సకాలంలో గుర్తించి నివారించాలి | vermes will attack on Paddy crops | Sakshi
Sakshi News home page

సకాలంలో గుర్తించి నివారించాలి

Published Wed, Aug 6 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

సకాలంలో గుర్తించి నివారించాలి

సకాలంలో గుర్తించి నివారించాలి

పాడి-పంట: పెనుగొండ  (పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. అయితే ఈ పంటను తొలి దశ నుంచే పలు రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే దిగుబడులు, నాణ్యత దెబ్బతింటాయని చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ కె.వసంతభాను, డెరైక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి. ఆ వివరాలు...
 
 ఆకులు కుళ్లుతాయి
 కాండం తొలిచే పురుగు పసుపు రంగులో ఉంటుంది. దాని రెక్కల మధ్య నల్లని మచ్చ కన్పిస్తుంది. లద్దె పురుగు పిలక దశలో కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినేస్తుంది. దీనివల్ల మొవ్వు ఆకుకు పోషకాలు అందక ఎండి కుళ్లిపోతుంది. అందుకే దీనిని మొవ్వుకుళ్లు అంటారు. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు పురుగు ఆశిస్తే వెన్నులోని గింజలకు పోషకాలు అందక తాలుగా మారతాయి. అందుకే దీనిని తెల్లకంకి/ఊచపోటు అని కూడా అంటారు.
 
 పైరులో 5% చనిపోయిన మొవ్వులు లేదా చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు/గుడ్ల సముదాయం కన్పించిన 7-10 రోజులకు మందులు పిచికారీ చేయాలి. పైరు పిలక దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఫాస్ఫోమిడాన్/ఫిప్రోనిల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో పురుగు కన్పిస్తే ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు వేసుకోవాలి. లేకుంటే లీటరు నీటికి 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% పొడి మందు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రనిలిప్రోల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
 
 ఆకు చివర్లు ఎండుతాయి
 హిస్పా పురుగులు నీలంతో కూడిన నలుపు రంగులో ఉంటాయి. వాటి శరీరంపై చిన్న చిన్న ముళ్లు ఉంటాయి. తల్లి పురుగు ఆకు చివర గుడ్లు పెడుతుంది. వీటి నుంచి 3-5 రోజుల్లో లద్దె పురుగులు బయటికి వస్తాయి. అవి ఆకు పొరల మధ్యలోకి చొచ్చుకుపోయి, పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఆకు చివర్లు తెల్లబడి ఎండిపోతాయి. దూరం నుండి చూస్తే పైరు ఎండినట్లు కన్పిస్తుంది. అందుకే దీనిని తాటాకు తెగులు అని కూడా పిలుస్తారు. పెద్ద పురుగులు ఆకుల పైపొరను గోకి తినడం వల్ల తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. తొలకరి వర్షాలు పడిన తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ఈ పురుగులు బాగా వృద్ధి చెందుతాయి.
 
 హిస్పా పురుగుల నివారణకు పొలంలోనూ, గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను తీసేయాలి. దుబ్బుకు పురుగు ఆశించిన రెండు ఆకులు కన్పిస్తే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
 
 అంకురం ఉల్లికోడులా...
 ఉల్లికోడు పురుగు ముదురు ఎరుపు రంగులో దోమ మాదిరిగా ఉంటుంది. దీని లద్దె పురుగు అంకురం వద్దకు చేరుకొని ‘సెసిడోజిన్’ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందదు. అది పొడవాటి గొట్టం (ఉల్లికోడు)గా మారుతుంది. పురుగు ఆశించిన పిలకలు వెన్నులు వేయవు. ఈ పురుగు పైరు పిలకలు వేసే దశలో ఆశిస్తుంది. నాట్లు ఆలస్యంగా వేసినప్పుడు, పిలక దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులను వాడినప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఉల్లికోడు నివారణకు... పిలక దశలో 5% ఉల్లి గొట్టాలు లేదా దుబ్బుకు ఒక ఉల్లికోడు ఆశించిన పిలక కన్పిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నాట్లు వేసిన 10-15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 5 కిలోల ఫోరేట్ 10జీ గుళికలు వేయాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున క్లోరిపైరిఫాస్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి.
 
 మొక్కలు ఎదగవు
 అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు వరి పైరును ఆకునల్లి ఆశిస్తుంది. సాలీడు జాతికి చెందిన చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన, ఈ నెల వెంబడి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగుకు మారతాయి. మొక్కలు ఎదగక గిడసబారతాయి. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల గంధకం (నీటిలో కరిగే) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారీ చేయాలి.
 
 గుర్తుంచుకోండి
 వరి పైరులో చీడపీడల నివారణ కోసం... నారుమడిలో విధిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు కొనలను తుంచి నాటాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాట తీయాలి. మొగి పురుగు ఉధృతిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు అమర్చాలి. పొలం గట్లపై కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. చేలోని మురుగు నీటిని బయటికి పంపుతూ ఉండాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. మందులు పిచికారీ చేసే ముందు చేలో నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి. పైరు బాగా తడిసేలా మందు ద్రావణాన్ని నాప్‌శాక్/పవర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement