స్పీడ్ లేజర్ గన్‌తో వాహన వేగాన్ని పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు
మేం కారులో, బైక్‌లో స్పీడుగా వెళుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. హెల్మెట్ లేకున్నా ఎవరూ అడగడం లేదు. మందు తాగి వాహనాన్ని నడుపుతున్నా ఏ అధికారీ తనిఖీ చేయడం లేదని అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే. ఇటీవల జాతీయ రహదారిపై రవాణా అధికారులు తనిఖీల స్పీడును పెంచారు. రోజుకో ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఇళ్లకు ఈ–చలానాలు పంపిస్తున్నారు.
నెల్లూరు(టౌన్): వాహనచోదకులు నిబంధనలు అతిక్రమిస్తే వాళ్లకు తెలియకుండానే తనిఖీలకు సంబంధించిన ఈ–చలానాలను రవాణాశాఖ అధికారులు ఆయా వాహనదారుల ఇళ్లకు పంపిస్తున్నారు. ఇవేంటని పరిశీలించిన వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. రహదారి మధ్యలో ఎవరూ ఆపి తనిఖీలు చేయలేదు గదా.. ఈ చలానాలు ఏంటని రవాణా కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. తీరా మీరు పలాన సమయంలో నిబంధనలు అతిక్రమించారని, అందుకు ఫైన్ చెల్లించాలనిఅధికారులు చెబుతుండటంతో అవాక్కువుతున్నారు. గతంలో పెద్ద నగరాలకే పరిమితమైన ఈ–చలానా పద్ధతి జిల్లాలో కూడా అవలంబిస్తున్నారు.
జిల్లాలో 176 కిలో మీటర్ల జాతీయ రహదారి
జిల్లాలో 176 కిలో మీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు రహదారి నిబంధనలు అతిక్రిమించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం, సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపటం, ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం తదితర కారణాల వల్లే అధిక సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తనిఖీలు ముమ్మరం
జాతీయ, రాష్ట్ర రహదారులపై రవాణాశాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. రోజూ కావలి నుంచి తడ వరకు ఉన్న జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు రెండు స్పీడు లేజర్‌గన్‌లను కొనుగోలు చేశారు. రవాణాశాఖకు ఒకటి, పోలీసు శాఖకు మరొక స్పీడు లేజర్ గన్‌ను కేటాయించారు. అదేవిధంగా 30 బ్రీత్ ఎన్‌లైజర్లను కొనుగోలు చేశారు. 24 పోలీసు శాఖకు కేటాయించగా, ఆరు బ్రీత్ ఎన్‌లైజర్లును రవాణాశాఖకు కేటాయించారు. రహదారిపై వాహన స్పీడును లేజర్ గన్‌తో పరిశీలిస్తున్నారు. తనిఖీలు నిర్వహించే ప్రాంతాన్ని బట్టి వేగాన్ని నిర్ణయిస్తారు. స్పీడు లేజర్‌గన్‌లో వాహన నంబరు నమోదవుతుంది. ఆ నంబరు ఆధారంగా వాహనదారుడు వివరాలు తెలస్తాయి. నిర్దేశించిన వేగం కంటే వాహనం ఎక్కువ వేగం వెళుతుందని స్పీడు లేజర్‌గన్‌లో నమోదవుతుంది. మద్యం సేవించి వాహనాన్ని నడిపితే కోర్టుకు ప్రాసిక్యూట్ పెడుతున్నారు. కోర్టు కొన్ని రోజుల పాటు జైలు శిక్ష విధించిన పరిస్థితి ఉంది.
చలానా ఇంటికే..
నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఇళ్లకు రవాణా అధికారులు ఈ–చలనాలు పంపిస్తున్నారు. నిర్దేశిత వేగం కంటే అధిక వేగంగా వెళితే రూ.1,400లు ఫైన్ విధిస్తున్నారు. ఉదాహరణకు జాతీయ రహదారిపై అక్షర స్కూల్ సమీపంలో వాహన వేగం 90 కి.మీ. నిర్దేశించారు. అంతకన్న వేగంగా వెళితే ఫైన్ విధిస్తారు. రద్దీని పరిగణనలోకి తీసుకుని వేగాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా హెల్మెట్ లేక పోయినా, సీటు బెల్టు ధరించకున్నా ఫైన్‌ను ఈ–చలానా రూపంలో పంపిస్తున్నారు. ఈ–చలానా రూపంలో వచ్చిన ఫైన్‌ను వారం రోజుల్లో రవాణా కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైన్ చెల్లించకుండా పదే పదే తప్పు చేసినట్లయితే వాహనాన్ని సీజ్ చేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన కేసులు వివరాలను ఒక సారి పరిశీలిస్తే... ఓవర్ స్పీడుకు సంబంధించి 814 కేసులు, హెల్మ్‌ట్ లేకుండా బైక్ నడపటం 560, మద్యం తాగి వాహనాన్ని డ్రైవింగ్ చేసినందుకు 648 కేసుల వరకు ఉన్నాయి. వీరందరికీ అతి వేగం, హెల్మెట్ లేకుండా బైకు నడపటం వంటి వాటికి ఈ–చలనా రూపంలో ఫైన్ విధించారు. మద్యం తాగి వాహనాన్ని నడిపిన కేసులో వాహనదారులను కోర్టుకు ప్రాసిక్యూట్ చేశారు.
నిబంధనలు పాటించాల్సిందే
ప్రతి వాహనదారుడూ రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తునే ఉన్నాం. ఇప్పుడు వాహనాన్ని ఆపి తనిఖీ చేయకుండా స్పీడు లేజర్ గన్, బ్రీత్ ఎన్‌లైజర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు అతిక్రమించినట్లయితే వారి ఇళ్లకు ఈ–చలానాలను పంపిస్తున్నాం. –ఎన్.శివరాంప్రసాద్, ఉప రవాణాశాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment