SA Vs PAK: 2025లో తొలి డబుల్‌ సెంచరీ | SA Vs PAK 2nd Test: Ryan Rickelton Becomes First South African To Score Double Hundred In Tests, See More Details Inside | Sakshi
Sakshi News home page

SA Vs PAK 2nd Test: 2025లో తొలి డబుల్‌ సెంచరీ

Published Sat, Jan 4 2025 3:50 PM | Last Updated on Sat, Jan 4 2025 4:18 PM

SA VS PAK 2ND TEST: DOUBLE HUNDRED BY RYAN RICKELTON

2025లో తొలి టెస్ట్‌ డబుల్‌ సెంచరీ నమోదైంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ర్యాన్‌ రికెల్టన్‌ ద్విశతకం బాదాడు. ఈ ఏడాది ఇదే మొట్టమొదటి డబుల్‌ సెంచరీ. ఈ ఏడాది తొలి టెస్ట్‌ సెంచరీని కూడా రికెల్టనే సాధించాడు. రికెల్టన్‌ కెరీర్‌లో తన తొలి డబుల్‌ సెంచరీని 266 బంతుల్లో సాధించాడు. 

ఇందులో 24 ఫోర్లు, ఓ సిక్సర్‌ ఉన్నాయి. పాక్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన నాలుగో సౌతాఫ్రికా క్రికెటర్‌గా రికెల్టన్‌ రికార్డుల్లోకెక్కాడు. రికెల్టన్‌కు ముందు ఏబీ డివిలియర్స్‌ (278 నాటౌట్‌), గ్రేమ్‌ స్మిత్‌ (234), హెర్షల్‌ గిబ్స్‌ (228) పాక్‌పై డబుల్‌ సెంచరీలు చేశారు.

తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్‌ సెంచరీలు బాదిన క్రికెటర్లు..
ర్యాన్‌ రికెల్టన్‌ టెస్ట్‌ల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రికెల్టన్‌ ఓపెనర్‌గా దిగిన తొలి మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ సాధించాడు. తొలిసారి ఓపెనర్‌గా వచ్చి అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడు కూడా రికెల్టనే​. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్‌ సెంచరీలు బాదారు.

ర్యాన్‌ రికెల్టన్‌ (సౌతాఫ్రికా)- 211 నాటౌట్‌
బ్రెండన్‌ కురుప్పు (శ్రీలంక)- 201 నాటౌట్‌
గ్రేమీ స్మిత్‌ (సౌతాఫ్రికా)- 200
డెవాన్‌ కాన్వే (న్యూజిలాండ్‌)- 200

నాలుగో వేగవంతమైన ద్విశతకం
పాక్‌పై రికెల్టన్‌ చేసిన ద్విశతకం టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున నాలుగో వేగవంతమైన ద్విశతకం. రికెల్టన్‌ 266 బంతుల్లో డబుల్‌ బాదాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్‌ సెంచరీని హెర్షల్‌ గిబ్స్‌ సాధించాడు. 2003లో పాక్‌పై గిబ్స్‌ 211 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ చేశాడు.

టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్‌ సెంచరీలు..
హెర్షల్‌ గిబ్స్‌- 211 బంతుల్లో
గ్రేమీ స్మిత్‌- 238 బంతుల్లో
గ్యారీ కిర్‌స్టన్‌- 251 బంతుల్లో 
రికెల్టన్‌- 266 బంతుల్లో
జాక్‌ కల్లిస్‌- 267 బంతుల్లో

శతక్కొట్టిన బవుమా
పాక్‌తో రెండో టెస్ట్‌లో రికెల్టన్‌ డబుల్‌ సెంచరీ సాధించగా.. కెప్టెన్‌ టెంబా బవుమా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో బవుమా 106 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బవుమాను ఇది నాలుగో శతకం. ఇటీవలి కాలంలో  భీకర ఫామ్‌లో ఉన్న బవుమా..  గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు చేశాడు.

భారీ స్కోర్‌ దిశగా సౌతాఫ్రికా
పాక్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. ఆ జట్టు 102 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. రికెల్టన్‌ (211), కైల్‌ వెర్రిన్‌ (53) క్రీజ్‌లో ఉన్నారు.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (17), వియాన్‌ ముల్దర్‌ (5), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (0), బవుమా (106), డేవిడ్‌ బెడింగ్హమ్‌ (5) ఔటయ్యారు. పాకిస్తాన్‌ బౌలర్లలో సల్మాన్‌ అఘా , మొహమ్మద్‌ అబ్బాస్‌ తలో రెండు వికెట్లు‌ పడగొట్టగా.. ఖుర్రమ్‌ షెహజాద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌ విజయానంతరం సౌతాఫ్రికా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement