లండన్ : బ్రిటన్‌లో ఆన్‌లైన్ వేదికగా మైనర్ బాలికల కోసం 20 వేల మంది పురుషులు వేట సాగించారని ఆ దేశ పోలీసులు తెలిపారు. మైనర్లపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఈ ఒక్క ఏడాదే వీటికి సంబంధించిన 70వేల ఫిర్యాదులు బ్రీటీష్ నేషనల్ క్రైమ్ ఏజన్సీకి అందాయన్నారు. 2006లో ఈ సంఖ్య 6వేలు ఉండగా ఇప్పుడిన్ని ఫిర్యాదులు రావడం కలవరపెడుతుందన్నారు. చిన్నారుల సంరక్షణ పోలీసు అధికారి మాట్లాడుతూ.. 2017లో యూకే వ్యాప్తంగా ఆన్‌లైన్ వేదికగా అమ్మాయిల కోసం వెతికిన సుమారు 4వేల మందిని గుర్తించామన్నారు. ఈ సంఖ్య 20వేల వరకు ఉండొచ్చాన్నారు.
మైనర్లపై వేధింపులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 31 శాతం పెరిగాయని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. యూకే వ్యాప్తంగా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడే నేరస్థులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో గడిపే చిన్నారులు లైవ్‌స్ట్రీమింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయంలో టెక్ కంపెనీలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు సూచనలు చేశామన్నారు. ఆన్‌లైన్ ఆసరా చేసుకొని కొంతమంది పురుషులు చిన్నారులను లైంగిక ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఇవి తెలియక అమాయక మైనర్లు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. చిన్నారుల విషయంలో తల్లితండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment