చట్టంపై న్యాయపోరాటం | Act On A legal battle | Sakshi
Sakshi News home page

చట్టంపై న్యాయపోరాటం

Published Sun, Jun 21 2015 1:01 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

అన్యాయంగా జైల్లో మగ్గిన వారికి పరిహారం చెల్లించాల్సిందేనంటున్న న్యాయవాదులు (మధ్యలో నీలన్) - Sakshi

అన్యాయంగా జైల్లో మగ్గిన వారికి పరిహారం చెల్లించాల్సిందేనంటున్న న్యాయవాదులు (మధ్యలో నీలన్)

చేయని నేరం
అక్కడి చట్టానికి కళ్లు మాత్రమే కాదు, నిరపరాధుల పట్ల కనీసమైన దయాదాక్షిణ్యాలూ లేకుండా పోయాయి. చేయని నేరానికి వాళ్లంతా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిన తర్వాత, కోర్టుల్లో జరిగిన విచారణల ప్రహసనాల తర్వాత నిరపరాధులుగా విడుదలయ్యారు. ఆలస్యంగానైనా చట్టం మెలకువ తెచ్చుకొని తన పనిని తాను చేసుకు పోయినందుకు సంతోషమే! అయితే, అన్యాయంగా జైళ్లలో మగ్గిన ఆ అమాయకులకు ఎలాంటి పరిహారం చెల్లించనివ్వకుండా అక్కడి చట్టమే అడ్డుపడుతోంది.

ఇది నియంతృత్వ దేశాల్లో కాదు, ఆధునిక ప్రపంచానికి ప్రజాస్వామ్య ప్రవచనాలు చెప్పే అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్‌ది. బ్రిటన్‌కు హోంశాఖ మంత్రిగా వెలగబెట్టిన చార్లెస్ క్లార్క్‌కు 2007లో తట్టిన ఆలోచనకు ఫలితమే ఇది. అన్యాయంగా జైళ్లలో మగ్గిన నిరపరాధులకు చెల్లించే పరిహార పథకాన్ని రద్దుచేస్తే, ఖజానాకు బోలెడంత సొమ్ము మిగులుతుందనేది క్లార్క్ ఆలోచన. పార్లమెంటులో చర్చోపచర్చల తర్వాత ఈ పరిహార పథకాన్ని రద్దుచేస్తూ 2014లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. ఇది చాలా అమానుషమైన చట్టం అంటూ మానవ హక్కుల బృందాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. అయితే నిరపరాధులుగా విడుదలైన ఖైదీలు మాత్రం బ్రిటన్ న్యాయశాఖ మంత్రి క్రిస్ గ్రేలింగ్‌పై న్యాయ పోరాటానికి నడుం బిగించారు. వారిలో ఇద్దరి గాథలు..
 
డీఎన్‌ఏ పరీక్షలైనా చేయకుండానే...
విక్టర్ నీలన్ సాదాసీదా పోస్ట్‌మ్యాన్. చేయని నేరానికి పదిహేడేళ్లు జైలులో మగ్గిపోయాడు. రెడిచ్ పట్టణంలోని ఒక నైట్‌క్లబ్ వెలుపల 1997లో ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆ కేసులో బ్రిటిష్ పోలీసులు నీలన్‌ను లోపలేశారు. బాధితురాలి దుస్తుల నుంచి సేకరించిన నమూనాలపై డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించకుండా, ప్రాసంగిక సాక్ష్యాల (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్) ఆధారంగా అతడిని ఏకపక్షంగా అపరాధిగా తేల్చేశారు. నిందితుడిని గుర్తించడానికి నిర్వహించిన ఐడీ పరేడ్ కూడా తూతూ మంత్రంగా కానిచ్చేశారు.  
 
నిజానికి జరిగినదేమిటంటే...
బాధితురాలి దుస్తులను సేకరించారు. అయితే, వాటి నమూనాలను డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపకుండా, సీలు వేసి భద్రంగా దాచిపెట్టారు. బాధితురాలి దుస్తులపై పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలే నిర్వహించలేదంటూ న్యాయం కోసం నీలన్ అప్పీలు చేసుకున్నాడు. క్రిమినల్ కేసుల రివ్యూ కమిషన్ ఆ అప్పీలును తోసిపుచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా నీలన్ మరో రెండుసార్లు అప్పీలు చేసుకున్నాడు.

కోర్టు అతడి మూడో అప్పీలును విచారణకు స్వీకరించింది. కేసు తిరగదోడితే, నీలన్ నిరపరాధి అని తేలింది. కోర్టు తీర్పు ఫలితంగా 2013 డిసెంబర్‌లో నీలన్ విడుదలయ్యాడు. నీలన్ తరఫున అతడి న్యాయవాది మార్క్ న్యూబీ సర్కారుతో అమీ తుమీ తేల్చుకోవడానికి పోరాటం ప్రారంభించాడు. శిక్ష ఫలితంగా నీలన్ ఉద్యోగాన్ని, డబ్బును, అయిన వారిని పోగొట్టుకున్నాడని, తప్పుడు తీర్పు వల్ల తీవ్రంగా నష్టపోయాడని, ప్రభుత్వం దానికి పరిహారం చెల్లించాల్సిందేనని మార్క్ న్యూబీ అంటున్నాడు.
 
సీసీటీవీ సాక్ష్యమైనా లేకుండానే...
శామ్ హల్లామ్‌ది మరో గాథ. పదిహేడేళ్ల ప్రాయంలో ఒక హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. లండన్‌లోని సెయింట్ ల్యూక్ ఎస్టేట్ వద్ద 2004 అక్టోబర్‌లో ఎస్సాస్ కసాహున్ అనే యువకుడిపై దుండగులు దాడిచేశారు. అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు హల్లామ్‌ను పట్టుకున్నారు. ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో కొందరు ‘ప్రత్యక్ష’ సాక్షులు దాడికి పాల్పడింది అతడేనని చెప్పారు. ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలను గానీ, సీసీటీవీ దృశ్యాలను గానీ సాక్ష్యాధారాలుగా ప్రవేశపెట్టలేదు. సంఘటనా స్థలంలో తాను లేను మొర్రో అని హాల్లామ్ మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది.

అయితే, శామ్ అప్పీలును పరిగణనలోకి తీసుకున్న క్రిమినల్ కేసుల రివ్యూ కమిషన్ తిరిగి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. థేమ్స్‌వ్యాలీ పోలీసు అధికారి దర్యాప్తులో జరిగిన హత్యకు, శామ్ హల్లామ్‌కు సంబంధం లేదని తేలింది. తాజా దర్యాప్తు ఫలితాలను పరిశీలించిన కోర్టు, 2012లో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. అయితే, అతడికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు. హెలెనా కెన్నడీ అనే న్యాయవాది శామ్‌కు పరిహారం కోసం న్యాయపోరాటం సాగిస్తోంది. చేయని నేరానికి శిక్ష అనుభవించిన నిరపరాధులకు పరిహారం చెల్లించాల్సిందేనని, దీనిని అడ్డుకునే చట్టంపై విస్తృతంగా చర్చ జరగాలని ఆమె అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement