బాడీవార్న్ కెమెరా
ఈ–చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ అమలులో సమస్యలు, అక్రమాలకు చెక్ పెట్టాలని పోలీస్ బాస్ భాస్కర్ భూషణ్ నిర్ణయించారు. కాంటాక్ట్ లెస్ ఈ–చలాన్ అమలు చేయాలని, బాడీవార్న్ కెమెరాలు ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ) పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది అమలుకు చర్యలు ప్రారంభించారు.
నెల్లూరు(క్రైమ్): మోటార్‌వాహన చట్టాల అమలుకు పోలీసులు ఒకప్పుడు ప్రత్యక్షంగా జరిమానాలు విధించేవారు. వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకపోయినా అప్పుడుకప్పుడే జరిమానా విధించి నగదు వసూలు చేసేవారు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ–చలాన్లు అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లాలో 2017 నుంచి ఈ విధానం అమల్లో ఉంది. వాహనం రాంగ్ పార్కింగ్ చేసినా, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, పత్రాల్లేని వారికి ఈ చలాన్ విధిస్తున్నారు. వివరాలు వాహన యజమానికి ఎస్‌ఎంఎస్ రూపంలో పంపుతున్నారు. దీంతో వాహనదారులు ఏపీ ఆన్‌లైన్, మీ–సేవ తదితరాల్లో జరిమానా చెల్లిస్తున్నారు.
ఇబ్బందుల కారణంగా..
ఈ–చలాన్ అమలు సందర్భంలో పోలీసు అధికారులు కొందరు వాహనదారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎందుకు ఫైన్ విధించారంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీస్ సిబ్బంది వారికి చెప్పే ప్రయత్నం చేసినా వినడంలేదు. మరికొందరు తమకున్న పలుకుబడిని ఉపయోగించి వాహనాలు విడిచిపెట్టాలని, ఈ–చలాన్‌ను తీసివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతూ అందినకాడికి జేబులు నింపుకొంటున్నారు. వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చలాన్ల పేరిట గంటల తరబడి నిలిపివేస్తున్నారు. వీటన్నింటిని పరిశీలించిన ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ–చలాన్ పే రిట వాహనాలను నిలుపరాదని, కాంటాక్ట్ లెస్ ఈ–చలాన్ సిస్టంను అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వాహనదారుడు నిబంధనలు ఉల్లంఘించిన వైనాన్ని ఫొటో తీసి ఈ–చలాన్ పంపాలని సూచించారు. దీంతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్టారు.
బాడీవార్న్ కెమెరాలు ధరించి..
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని భావించి వాటిని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్‌ను విస్తృతంగా నిర్వహిస్తోంది. జిల్లాలో ప్రతిరోజూ డీడీ నిర్వహిస్తూ మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పరీక్షల్లో అధికశాతం మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయితే కోర్టు వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తోంది. నామమాత్రంగా ఆల్కాహాల్ శాతం ఉంటే జరిమానా వేస్తున్నారు. ఈ ప్రక్రియ కొందరు ఖాకీలకు కల్పతరువుగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. రూ.వేలల్లో నగదు తీసుకుని కేసుల్లేకుండా పంపివేస్తున్నారు. కొందరు సిబ్బంది చేతివాటంపై ఎస్పీకి ఫిర్యాదులు అందడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మార్పులు తీసుకువస్తున్నారు. ఇకపై పరీక్షల్లో పాల్గొనే సిబ్బంది విధిగా బాడీవార్న్ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల ప్రారంభం నుంచి ముగిసే వరకు కెమెరా ధరించడం ద్వారా ప్రతి విషయం రికార్డవుతుంది. కమాండ్ కంట్రోల్ నుంచి లైవ్ చూడవచ్చు. దీని ద్వారా అవినీతిని నియంత్రిచవచ్చని, మద్యం సేవించి పరీక్షల్లో పట్టుబడిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేకుండా పోతుందని పోలీస్ బాస్ భావిస్తున్నారు. త్వరలో దీనిని అమల్లోకి తీసుకురానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment