
చంపినా, సజీవంగా పట్టి తెచ్చినా నజరానా
దోమలపై దండయాత్ర మొదలెట్టిన ఫిలిప్పీన్స్ గ్రామం
మనీలా: డెంగీ వ్యాధి పేరు చెబితే ఎవరైనా హడలిపోవాల్సిందే. ప్రజాసంక్షేమానికి, తమ పౌరుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సైతం డెంగీ పేరు చెబితే వణికిపోతోంది. విజృంభిస్తున్న డెంగీ కేసులు, దోమలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది మాత్రమే రంగంలోకి దిగితే సరిపోదని స్థానిక పాలకులు భావించారు. పౌరులను ఈ క్రతువులో భాగస్వాములను చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా దోమలను చంపితే నజరానా ఇస్తామని ప్రకటించారు.
ప్రతి ఐదు దోమలకు ఒక ఫిలిప్పీన్స్ పేసో( 1 పేసో అంటే భారతీయ కరెన్సీలో రూ.1.50) చొప్పున డబ్బులు ముట్టజెప్తామని సెంట్రల్ మనీలాలోని బరాంగే అడిషన్ హిల్స్ గ్రామ పెద్ద కార్లిటో సెర్నాల్ స్పష్టంచేశారు. దోమలను చంపితే కూడా డబ్బులిస్తారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు వ్యంగ్య పోస్ట్‌లు చేసినా ఆయన దానిని సానుకూలంగా స్పందించారు. ‘‘ఎవరేమనుకున్నా పర్లేదు. మాకు మా పౌరుల ఆరోగ్యమే ముఖ్యం’’అని తాపీగా సమాధానమిచ్చారు.
ఇటీవల ఈ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు దోమకాటు కారణంగా డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దోమల దండుపై దండయాత్రకు గ్రామపెద్ద పిలుపునిచ్చారు. ‘‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన దోమనల్లా చంపేయండి. కేవలం నెలరోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది’’అని ఆయన మరోసారి గుర్తుచేశారు.
ఖాళీగా కూర్చోకుండా దోమల బ్యాట్‌తో రంగంలోకి దిగితే మంచి డబ్బులొస్తాయని కొందరు వెంటనే పని మొదలెట్టారు. గ్రామంలో ఇప్పటికే 21 మంది తాము చంపిన, సజీవంగా పట్టితెచ్చిన దోమలు, వారి లార్వాలను చూపించారు. వాళ్లు వందలాది దోమలు, లార్వాలను తీసుకొచ్చారు. బతికున్న దోమలను అవి డెంగీ వ్యాధికారక రకం దోమలో కాదో అతినీలలోహిత కిరణాల కింద పెట్టి పరీక్షించి నిర్ధారిస్తామని గ్రామ పెద్ద చెప్పారు. ఈ తతంగం చూసి నవ్వుకున్న కొందరు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో వ్యంగ్య పోస్ట్‌లు పెట్టారు. ‘‘పట్టుకునే, చంపే క్రమంలో దోమ రెక్క ఒకటి ఊడిపోతే దానిని లెక్కలోకి తీసుకుంటారా? లేదంటే తిరస్కరిస్తారా?’’అని ఒక వ్యక్తి పోస్ట్‌చేశారు.
మెచ్చుకున్న ప్రభుత్వం
స్థానిక యంత్రాంగం స్థాయిలో దోమల వ్యాప్తి కట్టడికి జరుగుతున్న కృషిని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెచ్చుకుంది. ‘‘ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిందే. పౌరులు సైతం తమ వంతు బాధ్యతగా స్థానిక ఆరోగ్య అధికారులు లేదా ఫిలిప్పీన్స్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ ఆఫీస్‌లకు వెళ్లి డెంగీ నివారణ, దోమల వ్యాప్తి నిరోధక పద్ధతులపై అవగాహన పెంచుకోండి’’అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘మా ప్రాంతంలో దోమల బెడద చాలా ఎక్కువ. ఇటీవలే 44 డెంగీ కేసులు వెలుగుచూశాయి. సొంతంగా కట్టడి చర్యలకు ఉపక్రమించాం. ఎవరేమనుకుంటున్నారు అనేది మాకు అనవసరం.
మాకు తోచినంతలో మా ప్రాంతాన్ని మేం దోమలరహితంగా మారుస్తున్నాం’’అని గ్రామ పెద్ద అన్నారు. ‘‘సెంట్రల్ మనీలాలోని 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బరాంగే అడిషన్ హిల్స్ జనాభా 70,000. డెంగీ కారక దోమలు లార్వాలను విడిచేందుకు వీలులేకుండా ఎప్పటికప్పుడు నీటి నిల్వ ప్రాంతాలను శుద్ధిచేయడం చేస్తున్నాం’’అని ఆయన చెప్పారు. ఉష్ణమండల దేశమైన ఫిలిప్పీన్స్‌లో దోమల సమస్య ఎక్కువే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన 40 శాతం అధికంగా ఏకంగా 28,234 డెంగీ కేసులు నమోదైనట్లు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. నీరు నిల్వ ఉండే టైర్లు, నిరుపయోగ డ్రమ్ములు, బకెట్లను పారేయాలని, ప్రజలు చేతులు పూర్తిగా కప్పేసేలా వస్త్రధారణ ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment