వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతే కోతలు ప్రారంభించాలి.
పాటించాల్సిన సూచనలు
వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతే కోతలు ప్రారంభించాలి.
వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసివేయాలి.
కోతకు 15 రోజుల ముందే నీటి తడులు ఆపివేయాలి.
1010 వంటి రకం వరి బంగారం వర్ణంలోకి వచ్చే వరకు ఆగితే గింజలన్నీ రాలిపోతాయి. ఈ ఒక్క రకాన్ని మాత్రం గోధుమ రంగులోకి రాగానే కోయాలి.
కోసిన వరి మొదలును నాలుగు రోజుల పాటు ఎండనివ్వాలి.
అనంతరం ఒక్కో రకం వరికి వేరు వేరు కల్లాలు చేసి, వాటిపై పరదాలు వేసి వరి మొదలు పెట్టి ట్రాక్టర్‌తో తొక్కించాలి.
ఒక రకానికి చెందిన వరి ధాన్యాన్ని మరొక రకం వరి ధాన్యంతో కలుపరాదు. పొలం వద్దే సరైన గ్రేడింగ్ చేయాలి.
గడ్డిని తీసివేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకల సహాయంతో తాలు లేకుండా శుభ్రంగా తూర్పార పట్టాలి.
13 శాతం తేమ ఉండే వరకు ఆరబెట్టి గోనె సంచుల్లో పోయాలి.
హార్వెస్టర్‌తో కోస్తే మొదటిసారి పోసే డబ్బాను వేరుగా పోయాలి. ఆ తరువాత కోసినవన్నీ ఒకచోట పోయాలి. ఇలా చేయడం ద్వారా కల్తీ ప్రమాదం తప్పుతుంది.
వరి గింజలన్నీ సిమెంటు కల్లాలపై లేదా టార్పాలిన్ షీట్లపై ఆరబెట్టా లి. రోజుకు మూడుసార్లు బాగా ఎండేలా కాళ్లతో కలియదున్నాలి.
పంట కోశాక సరిగా ఆరబెట్టకపోతే గింజలకు తెగుళ్లు సోకి, రంగుమారి, పంట నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది.
పంటను ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టిపెళ్లలు, చెత్త, చెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి.
నిల్వ చేసే పక్షంలో గోనె సంచులను కింద వేయకుండా బల్లలు పరిచి వాటిపై బస్తాలు నెట్టుగా వేయాలి.
పురుగులు ఆశించకుండా లీటరు నీటిని 5 మిల్లీలీటర్ల మలాథియన్ మందును కలిపి బస్తాలపై పిచికారి చేయాలి.
ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల నెట్టుల మధ్య జింక్‌పాస్ఫైట్ ట్యాబ్లెట్లు ఉంచాలి. ఒకరోజు తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండాపోతాయి. మరుసటి రోజు నుంచి తలుపులు తీయవచ్చు.