషన్‌లు నిర్వహించారు. ఇటీవల లండన్ బ్రిడ్జిపై ఓ వ్యాన్‌తో వెళ్లిన ఖుర్రం బట్ అనే పాక్ సంతతి వ్యక్తి, మొరాకోకు చెందిన లిబియా వ్యక్తి రచిడ్ రిడౌన్స్ బ్రిడ్జిపైన జనాలను తొక్కించిన విషయం తెలిసిందే. అనంతరం కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ దాడికి సంబంధించి లండన్‌లోని పాక్ అధికారులు అందించిన సమాచారం మేరకు తాజా దాడులు నిర్వహించారు. వారు చేసింది జాతి విద్వేషపూరిత దాడినా లేక మరింకేదైననా అని ప్రశ్నించగా కచ్చితంగా జాతి వివక్ష దాడి కాదని, ఆ ఇద్దరు వ్యక్తులు సిరియాలో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు తాము నమ్ముతున్నామని లండన్‌లోని పాక్ అధికారులు నమ్ముతున్నారట. ఇదే విషయాన్ని పాక్‌లోని అంతర్గత భద్రతా అధికారులకు చెప్పడంతోపాటు ఖుర్రంబట్‌కు పాక్‌లో బంధువులు ఉన్నారని చెప్పిన నేపథ్యంలో తాజా తనిఖీలు చేశారు. ‘బ్రిటన్‌లో ఉన్న మా అధికారులు చెప్పిన ప్రకారం లండన్‌లో జరిగింది జాతి వివక్షతో కూడిన దాడి కాదు.. వారు కచ్చితంగా సిరియాలో శిక్షణ పూర్తి చేశారు. ఆ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం బంధువు రెస్టారెంటు, ఇళ్లపైనా సోదాలు నిర్వహిస్తున్నాం. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వివరాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇదంతా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే’ అని పాక్ అధికారులు చెప్పారు.