వినోద్ కాంబ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 90వ దశకంలో భారత క్రికెట్ వర్గాల్లో అతడి పేరు మారుమ్రోగిపోయింది. అతడి చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండుల్కర్‌కు కాంబ్లీని పోటీగా భావించేవారు.
అయితే, సచిన్ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా దిగ్గజంగా నీరాజనాలు అందుకునే స్థాయికి చేరుకోగా.. చెడు వ్యసనాల వల్ల కాంబ్లీ కెరీర్ నాశనమైంది. ముఖ్యంగా మితిమీరిన స్థాయిలో మద్యం తాగడం అతడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి.
మూత్రనాళ ఇన్‌ఫెక్షన్
ఈ క్రమంలో 2024 డిసెంబరులో వినోద్ కాంబ్లీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో థానెలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో.. 1983లో టీమిండియాకు తొలిసారి వరల్డ్‌కప్ అందించిన భారత క్రికెటర్ల బృందం అతడికి ఆర్థికంగా సాయం చేసింది. కాంబ్లీ స్థానిక స్నేహితులు సైతం అతడికి అండగా నిలిచారు.
ఆర్థిక సాయం అందిస్తున్నాం
అయితే, కాంబ్లీ ఇంత వరకు పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు. ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ స్నేహితుడు మార్కస్ కౌటో తాజాగా షాకింగ్ విషయం వెల్లడించాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మా స్నేహితులందరినీ ఒక్క చోట చేర్చేలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. అందులో చాలా మంది క్రికెటర్లే ఉన్నారు. కాంబ్లీకి మేమంతా ఆర్థికంగా సాయం అందిస్తున్నాం.
గత ఆరు నెలలుగా కాంబ్లీ జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోయింది. రోజురోజుకీ తన పరిస్థితి దిగజారిపోతోంది. వినోద్ మెదడులో రక్తం గడ్డ కట్టింది. అయితే, ఇప్పుడు ఆ గడ్డను తీసేస్తే ప్రాణాలకే ప్రమాదం అట. అతడు ముందుజాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి సర్జరీ కష్టం అన్నారు.
ఏ క్షణాన్నైనా బ్రెయిన్‌స్ట్రోక్
దాని వల్ల ఏ క్షణాన్నైనా వినోద్‌కు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అయితే, అతడి మనో సంకల్పం వల్ల ఇప్పటికైతే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వినోద్ ఇప్పటికే మద్యం మానేశాడు.
సిగరెట్లు అడుక్కుంటున్నాడు
అయితే, సిగరెట్ తాగే అలవాటు మానుకోలేక సతమతమవుతున్నాడు. ఆటో డ్రైవర్లను కూడా సిగరెట్లు అడుగుతున్నారు. వాళ్లు కూడా సరేనని.. వినోద్ కాంబ్లీతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంబరపడుతున్నారు. కానీ.. తమ వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకోలేకపోతున్నారు’’ అని మార్కస్ చెప్పుకొచ్చాడు.
చదవండి: సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్.. టాప్-5 ప్లేయర్లు వీరే!


