పాకిస్తాన్ దేశవాలీ క్రికెట్‌లో ఓ వింత రనౌట్ చేసుకుంది. కైడ్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో సియాల్‌కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. బౌలర్ రిటర్న్ త్రోను తప్పించుకోబోయి మొహమ్మద్ వాలీద్ గాల్లోకి ఎగరగా.. అదే సమయంలో బంతి వికెట్లను తాకింది. దీంతో వాలీద్ రనౌటయ్యాడు. ఈ వింత రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.
A STRANGE RUN-OUT IN PAKISTAN DOMESTIC CRICKET. 🤯 pic.twitter.com/dCCV6e9DhO
— Johns. (@CricCrazyJohns) January 4, 2025
పూర్తి వివరాల్లో వెళితే.. పెషావర్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ ఖాన్ సంధించిన బంతిని మొహమ్మద్ వాలీద్ డిఫెండ్ చేసుకున్నాడు. ఆ బంతి నేరుగా బౌలర్ ఆమిర్ ఖాన్ చేతుల్లోకి వెళ్లింది. బ్యాటర్ ముందుకు రావడం చూసిన ఆమిర్ ఖాన్ బంతిని వికెట్లపైకి విసిరాడు. అప్పటికే క్రీజ్‌లో ఉన్న వాలీద్ బంతి నుంచి తప్పించుకోబోయి పైకి జంప్ చేశాడు. వాలీద్ గాల్లో ఉండగానే బంతి వికెట్లను తాకింది.
దీంతో పెషావర్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అప్పీల్ రీజనబుల్‌గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశాడు. పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బ్యాటర్ వాలీద్‌ను రనౌట్‌గా ప్రకటించాడు. వాలీద్ గాల్లో ఉన్నప్పుడు బంతి వికెట్లను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనపడింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి విచిత్ర రనౌట్లు చోటు చేసుకోవడం చాలా అరుదు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి రనౌట్ రా సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్ జాతీయ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు తేలిపోవడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా బ్యాటర్లు మూడంకెల స్కోర్ చేశారు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.
టెంబా బవుమా (106), కైల్ వెర్రిన్ (100) సెంచరీ అనంతరం ఔట్ కాగా.. డబుల్ సెంచరీ చేసిన ర్యాన్ రికెల్టన్ (233 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. 123 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోర్ 477/6గా ఉంది. రికెల్టన్‌కు జతగా జన్సెన్ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment