గొంతు తగ్గించాల్సిన విషయం కాదు | Isnapur Government School Was Adopted By The Rose Charity In India | Sakshi
Sakshi News home page

గొంతు తగ్గించాల్సిన విషయం కాదు

Oct 31 2019 3:55 AM | Updated on Oct 31 2019 3:55 AM

Isnapur Government School Was Adopted By The Rose Charity In India - Sakshi

కొన్ని విషయాలను మనమింకా గొంతు తగ్గించే మాట్లాడుతున్నాం. అయితే రుతుక్రమం విషయంలో స్వేచ్ఛగా బయటికి మాట్లాడితేనే సమాజంలో పేరుకు పోయిన నిషిద్ధ భావనను తొలగించగలం.. అని యు.కె.కి చెందిన చార్లెట్‌ అంటున్నారు.

‘‘గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదివిస్తున్నారు, ఉద్యోగాలకు పంపిస్తున్నారు. అయినప్పటికీ వాళ్లు చాలా సందర్భాల్లో మగపిల్లలతో పోటీ పడాల్సిన పరుగులో ఒకింత వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతోంది. మెన్‌స్ట్రువల్‌ పీరియడ్స్‌ వల్ల క్లాసులు మిస్‌ అవడం ఇందుకు ప్రధాన కారణం. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక ఎంట్రప్రెన్యూర్, ఒక ఆస్ట్రోనాట్‌... ఇలా ఎన్నో రంగాల్లో మహిళలకు అవకాశాలున్నాయి. వీటన్నింటిలోనూ అబ్బాయిలు ఉన్నంత సంఖ్యలో అమ్మాయిలు లేరు. పీరియడ్స్‌ అంటే సమాజంలో కరడు గట్టిపోయి ఉన్న ఒక కళంకిత భావనను తొలగించగలితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

అందుకోసమే యూకే నుంచి ఇండియాకి వచ్చాను’’ అన్నారు చార్లెట్‌ లియోన్‌హార్డ్‌సెన్‌. మాంచెస్టర్‌లోని ‘ద బ్యూరో కమ్యూనిటీ వెల్‌ బీయింగ్‌’ సంస్థలో హెల్త్‌ అండ్‌ వెల్‌ బీయింగ్‌ మేనేజర్‌గా ఉన్న చార్లెట్‌ బుధవారం ఇండియా వచ్చారు. మెదక్‌ జిల్లా, ఇస్నాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్తూ హైదరాబాద్‌లో సాక్షితో మాట్లాడారు. ‘‘కొన్ని మతపరమైన నిబంధనలు భారతీయ మహిళకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నాయి. రుతుక్రమం అపరిశుభ్రం అనే భావనను వదిలించుకున్నప్పుడే సమాజం సమానత్వం దిశగా నడుస్తుంది. మరొక ప్రాణికి జన్మనివ్వాల్సిన ప్రకృతి సహజమైన ఏర్పాటును మలినం అని ఎలాగంటారు? ఈ విషయంలో మహిళలకు అవగాహన కల్పించడం అన్నది మనకు బయటకు కనిపిస్తున్న అంశం. నిజానికి మగవాళ్లను సెన్సిటైజ్‌ చేయడం అవసరం. మహిళల్లో ఈ కళంకిత భావనను తొలగించాలంటే వీలయినంత ఎక్కువగా దీని గురించి మాట్లాడడం ఒక్కటే మార్గం’’ అన్నారు చార్లెట్‌.

‘‘లండన్‌లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి భావన ఉంది. కానీ అక్కడ స్కూళ్లలో ఆడపిల్లలకు, మగపిల్లలకు కూడా పదేళ్ల వయసు నుంచే స్త్రీ–పురుష దేహాల మధ్య ఉండే తేడాలను వివరిస్తారు. అది అక్కడ పాఠ్యాంశాలలో భాగం. అలా పెరిగిన పిల్లలకు మెన్‌స్ట్రువల్‌ సైకిల్‌ అనేది గొంతు తగ్గించి మాట్లాడాల్సిన విషయంగా అనిపించదు. ఓపెన్‌గా మాట్లాడగలిగినప్పుడు ఇక సిగ్గుతో ముడుచుకోవాల్సిన అవసరమే ఉండదు కదా? బజారు నుంచి వచ్చేటప్పుడు స్టోర్‌ నుంచి తన కోసం శానిటరీ పాడ్స్‌ తీసుకురమ్మని అక్కడ ఒక మహిళ భర్తను అడగగలుగుతుంది. ఇండియాలో చదువుకున్న మహిళ కూడా భర్త ఎదురుగా స్టోర్‌ నుంచి శానిటరీ నాప్‌కిన్స్‌ పాకెట్‌ తీసుకోవడానికి బిడియ పడుతుంటుంది. ఇండియాలో ఉన్నంత తీవ్రంగా కాకపోయినప్పటికీ ప్రపంచంలో మరికొన్ని చోట్ల ఇలాంటి భావన ఇంకా ఉంది.

దాని నుంచి మహిళకు విముక్తి కలిగించాలి. అందుకోసం ప్రపంచ దేశాల్లోని స్కూళ్లు, కాలేజ్‌లు, యూనివర్సిటీలను సందర్శించడమే పనిగా పెట్టుకున్నాను. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు రీ యూజబుల్‌ నాప్‌కిన్స్‌ని పరిచయం చేయడం కూడా నా పర్యటనలో ముఖ్యమైన భాగం. ఇస్నాపూర్‌ ప్రభుత్వ పాఠశాలను ఇండియాలోని ‘రోజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. అమ్మాయిల కోసం స్కూల్లో ఆ సంస్థ ప్యాడ్స్‌ వెండింగ్‌ మెషీన్‌ ఏర్పాటు చేసిన విషయం మాకు తెలిసింది. అక్కడి అమ్మాయిలకు టైలరింగ్‌ కూడా నేర్పిస్తున్నారు. వారికి రీ యూజబుల్‌ నాప్‌కిన్స్‌ తయారీలో శిక్షణ ఇవ్వడానికి వెళ్తున్నాను. తప్పని సరిగా పర్యావరణ హితమైన జీవనశైలితోపాటు, వ్యక్తిగత ఆరోగ్యకరమైన జీవనశైలిని పరిచయం చేయడమే నా ఈ పర్యటన ఉద్దేశం’’ అన్నారు చార్లెట్‌.
– వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement