జ్వరం..కలవరం..! | Fever Attack In YSR Kadapa | Sakshi
Sakshi News home page

జ్వరం..కలవరం..!

Published Sat, Sep 8 2018 2:11 PM | Last Updated on Sat, Sep 8 2018 2:11 PM

Fever Attack In YSR Kadapa - Sakshi

జూన్, జూలైలో తొలకరి చినుకులు పలకరించాయి. తరువాత అడపాదడపా వానలు పడ్డాయి. తేలికపాటి జల్లులకే నిద్రావస్థలో ఉన్న దోమలు మేల్కొన్నాయి. అందుకు జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం తోడైంది. ఇంకేముంది దోమలు ప్రజలపై దండయాత్ర చేయడం ప్రారంభించాయి. దీంతో జిల్లా వాసులు  జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రుల బాట పట్టారు.

కడప రూరల్‌: జిల్లాలోని కడప రిమ్స్‌లో ఒక రోజుకు ఔట్‌ పేషెంట్స్‌ గడిచిన మే నెలలో 800 నుంచి 1100 వరకు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 1200 నుంచి 1600 వరకు పెరిగింది. ఇందులో అన్ని వ్యాధులకు సంబంధించిన వారు ఉన్నప్పటికీ, జ్వర పీడితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో తాజాగా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అక్కడికి ఒక రోజుకు దాదాపు 70 నుంచి 100 మందికి పైగా వస్తున్నారు. గడిచిన ఏడాది వానలు పుష్కలంగా పడ్డాయి. దాంతోపాటే రోగాలు కూడా పెరిగాయి. ప్రతి ఏటా దాదాపు ఒక లక్ష మంది వరకు కేవలం వివిధ రకాల జ్వరాల బారిన పడుతున్నారు. తాజాగా ఇప్పటి వరకు దాదాపు 40 వేల మందికిపైగా జ్వరాలకు గురయ్యారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అధికారికంగా డెంగీ కేసులకు సంబంధించి 45 మంది అనుమానితులుగా గుర్తించగా అందులో కడప నగరం ప్రకాష్‌నగర్, మరియాపురం, మస్తాన్‌వలి వీధిలో ఒక్కక్కరి చొప్పున ప్రొద్దుటూరు, పెద్ద చెప్పలి, ఎర్రగుంట్లలో మొత్తం ఏడుగురికి డెంగీ ఉన్నట్లుగా గుర్తించారు. పరిసరాల అపరిశుభ్రత, కలుషిత నీరు, తదితర కారణాల వల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డయేరియా, నీళ్ల విరేచనాల కేసులు నమోదవుతున్నాయి.

జ్వరాలు ఎందుకొస్తాయంటే...
వాతావరణంలో సంభవించే మార్పులు, ఇంట్లో, బయట పరిసరాల అపరిశుభ్రత కారణంగా వాతావరణంలో అనూహ్యంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఏడాదికి ఒకవైరస్‌ పుడుతోంది. ఆ మేరకు వైరల్‌ ఫీవర్స్‌ వస్తాయి.వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను పాటించడం వల్ల దీనికి అడ్డుకట్ట వేయవచ్చు అని వైద్యులు అంటున్నారు.

కొరవడిన శాఖల మధ్య సమన్వయం...
దోమల నివారణ, పరిసరాల శుభ్రత, ప్రజల్లో చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, వైద్య సేవలను అందించడం తదితర పనులను పంచా యతీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు ఏకకాలంలో చేపట్టాలి. అయితే ఆ శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఉదాహరణకు దోమలనే చెప్పుకోవచ్చు. వీటివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్చలు చేపట్టాల్సి ఉంది.

వ్యాధుల తీవ్రత అదుపులోనే ఉంది..
జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలను విరివిగా చేపడుతున్నాం. మా హాస్పిటల్స్‌లో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో డీడీటీని స్ప్రే చేయిస్తున్నాం. ప్రజలు వ్యక్తిగత, పరసరాల శుభ్రతకు పాటు పడాలి. జిల్లాలో వ్యాధుల తీవ్రత అదుపులోనే ఉంది.– డాక్టర్‌ ఉమాసుందరి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement