ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, వైరా తదితర ప్రాంతాల్లో దోమపోటు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇది వ్యాపిస్తోందని చెబుతున్నారు. వరి 25 రోజుల నుంచి పొట్ట దశ వరకు ఉంది. ముందుగా వేసిన వరి పొట్టదశలో ఉంది. ప్రధానంగా 5204 సాంబ మసూరీ రకం వరిలో అధికంగా దోమపోటు ఉన్నట్లు వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు. ఎంటీయూ 1010, 1001 వంటి రకాలు దోమను తట్టుకొనే గుణం ఉన్నా వాతావరణం అనుకూలించకపోవటంతో వీటినీ దోమ ఆశించిందని జిల్లా వ్యవసాయ ఉప సంచాలకులు ఎం.రత్నమంజుల తెలిపారు. వరి పంట దిగుబడులను దెబ్బతీసే దోమ పోటును సమర్థంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. దోమపోటు నివారణ చర్యల గురించి వివరించారు.
వరిని ఆశించే దోమల రకాలు
వరిని రెండు రకాల దోమలు ఆశించి నాశనం చేస్తాయి.
1.గోధుమ రంగు వర్ణపు దోమ (బ్రేన్ ప్లాంట్ హాపర్)
2. తెల్లవీపు దోమ ( వైట్ బ్లాక్ ప్లాంట్ హాపర్)
దోమ ఉధృతికి అనుకూల పరిస్థితులు
వాతావరణంలో 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80-90 శాతం ఉంటే దోమ త్వరగా అభివృద్ధి చెందుతుంది. నత్రజనిని అధికంగా వాడిన ప్రాంతాలు, నీరు నిల్వ ఉన్న పొలాల్లో దోమపోటు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
దోమ జీవిత చరిత్ర
ఆడదోమ మొక్క అడుగు భాగంలోని ఆకు తొడుగులో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు కంటికి కనిపించని పరిమాణంలో ఉంటాయి. సుమారు వారం రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. రసాన్ని పీల్చి పెరుగుతాయి. ఈ పిల్ల పురుగులు 12-17 రోజుల్లో 5 దశల్లో పెరిగి క్రమేపి పెద్దవవుతాయి. ఈ పెద్ద పురుగులు తిరిగి గుడ్లు పెడతాయి. ఆడదోమలు, మగ దోమల కన్నా పరిమాణంలో పెద్దగా ఉంటాయి.
పంటను ఇలా నష్టపరుస్తాయి
గోధుమ రంగులో ఉండే తల్లి, పిల్ల పురుగులు వరి దుబ్బుల మొదళ్ల దగ్గర గుంపులుగా చేరి కాండం నుంచి రసాన్ని పీల్చి వేయడం వల్ల మొక్కకు పోషక పదార్థాలు అందక బలహీనపడతాయి. క్రమేపీ మొక్కలు సుడులుగా ఎండిపోతాయి. దీన్నే సుడి తెగులు అంటారు. తెల్లవీపుదోమ కూడా గోధుమ వర్ణపు దోమవలె వరిమొక్కలోని రసాన్ని పీల్చి పంటకు నష్టం చేస్తుంది.
నివారణ చర్యలు
నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. పైపాటుగా వాడేటప్పుడు 2-3 దఫాలుగా వాడాలి.
వరి నాటే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ (తూర్పు. పడమర) పాయలను వదిలి నాటితే గాలి ప్రసరించి దోమల ఉధృతి తక్కువగా ఉంటుంది.
నీరు నిల్వ ఉంటే దోమ ఉధృతి పెరుగుతుంది. పొలాన్ని ఆరగట్టి తిరిగి నీటిని పెట్టడం ద్వారా దోమల ఉధృతిని తగ్గించవచ్చు.
విచక్షణ రహితంగా పురుగుమందులను వినియోగించవద్దు. ఉదాహరణకు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పిచికారీ చేస్తే దోమ ఉధృతి తగ్గటానికి బదులు ఎక్కువవుతుంది.
వాడాల్సిన పురుగు మందులు
మోనోక్రొటోఫాస్ 36 శాతం ద్రావణం ఎకరాకు 440 మి.లీ లేదా ఎసిఫేట్ 75 శాతం 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వీటి ప్రభావం 3-4 రోజుల వరకు ఉంటుంది.
ఫిప్రోనిల్ 5 శాతం 400 మి.లీ పిచికారీ చేసి కూడా నివారించుకోవచ్చు. అయితే దీని ప్రభావం కన్పించడానికి 2-3 రోజుల సమయం పడుతుంది.
15-20 రోజుల వరకు కీటకాలను నాశనం చేస్తుంది. ఎథోఫెన్ ప్రాక్సి 10 శాతం ద్రావణం ఎకరాకు 400 మి.లీ లేదా బూప్రోఫెజిన్ 25 శాతం 320 మి.లీ మందు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ రెండు కీటక నాశినులు దోమ ఉధృతిని తగ్గించటమేగాక దోమ సహజ శత్రువైన మిరిడీ బగ్స్ సాలీడులకు తక్కువ హాని చేస్తాయి.
పిచికారీ విధానం: నాజిల్‌ను మొక్క మొదలు వైపు ఉంచి క్రిమిసంహారక మందును పిచికారీ చేయాలి. దోమ మొక్కల కాండం అడుగు భాగాన ఉంటుంది. కాబట్టి పంటపైన పిచికారీ చేస్తే ప్రయోజనం ఉండదు.
దోమపోటు..పంటకు చేటు
Published Wed, Oct 1 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement
Advertisement