
వేసెయ్‌జీ.. క్యాబేజీ
క్యాబేజీ పంట సాగుకు ఇది అనుకూలమైన సమయం. ఈ పంటను జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.
ఖమ్మం వ్యవసాయం: క్యాబేజీ పంట సాగుకు ఇది అనుకూలమైన సమయం. ఈ పంటను జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఇల్లెందు, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, భద్రాచలం, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో ఈ పంట సేద్యమవుతోంది. క్యాబేజీ పంటలో రకాలు, విత్తన మోతాదు, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ తదితర అంశాలను ఖమ్మం ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న వివరించారు.
క్యాబేజీ రకాలు: గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రీమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేటు కంపెనీలు విడుదల చేసిన రకాలు.
విత్తనమోతాదు: ఎకరానికి 100 నుంచి 150 గ్రాముల విత్తనాలు.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ను కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తే విధానం: మొక్కల మధ్య, వరుసల మధ్య 45 సెం.మీ దూరం ఉండాలి.
ఎరువులు, నీటి యాజమాన్యం
ఎకరానికి 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో, 50 కిలోల వరకు నత్రజనిని ఇచ్చే ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి. (నాటిన 25-30 రోజులు, 50-60 రోజులు, 75-80 రోజులు). బిందు సేద్యం ద్వారా నీరు పారించటం శ్రేయస్కరం.
సస్యరక్షణ
తల్లి రెక్కల పురుగులు: ఇవి చిన్నవిగా గోధుమ రంగులో ఉంటాయి. డైమండ్ ఆకారంలో ఈ పురుగులు ఉంటాయి. కనుక వీటిని డైమండ్ బాక్ మాత్ అంటారు. ఈ పురుగులు గుడ్లను పెట్టి పొదుగుతాయి. వీటి నుంచి వచ్చే లార్వాలు అడుగు భాగాన చేరి ఆకులను తినేస్తాయి.
నివారణ: ప్రతి 25 వరుసల క్యాబేజి పంటకు 2 వరుసల చొప్పున ఆలా మొక్కలు ఎర పంటగా నాటాలి. 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. పురుగుల ఉధృతిని బట్టి లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ స్పెనోశాడ్ మందును పిచికారీ చేయాలి.
బ్యాక్టీరియా నల్లకుళ్లు: దీని వల్ల ఆకులు పత్రహరితం కోల్పోయి ‘వి’ ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి.
నివారణ: 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్ , 5 మి.గ్రా, స్పెప్ట్రోసైక్లిన్ మందును పిచికారీ చేయాలి. ఎకరాకు 5 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో పైపాటుగా వేయాలి.