ఏళ్ల తరబడి మనం ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చిమిర్చిని, ఎర్ర రంగులో ఉండే ఎండుమిర్చిని చూస్తున్నాం.. వంటల్లో వాడుతున్నాం.. కానీ పసుపు రంగు మిర్చిని ఎప్పుడైనా చూశారా? కూరగాయలు అమ్మే కొన్ని పెద్ద దుకాణాల్లో పసుపు రంగులో ఉండే క్యాప్సికం (బెంగళూరు మిర్చి) కన్పిస్తుంది. కానీ ఎల్లో మిర్చి కనబడదనే చెప్పాలి. అయితే ఖమ్మం జిల్లాలో ఓ రైతు మాత్రం ఈ వెరైటీ మిరపను సాగు చేస్తున్నాడు. దీని దిగుబడి, ధర ఆశాజనకంగా ఉందని ఆయన చెబుతున్నాడు.
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన రైతు కొండపల్లి నరేష్ ఓ రోజు యూట్యూబ్‌లో సాధారణ మిర్చి సాగుకు సంబంధించిన వీడియోలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకచోట పసుపు రంగులో ఉన్న మిర్చి అతని దృష్టిని ఆకర్షించింది. ఒకింత లోతుగా పరిశీలించే సరికి కొన్నిచోట్ల ఈ పసుపు రంగు మిరప పంటను సాగు చేస్తున్నట్లు తెలిసింది.
దీంతో వివరాలు ఆరా తీశాడు. వరంగల్, గుంటూరు వ్యాపారులు ఈ రకం మిర్చిని కొనుగోలు చేస్తారని తెలిసింది. గతేడాది క్వింటాల్‌కు రూ.65 వేల వరకు ధర పలికిందని కూడా తెలుసుకున్నాడు. దీంతో వరంగల్ వ్యాపారులను సంప్రదించాడు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టడమే కాకుండా వారి వద్దే ఎల్లో మిర్చి విత్తనాలు కొనుగోలు చేశాడు.
తన ఎకరం పది కుంటల భూమిలో పంట వేశాడు. సాధారణ మిర్చి పంటలాగే సాగు పద్ధతులు అవలంబించగా రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చు అయింది. తాజాగా తొలి తీతలో ఐదు క్వింటాళ్ల దిగుబడి రాగా ఇంకా ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడికి అవకాశముందని నరేష్ చెబుతున్నాడు. ఈ రకం మిర్చికి తెగుళ్ల బెడద తక్కువేనని.. సాధారణ మిర్చితో పోలిస్తే 50 శాతం తక్కువ వైరస్‌లు సోకుతాయని చెప్పాడు. నల్లి ప్రభావం తక్కువగా ఉండగా, తెల్లదోమ మాత్రం కాస్త సోకిందని తెలిపాడు.
మందులు, రంగులు, చిప్స్‌లో..
పసుపు రంగు మిర్చి సాగు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.65 వేల ధర పలకగా ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్యే ఉంది. ధర పెరిగేవరకు ఆగుదామని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశా. ఈ మిర్చిని మందులు, రంగుల తయారీతో పాటు బ్రాండెడ్ కంపెనీల చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు.
– కొండపల్లి నరేష్, రైతు
ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది
ఖమ్మం జిల్లాలో పసుపు రంగు మిర్చి సాగు ఇటీవలే మా దృష్టికి వచ్చింది. మార్కెట్‌లో ఈ రంగు మిర్చికి డిమాండ్ ఉంది. ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. రైతులు పంట మార్చిడి చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పంట సాగుపై వివరాలు సేకరిస్తున్నాం.
– పి.అపర్ణ, వైరా నియోజకవర్గ ఉద్యానవన అధికారి
Comments
Please login to add a commentAdd a comment