- నిరుద్యోగుల నుంచి రూ.అరకోటి వసూళ్లు
- కోరుట్లలో ఓ స్వచ్చంద సంస్థ నిర్వాకం
కోరుట్ల : డయాబెటిక్ శిక్షణ, ఉపాధి పేరిట నిరుద్యోగుల నుంచి వేలల్లో డబ్బులు గుంజుతున్న ఓ స్వచ్చంద సంస్థ నిర్వాకమిది. ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నప్పటికీ తమకు ఉపాధి కల్పించడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకం ద్వారా శిక్షణ నిర్వహిస్తున్నామని మభ్యపెడుతూ నిర్వాహకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఉపాధి విషయమై గొడవ చేయగా స్వచ్చంద సంస్థ నిర్వాహకులు వారిలో కొందరి వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయడం గమనార్హం. దీంతో పాటు నామమాత్రంగా ఓ డయోబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొందరికి ఉపాధి ఇచ్చినట్లు నమ్మిస్తున్నారు.
ఒక్కోక్కరికి రూ.30వేలు
కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ కింద తమకు డయాబెటిక్ నివారణ, అవగాహన శిక్షణ కేంద్రం మంజూరైందని, శిక్షణ తర్వాత ఉపాధి కల్పనకు అనుమతి ఉందని పేర్కొంటూ కోరుట్లకు చెందిన స్టార్ మహిళా మండలి నిర్వాహకులు ఏడాది క్రితం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ తీసుకున్న వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే డయాబెటిక్ అవేర్‌నెస్ సెంటర్లలో ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ ప్రచారం నిజమేనని నమ్మిన నిరుద్యోగ యువతీ యువకులు కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కేంద్రంలో అడ్మిషన్లు తీసుకున్నారు.
ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు రూ.30వేలు వసూలు చేశారు. శిక్షణ కేంద్రంలో అభ్యర్థులను చేర్పించడానికి ఏజెంట్లను నియమించుకుని వారికి ఒక్కో విద్యార్థిని చేర్పించినందుకు రూ.10వేలు అందజే శారు. ఈవిధంగా మొతం్త రెండు వందల మంది అభ్యర్థులను అడ్మిట్ చేసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.50 లక్షల వసూలు చేశారు. ఈ శిక్షణ ఏడాదికాలంగా కొనసాగుతున్నా.. ఉపాధి జాడ మాత్రం లేకుండా పోయింది.
అడిగితే డబ్బులు వాపస్..
రెండు నెలల క్రితం క్రితం డయూబెటిక్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న పలువురు అభ్యర్థులు తమకు ఇంకా ఎన్నాళ్లు శిక్షణ ఇస్తారంటూ ఆందోళనకు దిగారు. దీంతో సంస్థ నిర్వాహకులు గొడవ చేసిన వారికి డబ్బులు వాపస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే సుమారు ఇరవై మందికి డబ్బులు వాపస్ చేశారు. అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో ఓ డయాబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన వారిలో కొందరిని అక్కడ నియమించి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా డయాబెటిక్ కేంద్రాలు ఏర్పాటవుతాయని, శిక్షణ పొందిన వారికి ఆయూ కేంద్రాల్లో ఉపాధి దొరకుతుందని చెబుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో అలీంను వివరణ కోరగా... డయాబెటిక్ శిక్షణ కేంద్రం నిర్వహణ అంశం తమ పరిధిలోకి రాదన్నారు. అభ్యర్థులు పలుమార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
‘మధుమేహం’.. అంతా మోసం..!
Published Tue, May 5 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM