PBKS VS MI, Qualifier 2: ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌ | IPL 2025, Qualifier 2: Punjab Kings Win Over Mumbai Indians | Sakshi
Sakshi News home page

PBKS VS MI, Qualifier 2: ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌

Jun 2 2025 2:15 AM | Updated on Jun 2 2025 8:40 AM

IPL 2025, Qualifier 2: Punjab Kings Win Over Mumbai Indians

రేపే బెంగళూరుతో అమీతుమీ

రెండో క్వాలిఫయర్లో ముంబైకి చెక్‌

5 వికెట్లతో కింగ్స్‌ జయభేరి 

మెరిపించిన వధేరా

గెలిపించిన అయ్యర్‌  

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో ఫైవ్‌స్టార్‌ చాంపియన్లు (ముంబై, చెన్నై), మూడుసార్లు విజేత (కోల్‌కతా)ను చూసిన ఫ్యాన్స్‌ ఈ సీజన్‌లో కొత్త చాంపియన్‌ను చూడబోతున్నారు. తొలి క్వాలిఫయర్లో తేలిపోయిన పంజాబ్‌ కింగ్స్‌ రెండో క్వాలిఫయర్‌లో జూలు 
విదిల్చింది. 11 ఏళ్ల తర్వాత (2014) ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరింది. ఆదివారం శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఇంటికి పంపింది. రేపు జరిగే ఫైనల్లో బెంగళూరు, పంజాబ్‌ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తలపడతాయి. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఠాకూర్‌ తిలక్‌ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. అజ్మ తుల్లా ఒమర్జాయ్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 87 నాటౌట్‌; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్‌ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.    
 
గెలిపించిన అయ్యర్‌ 
పంజాబ్‌కు అంతపెద్ద లక్ష్యం ఛేదించడానికి అవసరమైన శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ (6), కాసేపటికే ప్రియాన్ష్‌ ఆర్య (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుకు చుక్కెదురైంది. దీంతో పవర్‌ప్లేలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన 64/2 స్కోరు చేసింది. ఇన్‌గ్లిస్‌ (21 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసే ఆటను పాండ్యా అడ్డుకున్నాడు. దీంతో 72 పరుగులకే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, నేహల్‌ వాధేరా జట్టు స్కోరును వంద దాటించారు. 

12 ఓవర్లలో 109/3 స్కోరు చేసిన పంజాబ్‌... విజయానికి 48 బంతుల్లో 95 పరుగులు కష్టమనిపించింది. టాప్లీ 13వ ఓవర్లో అయ్యర్‌ కొట్టిన వరుస 3 సిక్స్‌లు, ఆ వెంటనే బౌల్ట్‌ బౌలింగ్‌లో వాధేరా కొట్టిన బౌండరీలతో ఈ రెండు ఓవర్లలోనే 33 పరుగులు సాధించడంతో కింగ్స్‌ రేసులో పడింది. నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించాక వాధేర అవుటయ్యాడు. శశాంక్‌ (2) రనౌటైనా... 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్‌ భారీ సిక్స్‌లతో కింగ్స్‌ను గెలిపించాడు. 

దంచేసిన తిలక్, సూర్య 
రోహిత్‌ (8), బెయిర్‌స్టో (38)ల తర్వాత తిలక్, సూర్యకుమార్‌ అడపాదడపా మెరుపులతో జట్టు స్కోరు 10 ఓవర్లలో 100 పరుగులు 
దాటింది. ఈ జోడీ నిలబడి దూకుడు పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చహల్‌ ఓవర్లో సిక్సర్‌ బాదిన సూర్యకుమార్‌... జేమీసన్‌ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఇదే జోరుతో 4, 6 కొట్టిన అతన్ని చహల్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే తిలక్‌ను జేమీసన్‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే నమన్‌ ధీర్‌ ధనాధన్‌ బౌండరీలతో ఓవర్‌కు సగటున 10 రన్‌రేట్‌తో ముంబై స్కోరు దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్లో నమన్‌ అవుట్‌ కాగా జట్టు 200 మార్క్‌ దాటింది.  



స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) వైశాక్‌ (బి) స్టొయినిస్‌ 8; బెయిర్‌స్టో (సి) ఇన్‌గ్లిస్‌ (బి) వైశాక్‌ 38; తిలక్‌ వర్మ (సి) ప్రియాన్ష్‌ (బి) జేమీసన్‌ 44; సూర్యకుమార్‌ (సి) వధేరా (బి) చహల్‌ 44; హార్దిక్‌ పాండ్యా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అజ్మతుల్లా 15; నమన్‌ (సి) స్టొయినిస్‌ (బి) అజ్మతుల్లా 37; రాజ్‌ (నాటౌట్‌) 8; సాంట్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–19, 2–70, 3–142, 4–142, 5–180, 6–197. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4–0–44–0, జేమీసన్‌ 4–0–30–1, స్టొయినిస్‌ 1–0–14–1, అజ్మతుల్లా 4–0–43–2, వైశాక్‌ 3–0–30–1, చహల్‌ 4–0–39–1. 

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్‌ (సి) హార్దిక్‌ (బి) అశ్వని 20; ప్రభ్‌సిమ్రన్‌ (సి) టాప్లీ (బి) బౌల్ట్‌ 6; ఇన్‌గ్లిస్‌ (సి) బెయిర్‌స్టో (బి) హార్దిక్‌ 38; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 87; వధేరా (సి) సాంట్నర్‌ (బి) అశ్వని 48; శశాంక్‌ (రనౌట్‌) 2; స్టొయినిస్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–72, 4–156, 5–173. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–38–1, టాప్లీ 3–0– 40–0, బుమ్రా 4–0–40–0, అశ్వని 4–0–55–2, సాంట్నర్‌ 2–0–15–0, పాండ్యా 2–0–19–1.   

Advertisement
 
Advertisement
Advertisement