ఆ చిన్నారి ఐదేళ్ల వయసులో ఒడిశాలో తప్పిపోయింది. తల్లిదండ్రులు అప్పట్లో వెతికినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. ఆశలు వదులుకుని వారు స్వగ్రామానికి వచ్చేశారు. ఆ బాలికను ఒడిశా ప్రభుత్వం సంరక్షించి చదివిస్తోంది. ఎప్పటికైనా తన తల్లిదండ్రులను చూడకపోతానా అని ఆశతోనే ఉండేది. అధికారుల సాయంతో తన స్వస్థలం వీకోట మండలంలోని బోడిగుట్టపల్లెగా తెలుసుకుంది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరవుతోంది.
సాక్షి, పలమనేరు:చిన్న తనంలో ఒడిశాలో తప్పిపోయిన బాలికకు పదేళ్ల తర్వాత తన పుట్టిన నేల గురించి తెలిసినా.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పూర్తి వివరాలు తెలుసుకునే సరికి కన్నవారు లేరన్న నిజం జీర్ణించుకోలేకపోతోంది. కనీసం తన కుటుంబీకులను కలుసుకోవాలని ఆరాటపడుతోంది. పదేళ్ల తర్వాత ఆమెకు తన వివరాలు ఎలా లభించాయి. అసలు ఏం జరిగిందంటే.. వీకోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన పరమేష్, లక్షమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం చిన్న కూతురితో పాటు ఒడిశా రాష్ట్రం పూరి సమీపంలోని కనాస్ ప్రాంతానికి వలసకూలీలుగా వెళ్లారు. అక్కడ బిడ్డ తప్పిపోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. బాలిక ఫొటో కావాలన్నారు. తమవద్ద లేదని చెప్పడంతో కేసు కూడా నమోదుచేయలేదు. కొన్నాళ్లు తప్పిపోయిన ప్రాంతంలో వెతికి చేసేదిలేక స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. ఇక్కడ కూలిపనులు చేసుకుంటూ ఉండిపోయారు.
వికోట మండలం బోడిగుట్టపల్లిలో బాలిక కుటుంబ సభ్యులను విచారిస్తున్న అధికారులు
బాలికను చేరదీసిన స్వచ్ఛంద సంస్థ
ఒడిశాలోని కనాస్‌లో అనాథగా తిరుగుతున్న చిన్నారిని నిలాచల్ సేవా ప్రతిష్టాన్ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. అక్కడి ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) అధికారులకు అందజేసింది. వారు అక్కడి ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్(దయావిహార్)కు అప్పగించారు. ఆ సంస్థ నిర్వాహకులు ఆ బాలికకు అనామిక అని పేరు పెట్టి అక్కడే చదివిస్తున్నారు. బాలిక పెరిగి పెద్దయ్యాక రెండేళ్ల క్రితం తమది ఆంధ్రరాష్ట్రం చిత్తూరు జిల్లాలోని బోడిగుట్టపల్లె అని చెప్పింది. అక్కడి అధికారులు చిరునామా కనుగొనేందుకు బాలిక 8వ తరగతి ఫొటోను చిత్తూరు ఐసీడీఎస్ అధికారులకు పంపారు.
బోడిగుట్టపల్లి పేరిట పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రామాలుండడంతో స్థానిక సీడీపీఓలు రెండేళ్లుగా చిరునామా కోసం విచారిస్తున్నానే ఉన్నారు. ఇలా ఉండగా వికోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన ఓ బాలిక ఒడిశాలో తప్పిపోయిందని స్థానికుల ద్వారా సీడీపీఓ రాజేశ్వరికి సమాచారం అందింది. ఆమె నాన్ ఇన్‌స్టిట్యూషన్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శివకు ఆ విషయం తెలిపారు. ఆయన బోడిగుట్టపల్లికి చేరుకుని బాలికకు సంబంధించిన ఫొటో, వివరాలను చెప్పారు. కుటుంబ సభ్యుల ఫొటోలను ఒడిశాలో బాలిక ఉంటున్న చైల్డ్‌హోమ్‌కు వాట్సాప్‌లో పంపారు. వారిని చూసిన బాలిక తన అన్న, అక్కలుగా గుర్తించింది.
అంతలోనే కన్నీరుమున్నీరు
తన వారిని గుర్తించిన బాలిక తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూపాలని ఆత్రుతగా అడిగింది. వారు మృతి చెందారనే సమాచారం తెలుసుకుని బాలికకు చెప్పారు. దీంతో అనామిక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కనీసం తన బంధువుల వద్దకు వెళతానని బాలిక కోరింది. దీంతో జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్, స్థానిక సీడీపీఓలు మంగళవారం బోడిగుట్టపల్లెలోని కుటుంబ సభ్యులను విచారించారు. వీడియో కాల్ ద్వారా బాలికతో మాట్లాడించారు. ఈ వివరాలతో నివేదికను ఒడిశా ప్రభుత్వానికి పంపి ఆపై బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కాగా అనామిక ప్రస్తుతం అక్కడి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షలు పూర్తయ్యాక ఇక్కడికి పంపనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని విచారణకు వచ్చిన అధికారి శివ తెలిపారు. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ బతికే ఉందని, ఆ బాలిక ఇప్పుడెలా ఉందో చూడాలని వారి కుటుంబ సభ్యులే కాదు.. ఆ గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment