బతుకు... బతికించు! | rang de Charity organization special story | Sakshi
Sakshi News home page

బతుకు... బతికించు!

Published Tue, Jul 18 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

రంగ్‌దే నుంచి సహాయం పొందిన మణిపూర్‌ మహిళలు

రంగ్‌దే నుంచి సహాయం పొందిన మణిపూర్‌ మహిళలు

ఈ రోజుల్లో అప్పు పుట్టాలంటే... ఎన్నికష్టాలో!
కొద్దో గొప్పో పరపతి ఉండాలి. లేదంటే..
లాభాలు తెచ్పిపెట్టే వ్యాపారమైనా ఉండాలి. అదీ కాదంటే...
బోలెడంత ఆస్తి వెనకేసుకోనైనా ఉండాలి!
ఇన్ని ఉన్నా... సవాలక్ష రూల్స్‌ చెప్పిగానీ బ్యాంకులు కాసు విదల్చవు.
మరి... ఇవేవీ లేని నిరుపేద రైతుకు రుణం కావాలంటే...?
నేతన్న నూలు కొనేందుకు రూకలు కావాలంటే..?
బిడ్డలు స్కూలుకెళ్లేందుకు సాయం కావాలని అమ్మలు అడిగితే...?
బ్యాంకులు ఎలాగూ ఇవ్వవుగానీ.. అందరం ఒక చేయి వేద్దాం...
పేదలందరినీ ఆదుకుందాం అంటోంది రంగ్‌ దే!


బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ పేరు రంగ్‌ దే! స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన పాట ‘రంగ్‌ దే బసంతి చోలా’ తొలి పదాలే పేరుగా ఏర్పడిన ఈ సంస్థ దేశంలో పేదరికమన్నది ఎందుకుండాలి? అని ప్రశ్నిస్తోంది. సమాజంలో తోటివాడిని సాయం చేయాలన్న స్పృహ ఉన్న కొంతమంది చేతులు కలిపితే ఇదేమీ కష్టం కాదని తొమ్మిదేళ్లుగా ఈ సంస్థ పదే పదే నిరూపిస్తోంది కూడా. దేశం మారుమూలల్లోని స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపిన రంగ్‌ దే... ఆ ప్రాంతాల్లోని పేదల అవసరాలను... గుర్తిస్తుంది. సాయం అందించేందుకు ముందుకు రమ్మని తమ వెబ్‌సైట్‌ వేదికగా దాతలను ఆహ్వానిస్తుంది. ఆ కష్టాలు మిమ్మల్ని కదిలిస్తే చాలు... ఎప్పుడో అనుభవించి, అధిగమించిన కష్టాలను గుర్తు చేస్తేచాలు... మనసు మూలల్లో నిద్రపోతున్న మానవత్వాన్ని తట్టిలేపితే చాలు.. మీరే వారి ఆప్తమిత్రులు కావచ్చు! వారిని ఆదుకోవచ్చు.

అలాగని మీరు వారికేమీ డబ్బు ఊరికే దానమే చేయాలని రూలేమీ లేదు. పెట్టుబడిగా పెట్టండి... నామమాత్రపు వడ్డీతోనైనా సరే.. మీ డబ్బు తిరిగి పొందండి అంటోంది రంగ్‌ దే.  ఇందుకోసం చేయాల్సింది కూడా చాలా సింపుల్‌. రంగ్‌ దే వెబ్‌సైట్‌లోకి వెళ్లడం... మీ వివరాలు నమోదు చేసుకుని... ఎవరికి సాయం చేయాలనుకుంటున్నారో (సాయం కావాల్సిన వారి వివరాలు వెబ్‌సైట్‌లోనే ఉంటాయి) నిర్ణయించుకోవడం. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ఖాతాలో జమచేయడం. మిగిలిన విషయమంతా రంగ్‌ దే చూసుకుంటుంది. వంద రూపాయల నుంచి వేలు, లక్షల వరకూ ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన 12 వేల మందిలో చాలామంది తమ డబ్బు వెనక్కు తీసేసుకోగా.. కొందరు పేదల కోసం మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ఎందరి జీవితాల్లోనో ఆనందపు రంగులు నింపుతున్నారు!

దిగ్గజాలతో బృందం...
రంగ్‌ దేను స్థాపించింది స్మిత, రామకృష్ణ దంపతులే అయినా ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లింది మాత్రం దర్శకుడు నగేశ్‌ కుకునూన్, సంగీత కళాకారుడు రఘు దీక్షిత్, నాటితరం హీరోయిన్‌ వహీదా రెహమాన్‌ వంటి దిగ్గజాలే. బ్రాండ్‌ అంబాసిడర్లుగా వీరు రంగ్‌ దే? స్ఫూర్తిని వేదికలపై ఎలుగెత్తి చాటారు. సంస్థ డైరెక్టర్ల బృందం కూడా ఘనమైందే. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి మనోజ్‌ కుమార్, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, కర్ణాటక పల్లెప్రాంతాల్లో సోలార్‌ విప్లవాన్ని తీసుకొచ్చిన హరీశ్‌ హందే, నాబార్డ్‌ మాజీ ఉన్నతాధికారి ప్రొఫెసర్‌ అలోక మిశ్రా, మాజీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పునుకొల్లు శుభ, ఐటీ కంపెనీ సీనియర్‌ ఉద్యోగిగా పనిచేసిన చైతన్యా నాడ్‌కర్ణి, ఆక్స్‌ఫామ్‌ వంటి అంతర్జాతీయ ఎన్‌జీవోల్లో పనిచేసిన స్మితా సతీశ్‌ వంటి వారు రంగ్‌ దే పాలక మండలి సభ్యులు.  

జీవితాల్లో కొత్త రంగులు..
అజయ్‌ కుమార్‌ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసమని కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి బెంగళూరుకు వలస వచ్చాడు. సరైన అవకాశాలు దొరక్కపోవడంతో చివరకు చెత్త ఏరుకుని దాంతోనే కడుపు నింపుకోవడం మొదలుపెట్టాడు. రోడ్లపై పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇతర చెత్త ఏరుకునేందుకు వెళితే.. నిత్యం పోలీసుల అనుమానపు కన్నులు వెంటాడేవి. ఈ పరిస్థితుల్లో అతడికి హసిరుదళ పరిచయమైంది. నగరం ఉత్పత్తి చేసే చెత్త నుంచి పనికొచ్చే వాటిని వేరు చేసి అమ్ముకోవడం ద్వారా ఉపాధి మార్గం చూపే సంస్థ ఇది. బెంగళూరు కార్పొరేషన్‌ ద్వారా గుర్తింపు కార్డు ఇప్పిస్తాం. పోలీసుల వేధింపులు ఉండవు... గొట్టిగెర ప్రాంతంలో చెత్త నిర్వహణ కేంద్రాన్ని నడుపుకో అనే ఆఫర్‌ ఇచ్చింది. ఒకే అన్నాడు అజయ్‌. కానీ కేంద్రం పెట్టాలంటే డబ్బు కావాలిగా? అంటే.. హసిరుదళ అతడిని రంగ్‌ దేకు పరిచయం చేసింది. అతితక్కువ వడ్డీకి రూ.40 వేల అప్పు అది కూడా ఎలాంటి గ్యారెంటీ లేకుండా దక్కడంతో అజయ్‌ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

బిలాసినీ దేవి...
మణిపూర్‌లోని థౌబల్‌ జిల్లాలోని కుగ్రామం బిలాసినీ దేవిది. భర్త వడ్రంగి. తనేమో ఇంట్లోనే చిన్న బడ్డీ కొట్టు నడుపుతూండేది. ఇద్దరు పిల్లలు రాబర్ట్, రోజర్‌ల చదువుల కోసం నెలకు రూ.4000 చొప్పున ఆదా చేసేవారు. పిల్లల నెలవారీ ఖర్చులు నడిచిపోయేవిగానీ.. ఏటా వచ్చే స్కూల్‌ ఫీజులు, సెమిస్టర్‌ ఫీజుల కోసం అప్పు చేయక తప్పేది కాదు. ఇంతకాలం అధిక వడ్డీలతో ఇలాగే నెట్టుకొచ్చినా... రంగ్‌ దే పుణ్యమా అని గత ఏడాది పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లల ఫీజుల కోసం రూ.19,000 అప్పు దొరికింది. దీంతోపాటే హోల్‌సేల్‌ ధరల్లో సరుకులు కొని తన బడ్డీ కొట్టులో అమ్ముకునేందుకు మరికొంత మొత్తం కూడా రుణంగా అందింది. ఆదాయమూ కొంత పెరగడంతో పిల్లల కోసం చేసిన అప్పు దశలవారీగా తీర్చేసింది కూడా. చిన్నోడు రోజర్‌ ఇంఙనీరింగ్‌ ఆశలూ నెరవేరతాయంటోంది బిలాసిని!
తమిళనాడులోని కడలూర్‌ జిల్లా సిలాంబినాథన్‌ పేటలోని అంబరిసి పరిస్థితి కూడా ఇలాంటిదే. 36 ఏళ్లకే భర్త పోయాడు. కుటుంబ భారం మోయాలంటే చేతిలో ఇంకో రెండు గొర్రెలుంటే బావుణ్ననుకుంది. రంగ్‌ దే వెబ్‌సైట్‌లో అంబరసి విజ్ఞప్తికి స్పందనగా అప్పు సమకూరింది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటానంటోంది అంబరసి! బతకడానికి పోరాటం చేసే వారికి బతుకునిచ్చే ఆసరా రంగ్‌దే.
– గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా

ప్రస్థానం..
బంగ్లాదేశ్‌లో గ్రామీణ్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడైన మహమ్మద్‌ యూనస్‌కు నోబెల్‌ బహుమతి లభించిన 2006లో రంగ్‌ దే ఆలోచన మొదలైంది అంటారు ఎన్‌.కే.రామకృష్ణ, స్మిత దంపతులు. ఇంటర్నెట్‌ అనే టెక్నాలజీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఉపయోగపడుతోందే.. దీన్ని పేదలకూ పనికొచ్చేలా వాడుకుంటే బాగుండూ అన్న భావన వీరి మనసులను తొలుస్తూండేది. అలా పుట్టిన ఐడియానే... పీర్‌ టు పీర్‌ లెండింగ్‌. సమాజంలోని కొందరు.. తోటివారికి సాయపడేందుకు చిన్న మొత్తాల్లో రుణాలు ఇవ్వడం ద్వారా అతితక్కువ వడ్డీలకే పేదలకు సాయపడవచ్చునని అంచనా వేశారు వీరు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు ఇదో మేలైన మార్గమన్న నమ్మకంతో 2008 జనవరి 26న రంగ్‌ దే కార్యకలాపాలు మొదలయ్యాయి!

పని చేసేదిలా..
రంగ్‌ దే సంస్థకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఈ సంస్థలు తమ పరిధిలో డబ్బు అవసరమైన పేదవారిని గుర్తిస్తారు. వారి వివరాలు మొత్తాన్ని సేకరించి రంగ్‌ దేకు అందిస్తారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు ఇలా దాదాపు వెయ్యి మంది వరకూ ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్న వారు మీకు కనిపిస్తారు. వీరిలో మీకు నచ్చిన వారిని ఎవరినైనా మనం ఎన్నుకోవచ్చు. వాళ్ల ఆర్థిక స్థితి గతులను అభివృద్ధి చేసేందుకు మీరు వారికి సాయం చేయవచ్చు. లేదంటే దానమైనా ఇవ్వవచ్చు. రంగ్‌ దే వీరి నుంచి నిర్దిష్ట మొత్తంలో వడ్డీ వసూలు చేస్తుంది. స్థానిక భాగస్వాములకు కొంత, రంగ్‌ దే నిర్వహణకు రెండు శాతం మినహాయించుకుని మిగిలిన వడ్డీని పెట్టుబడి పెట్టిన వారికి చెల్లిస్తారు. ఇలా తిరిగి వచ్చిన పెట్టుబడిని మీరు మళ్లీ ఇతరులకైనా అందివ్వవచ్చు లేదంటే వడ్డీతోపాటు మీరు వెనక్కు తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement