ఆదిలోనే అదుపుచేద్దాం.. | control of pests in starting stage | Sakshi
Sakshi News home page

ఆదిలోనే అదుపుచేద్దాం..

Published Thu, Sep 25 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ఆదిలోనే అదుపుచేద్దాం..

ఆదిలోనే అదుపుచేద్దాం..

తామర పురుగులు
 ఆకుముడత లేదా తామర పురుగులు మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుంచి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి. రసాన్ని పీల్చడం వలన పై ముడత వస్తుంది. ఆకులు, పిందెలు రాగి లేదా ఇటుక రంగులలోకి మారి పూత, పిందె నిలిచి పోతుంది. మొక్కలు గిడసబారి పూత రాలిపోతుంది. పూత పిందెగా మారదు. లేతకాయలు గిడసబారి చారలు ఏర్పడుతాయి. కాయల నాణ్యత  లోపిస్తుంది. దిగుబడి తగ్గుతుంది.

 నివారణ: కార్బరిల్ 3 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ, డెఫైన్ థియోరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. నాటిన 15, 45 రోజుల్లో ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేస్తే పై ముడతను నివారించుకోవచ్చు.

 తెల్లనల్లి
 చిన్న, పెద్ద పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసంపీల్చుతాయి. ఆకులు వెనుకకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో ఉం టాయి. ఆకు పెరుగుదల తగ్గి పూత పూయటం నిలిచిపోతుంది. దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో తేమ అధికంగా ఉన్న సమయంలో ఉంటుంది.

 నివారణ: డైకోపాల్ 5 మి.లీ లేదా ఫోసలోన్ 3 మి.లీ లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగుభాగం కూడా తడిచేటట్లు పిచికారీ చేయాలి. కింది ముడత ఎక్కువగా ఉన్నప్పుడు సింతటిక్ పైరిథ్రాయిడ్ మందును వాడొద్దు. నత్రజని ఎరువు వాడకాన్ని తగ్గించాలి.

 పేనుబంక
 ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన లేత కొమ్మలను ఆశించి రసం పీలుస్తాయి. ఇవి తేనెవంటి పదార్థాన్ని విసర్జించటం వల్ల చీమలు చేరుతాయి. ఈ పదార్థంపైన నల్లని శిలీంద్రపు పెరుగుదల వల్ల ఆకులు, కాయలు మసిబారి పోతాయి. ఇవి ఆశించిన ఆకులు మెలికలు తిరిగి మొక్కల ఎదుగుదల నశిస్తుంది. నాణ్యత, దిగుబడి తగ్గుతుంది.

 నివారణ: మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 తెల్లదోమ
 తెల్లదోమలు గుంపులుగా చేరి ఆకుల రసాన్ని పీల్చుతాయి. ఆకుల ఎర్రబారి మొక్కల ఎదుగుదల క్షీణిస్తుంది.

 ఠనివారణ: ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా లీటర్ నీటిలో దయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 కాయతొలుచు పురుగులు
 మిరపనాశించు కాయతొలుచు పురుగుల్లో పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగులు ముఖ్యమైనవి. వీటి వల్ల పంటకు 50 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది.

 శనగపచ్చ పురుగు పిల్లలు మొదట ఆకులు, పూత దశలో పూభాగాలు తిని పంటకు నష్టం చేస్తాయి. కాపు దశలో కాయలో తల భాగాన్ని జొప్పించి మిగిలినదాన్ని తినడం వల్ల తాలు కాయలుగా మారుతాయి.

 పొగాకు లద్దె పురుగు పిల్లలు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పచ్చని పదార్థాన్ని తిని జల్లెడలా మారుస్తాయి. కాపు దశలో ముచ్చిక వద్ద రంధ్రం చేసి కాయ లోపలకు చేరి గింజలు, గుజ్జును తింటాయి. ఫలితంగా కాయను ఆరబెట్టినప్పుడు తాలుబారుతాయి.

 పచ్చరబ్బర్ పరుగు కూడా మొదటి దశలో ఆకులు, తరువాత దశలో కాయలను నష్టపరుస్తాయి.
 ఠనివారణ: 2 మి.లీ ఎండోసల్ఫాన్ లేదా 2 మి.లీ క్లోరిఫైరీఫాస్ లేదా 3 గ్రాముల కార్బరిల్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.35 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

బాగా ఎదిగిన లద్దె పురుగులను విషపు ఎర ద్వారా కూడా నివారించవచ్చు. ఐదు కిలోల తవుడు, 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా క్లోరిఫైరీఫాస్‌ను 500 గ్రాముల బెల్లంతో కలపాలి. తగినంత నీటిని జోడించి చిన్నచిన్న ఉండలుగా తయారు చేయాలి. సాయంత్రం వేళ పొలంలో మొక్కల మొదళ్ల దగ్గర పెట్టడం వల్ల లార్వాలను నివారించవచ్చు.

 వేరుపురుగు
 ఇటీవలి కాలంలో మిరప పండించే కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు సమస్య అధికంగా ఉంది. వీటి పిల్ల పురుగులు భూమిలో 5-10 సెం.మీ లోతులో మిరప వేర్లు, కాండాలను తిని నష్టం కలుగ జేస్తాయి. ఫలితంగా మొక్కలు వడలి చని పోతాయి.

 నివారణ: ఎకరాకు 8 కిలోల ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు వాడాలి. ఈ గుళికలు భూమిలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మట్టితో కప్పి పెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement