దండేపల్లి : పశువులకు ఖనిజ, లవణాలు (మినరల్ మిక్చర్) సమపాళ్లలో అందించాలి. లేదంటే అనారోగ్యం, ఉత్పత్తి, పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. ఖనిజ లవణాలు లోపించకుండా అన్ని పోషకాలతో కూడిన మిశ్రమాన్ని కలిపి ఇవ్వాలి. ఈ పోషకాలు లోపిస్తే రక్తహీనత, సరైన శరీర ఎదుగుదల ఉండకపోవడం..ఆలస్యంగా యుక్త వయస్సుకు రావడం, ఎదకు రాకపోవడం, మూగఎద, తిరిగిపొర్ల డం, పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందని లక్సెట్టిపేట పశుసంవర్ధకశాఖ అదనపు సహాయ సంచాలకులు వీరయ్య వివరించారు.
పశువు ఆరోగ్యంలో ఖనిజ, లవణాల పాత్ర కీలకం
పశువు ఆరోగ్యంలో ఖనిజ, లవణాల పాత్ర ఎనలేనిది. పశువు శరీరం సక్రమంగా పనిచేయడానికి పిండి పదార్థాలు, మాంసకృతులతోపాటు కొద్ది పరిమాణంలో ఖనిజ, లవణాలు, విటమిన్లు అవసరమవుతాయి. మొక్కలు, పశువుల్లో సుమారు 40శాతం ఖనిజ, లవణాలు ఉండగా వాటిలో 15శాతం మాత్రమే ప్రధానంగా అవసరమవుతాయి.
పశువు శరీరంలో ఉండే పరిమాణం బట్టి స్థూల, సూక్ష్మపోషకాలుగా విభజించారు. శరీరానికి ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే స్థూల ఖనిజ , లవణాలైన కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం క్లోరిన్, పోటాషియం, తక్కువ మోతాదులో అవసరమయ్యే సూక్ష్మ ఖనిజ లవణాలైన కాపర్, కోబాల్ట్, ఐరన్, జింక్, మాంగనీస్, అయోడిన్, సెలీనియం, ప్లోరిన్, మాలిబ్దమ్, క్రోమియం.
ఖనిజ, లవణాల విధులు..
ఖనిజ, లవణాలు విడిగా కాకుండా ఇతర లవణాలతో కలిసి విధులు నిర్వహిస్తాయి. శరీరం లో జరిగే వివిధ జీవన ప్రక్రియలకు ఎంజైమ్‌లకు మధ్యవర్తిగా పనిచేస్తూ, సమతుల్యాన్ని కాపాడుతాయి. శరీరంలోని అన్ని రకాల ఎముకలు, దంతాల ఎదుగుదలకు, వాటి పటిష్టానికి , వెంట్రుకలు తయారీలో ఉపయోగపడతాయి. పశువు జీర్ణ ప్రక్రియ రక్త కణాల్లో హిమోగ్లోబిన్, తయారీ, రక్తం గడ్డకట్టుటకు తోడ్పడతాయి. పాల ఉత్పత్తి లోనూ, పునరుత్పత్తి, హార్మోన్స్, ఎంజైమ్‌ల తయారీలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తకణాల అభివృద్ధికి తోడ్పడతాయి.
స్థూల పోషక లోపాలు- లక్షణాలు
కాల్షియం : ఈ లవణం లోపిస్తే పునరుత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. చూడి పశువుల్లో ‘మయ్య’(ఈనక ముందు, ఈనిన తర్వాత) సరిగా ఈన లేకపోవడం, ఈనిన తర్వాత పాల జ్వరం రావ డం జరుగుతుంది. మయ్య వేయకపోవడంతో పాల ఉత్పత్తి తగ్గుతుంది. లేగ దూడల్లో ఎముకలు అసమానంగా పెరుగుట వల్ల రికెట్స్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. పెద్దపశువుల్లో ఎముకలు బలహీనపడి ‘అస్టియోషి మలేషియా’ వస్తుంది. ఎముకల పొడి, ఎండు చేపల దాణా, పప్పుజాతి గడ్డిలో కాల్షియం అధికంగా లభిస్తుంది.
పాస్పరస్ : దీని లోపంతో యుక్త వయస్సు పశువుల్లో రికెట్స్, పెద్దపశువుల్లో ‘అస్టియో మలేషియా’ వ్యాధి వస్తుంది. అంతే కాకుండా మట్టి నాకుతాయి. తద్వారా ఆకలి మందగిస్తుంది. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గుతుంది. పెరుగుదల లోపిస్తుంది. పెయ్యలు ఆలస్యంగా యుక్త వయస్సుకు వస్తాయి. కొన్నింటిలో మూగ ఎద, మరి కొన్నింటిలో పూర్తిగా ఎదకు రాక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఈతల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది. చూడిశాతం తక్కువగా ఉండడం.. తిరిగి పొర్లడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎముకల పొడి, ఎండు చేపల దాణా, తవుడు , తృణధాన్యాలలో పాస్పరస్, అధికంగా ఉంటుంది. కాల్షియం, పాస్పరస్ ఎప్పుడు 2:1 నిష్పత్తిలో ఉండాలి.
మెగ్నీషియం : ఈ లోపంతో ‘మెగ్నీషియం టెంటాని’ సంభవించి పశువు నీరసంగా ఉంటుంది. కేవలం పాలతోనే పెరిగే దూడల్లో మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. గోధుమలు, తవుడు, పప్పు జాతి పశుగ్రాసాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
సోడియం, క్లోరిన్ : దీని లోపం పెద్దగా పైకి కనిపించదు. ఒకవేళ ఇది లోపిస్తే పశువుల్లో ఆకలి మందగిస్తుంది. పెరుగుదల ఉండదు. ఈ రెండు ఖనిజాలు ఉప్పు రూపంలో ఇవ్వవచ్చు.
పోటాషియం : దీని లోపం అరుదుగా ఉంటుంది. ఇది లోపిస్తే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి త గ్గి లేగ దూడల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి.
సూక్ష్మ పోషక లోపాలు-లక్షణాలు
కాఫర్ : దీని లోపంతో పశుల్లో రక్తహీనత, వెంట్రుకలు రంగు మారుట, పెరుగుదల మందగించడం, నాడీ మండల వ్యాధులు, కండరాల బలహీనత, విరేచనాలు, పునరుత్పత్తి సమస్యలు, ఎదకు రాకపోవడం, ఆలస్యంగా యుక్త వయస్సుకు రావడం, తిరిగి పొర్లడం, మూగ ఎద లక్షణాలు కనిపిస్తాయి. గేదెల్లో శరీరంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. గోధుమలు, తవుడు లో కాఫర్ అధికంగా ఉంటుంది.
కోబాల్ట్ : ఈ దాతు లోపంతో పశువుల్లో ఆకలి, మందగించి రక్తహీనత ఏర్పడుతుంది. చర్మం బిరుసుగా ఉంటుంది. గేదెలు, ఆవుల్లో ఈతల మధ్య ఎక్కువ విరామం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఐరన్ : దీని లోపం కేవలం పాల మీద మాత్రమే ఆధార పడే లేగదూడల్లో కనిపిస్తుంది. రక్త హీనత ఏర్పడుతుంది. పప్పు జాతి పశుగ్రాసాల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది.
జింక్ : దీని లోపంతో పశువుల్లో ఎదుగుదల స్తంభిస్తుంది. చర్మవ్యాధులు, వెంట్రుకలు రాలుట అధికమై పశువులు మృత్యువాత పడతాయి. తువుడు, పిండి చెక్కల్లో జింక్ అధికంగా ఉంటుంది.
అయోడిన్ : ఇది థైరాయిడ్ గ్రంథిలో ఉండి థైరాక్సిడ్ అనే హార్మోన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. అయోడిన్ లోపంతో థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగి ‘గాడర్’ అనే వ్యాధి సోకుతుంది. చూడి పశువులకు వెంట్రుకలు లేని, బలహీనమైన దూడలు జన్మిస్తాయి. పునరుత్పత్తి సమస్యతో ఎదకు రాకపోవడం, చూడి కట్టకపోవడం, మాయ వేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మాంగనీసు : దీని లోపంతో పెరుగుదల మందగిస్తుంది. గర్బస్రావం జరుగుతుంది. ఎదకు రాకపోవడం, అండం ఆలస్యంగా విడుదల కావడం.. చూడి కట్టక పోవడం, మూగ ఎద లక్షణాలు, లేగ దూడల్లో కీళ్ల వాపు వస్తాయి. తవుడు, పశుగ్రాసాలు, ఎండు గడ్డిలో మాంగనీసు అధికంగా లభిస్తుంది.
సెలీనియం : దీని లోపం వలన కీళ్లు గట్టిపడుతాయి. పశువులు కుంటుతాయి, శరీరం మీద, తోక వెంట్రుకలు రాలిపోతాయి. కండరాల బలహీనత, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. పొదుగు వాపు వ్యాధులు కూడా వస్తాయి.
క్రోమియం : ఈ ఖనిజ లోపంతో పశువుల్లో పెరుగుదల స్తంభిస్తుంది. కంటి సమస్యలు తలెత్తుతయి.
ప్లోరిన్ : ఎముకలు, దంత నిర్మాణానికి ఇది కొంత మోతాదులో అవసరమవుతుంది. ఈ ఖనిజ లోపంతో ఏర్పడే సమస్యలు అరుదుగా ఉంటాయి.
మారిబ్దనమ్ : వీటి లోపంతో పశువులు నీరసంగా ఉంటాయి. శరీరంపై గల వెంట్రుకలు బిరుసుగా మారతాయి.
నేల ప్రభావంతో..
పశుగ్రాసాలు సాగుచేసే నేలలో ఖనిజ, లవణాలు లోపిస్తే ఆ నేలలో సాగు చేసిన మేతను తిన్న పశువులో ఆయా ఖనిజ లవణాల లోపాలు కనిపిస్తాయి. పశుపోషకులు ఈ పద్ధతులు పాటిస్తే పశుసంపద వృద్ధి చెంది ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు.