బెంగళూరు: నటి ప్రణీత తన పెద్ద మనసును చాటుకుంది. అందరూ ఊర్లను, పిల్లల్ని దత్తత తీసుకుంటే ప్రణీత ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. స్నేహితులు కోరడంతో... గతేడాది బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి సిద్ధమైంది. ఆ సమయంలో బడి వాతావరణాన్ని, పిల్లలు చదివే విధానాన్ని గమనించింది. అక్కడ ఏడో తరగతి చదివే విద్యార్థికి కూడా ఆంగ్లభాషలో కనీస పరిజ్ఞానం లేదని గుర్తించింది. అదే కాదు ఆ బడిలో ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. అది చూసి అలాంటి పాఠశాలల రూపురేఖల్ని మార్చాలని అనుకుంది.
అందులో భాగంగా మొదట హసన్ జిల్లా, ఆలూరులోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ఈ విషయమై ప్రణీత మాట్లాడుతూ.. ‘మా నాన్న పుట్టిన ఊరు హసన్‌లోని ఆలూరు గ్రామం. తరువాత బెంగళూరుకు వచ్చేశారు. నేను పుట్టి, పెరిగింది బెంగళూరులోనే అయినా మా సొంతూరుని మర్చిపోలేనుగా. అందుకే ఆలూరును ఎంచుకున్నా. అక్కడి పాఠశాల అభివృద్ధికోసం రూ.5లక్షలను అందించా. విద్యార్థినులకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడానికి, తరగతి గదుల రూపురేఖల్ని మార్చడానికి ఈ సొమ్మును వినియోగిస్తున్నాం. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలల్ని దత్తత తీసుకునే ఆలోచన కూడా ఉంది. కేవలం బడికి సౌకర్యాలు అందించడమే కాదు... వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నాం. ఇందుకు అవసరమైన ప్రణాళికల్ని మా స్నేహితులమంతా ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నామ’ని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment