రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన కూరగాయలు’ పథకం....
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన కూరగాయలు’ పథకంలో భాగంగా ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించిన గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు (వెజిటబుల్ కలెక్షన్ సెంటర్స్) ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రభుత్వ మార్కెటింగ్ సీనియర్ ఫీల్డ్ అధికారి కర్మజిత్‌సింగ్ షెకాన్ పేర్కొన్నారు. చేవెళ్లలోని ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం దేవునిఎర్రవల్లి, చనువల్లి గ్రామాల రైతులకు కూరగాయల కొనుగోలు కేంద్రాలపై అవగాహనకల్పించారు.
ఈ సందర్భంగా కర్మజిత్‌సింగ్ షెకాన్, ఉద్యానశాఖ డివిజన్ అధికారి సంజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ.. మన ఊరు- మన కూరగాయల పథకంలో భాగంగా చేవెళ్ల ఉద్యాన డివిజన్ పరిధిలోని చనువల్లి, దేవునిఎర్రవల్లి, కొత్తగడి, నారాయణపూర్ గ్రామాల్లోని రైతులకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించినట్లు తెలిపారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 120 హెక్టార్లలో సాగు కోసం విత్తనాలు ఇచ్చారని, ప్రస్తుతం ఆ పంట ఉత్పత్తులు అమ్మకానికి వచ్చే దశలో ఉన్నాయన్నారు.
దీంతో మొదటగా ఆ గ్రామాలలో ప్రభుత్వం తరపున కూరగాయల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరిస్తే రైతులకు దళారుల బెడద నుంచి విముక్తి కావడమే కాకుండా ఏజెంట్ కమీషన్ కూడా ఉండదన్నారు. ఆ గ్రామ రైతులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా కూరగాయల కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు తమ పొలంలో నుంచి నేరుగా గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చి అప్పగించడమేనని తెలిపారు. తీసుకున్న కూరగాయలను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన వాహనంలోనే తీసుకెళ్లి నగరంలోని మార్కెట్లలో విక్రయిస్తారని చెప్పారు.
మార్కెట్లో ఆ రోజు ఏ ధర ఉంటే ఆ ధరను రైతులకు చెల్లిస్తారని చెప్పారు. రైతులకు మార్కెట్‌కు వెళ్లే పరిస్థి తి ఉండదని, ఏజెంట్ కమీషన్ కూడా ఉండదన్నారు. దీంతో రైతుల సమయం, రవాణా ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రతి గ్రామంలో కూరగాయల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ ఫీల్డ్ కన్సల్టెంట్ రాఘవేందర్‌రెడ్డి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు సుభాష్, నరేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.