కలుపును, తెగుళ్లను జయించిన రైతు! | farmer won the Weeds, pests | Sakshi

కలుపును, తెగుళ్లను జయించిన రైతు!

Published Tue, Apr 4 2017 4:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

కలుపును, తెగుళ్లను జయించిన రైతు! - Sakshi

కలుపును, తెగుళ్లను జయించిన రైతు!

- లోతైన అవగాహనతో ప్రకృతి సేద్యం.. చీడపీడలు, తెగుళ్ల ఊసే లేదు.
- కలుపు నిర్మూలించకుండా.. ఖర్చు లేకుండా భేషుగ్గా మినుము సాగు
- ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి


జీవావరణ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకునే ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ.. కలుపును, తెగుళ్లను సునాయాసంగా జయిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న విలక్షణ ఆదర్శ రైతు తిలక్‌. చిన్న ప్రాణికి  కూడా హాని తలపెట్టకుండా.. రూపాయి ఖర్చు లేకుండా.. పంటలు పండిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధిక దిగుబడులు సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేనా.. పల్లెల్లోనూ అంతరించిపోతున్న అనేక జీవ జాతులకు తన వ్యవసాయ క్షేత్రాన్ని చిరునామాగా మార్చారు.

మనుషులకు మాత్రమే కాదు ఈ భూమ్మీద ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉందని విశ్వసిస్తారు ప్రకృతి వ్యవసాయదారు నల్లమోతు వెంకట లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఆయన స్వగ్రామం. వివిధ రకాల జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు.. ఎన్నో రకాల ప్రాణుల సహజీవనంతోనే, జీవవైవిధ్యంతోనే వ్యవసాయానికి మనుగడ అనే ఆయన బలమైన నమ్మకం వమ్ముకాలేదు. 30 ఎకరాల మాగాణిలో ఈ ఏడాది రబీలో మినుమును సాగు చేశారు.  సస్యరక్షణ, యాజమాన్య పద్ధతుల్లో కొత్త పంథాను అనుసరించి గడ్డు పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధించారు. ఒకవైపు చీడపీడలు, తెగుళ్లతో జిల్లా వ్యాప్తంగా మినుము పంట తుడిచిపెట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లోనూ తిలక్‌ మంచి దిగుబడులు సాధించటం విశేషం.

పంటలను కలిపి సాగుచేస్తేనే కలిమి..
‘మోనోకల్చర్‌ (పొలంలో మొత్తంలో ఒకే ఒక పంటను సాగు చేసే) పద్ధతి వల్లే జీవవైవిధ్యం నశించిందని అవగాహన చేసుకున్న తిలక్‌ మిశ్రమ పంటల సాగును చేపట్టారు. ఒక్క పంటకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఇతర పంటలకు కలుపు మొక్కలకు స్థానం లేకుండా చే యటం వల్ల జీవ వైవిధ్యం నశించింది. అనేక జాతులకు చెందిన ప్రాణులు, మొక్కలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది’ అంటారు తిలక్‌. అందుకే తిలక్‌ మినుము, జొన్న, సజ్జ, జనుము పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేశారు. వరి కోతలు పూర్తయ్యాక పదునులో ఎల్‌బీజీ మినుము రకాన్ని ఎకరాకు 13 కిలోల చల్లుకున్నారు. పంటతో పాటే పెరిగి పెద్దవయినా కలుపు మొక్కలను నిర్మూలించే ప్రయత్నం చేయలేదు.

‘రసాయన ఎరువులు వాడి భూమిలోని సూక్ష్మజీవులను, క్రిమి సంహారకాలను పిచికారీ చేసి పురుగులను చంపటం, కలుపు మందులు వాడి రకరకాల మొక్కలను నిర్మూలించటం వల్ల ప్రాణికోటికి తీరని నష్టం జరుగుతోంది. జీవావరణ వ్యవసాయంలో పంట మొక్కలు, కలుపు మొక్కలు, జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తాయి. పరస్పరం సహాయం చేసుకుంటాయి. అన్ని రకాల జీవులకు ఆశ్రయం ఉంటుంది. వీటివల్ల పంటలకు ఎలాంటి నష్టం లేకున్నా పనిగట్టుకొని నిర్మూలించాల్సిన అవసరం లేదు. ప్రకృతే వాటిని సహజ పద్ధతుల్లో అదుపు చేస్తుంది’ అంటారు తిలక్‌.

అందుకే మినుము సాగులో ఆయన ప్రకృతి సేద్య  పద్ధతులకు పెద్ద పీట వేశారు. దీనికి నిదర్శనమా అన్నట్టు వ్యవసాయ క్షేత్రం చుట్టూ అనేక పక్షి జాతులు ఆశ్రయం ఏర్పరుచుకున్నాయి. నాలుగు రకాల పంటలను కలిపి సాగు చేయటం వల్ల మిత్ర పురుగులు పొలంలోకి వచ్చాయి. పంటలకు హాని చేసే చీడపురుగులను అదుపు చేశాయి. పొలం గట్ల వెంబడి జనుమును కంచెపంటగా సాగు చేశారు. జనుము మొక్కల నుంచి వచ్చే వాసనకు  మినుమును ఆశించి నష్టపరిచే పురుగులు దూరంగా పోతాయి. జనుము పైరు పసుపు రంగులో ఉండటం వల్ల మిత్ర పురుగులను ఆకర్షించింది. ఇవి చీడపీడలను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు జనుము మొక్కల వేర్లు భూమిలో విడుదల చే సే ద్రవాలు ప్రధాన పంటకు పోషకాలను అందిస్తాయి.

కలుపు మొక్కలతో సహజంగా తెగుళ్ల నివారణ
‘పంటలకు సోకే తెగుళ్లకు కొన్ని రకాల శిలీంధ్రాలు కారణం. అయితే భూమిలో నివసించేlకొన్ని రకాల శిలీంధ్రాలు వీటిని అదుపు చేస్తాయి. వీటిలో పంట మొక్కలకు మంచి చేసేవీ ఉంటాయి. రసాయన శిలీంధ్ర నాశనుల పిచికారీ వల్ల మంచి చేసే శిలీంధ్రాలు మరణిస్తున్నాయి. దీనివల్ల తెగుళ్ల వ్యాప్తి విపరీతంగా పెరిగి ఏం చేయాలో అర్థం కాక  రైతులు, శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు’ అంటారు తిలక్‌. కృష్ణా తదితర కోస్తా జిల్లాల్లో ఈ సీజన్‌లో సాగు చేసిన మినుములో పల్లాకు, తలమాడు, మొవ్వకుళ్లు వంటి పలు రకరకాల వైరస్‌ తెగుళ్లు విజృంభించాయి. వీటి నివారణకు రకరకాల ఖరీదైన రసాయనిక పురుగు మందులను పిచికారీ చేసినా ఫలితం లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తిలక్‌ మాత్రం ఎలాంటి మందులు, కషాయాలు పిచికారీ చే యలేదు. పదునులో విత్తనాలు చల్లుకున్నారు. 75 రోజులకు పంట చేతికొచ్చేదాక ఎలాంటి తడి ఇవ్వలేదు. మధ్యలో వర్షం పడలేదు అయినా మంచి దిగుబడులు చేతికిరావటం విశేషం. ఒక్కో మొక్కకు 20–25 కాయలు కాశాయి. బంగారు తీగ, తలతిప్ప కాయ, టపాకాయల చెట్టు వంటి కలుపు మొక్కలు అధికసంఖ్యలో ఉన్నా వాటిని కూడా అధికమించి మినుము పైరు బాగా పెరిగింది. కలుపు మందులు వాడకపోవటం, కలుపును నిర్మూలించే ప్రయత్నం చేయకపోవటం వల్లనే మినుము పంటను ఎలాంటి తెగుళ్లు ఆశించలేదని తిలక్‌ చెప్పారు.  

మినుములు ఎకరాకు 4 క్వింటాళ్లు, సజ్జలు 40 కిలోలు, ఉలవలు 30 కిలోలు దిగుబడి వచ్చింది. జనుమును పశువుల మేతగా వాడుతున్నారు. రసాయన సేద్యంలో ఎరువులు, కలుపు మందులు, పురుగుమందులు పిచికారీకి ఖర్చు ఎక్కువవుతోంది. దిగుబడి ఎక్కువగా వచ్చినా ఫలితం రైతుకు దక్కటం లేదు. దీంతో రైతు ఎంత కష్టం చేసినా లాభం కళ్లజూడలేకపోతున్నాడు. గతేడాది సాగు చేసిన పంట నుంచే విత్తనాన్ని తయారు చేసుకున్నాడు. పంటను అమ్మితే వచ్చిన ఆదాయం మొత్తం రైతుకే మిగులుతుంది.

గతేడాది ఖరీఫ్‌ వరిసాగులోనూ తిలక్‌ మంచి దిగుబడులు సా«ధిస్తున్నారు. ఎంటీయూ 1061రకం వరిని సాగు చేశారు. కలుపును నిరోధించేందుకు పంట వ్యర్థాలతో వేసవిలో ఆచ్ఛాదన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని ఆచరించటంతో ఆకుముడత, దోమ, పొడ తెగులు వరిని ఆశించలేదు. వర్షాభావం, నీటి ఆలస్యం విడుదల కారణంగా 50రోజుల పాటు ఏర్పడిన బెట్టను కూడా వరిపైరు తట్టుకొంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎకరానికి 35 బస్తాల దిగుబడి సాధించటం విశేషం. నారు మడి పెంపకం, నాట్లు వేయటం, కలుపు తీత, కోత, నూర్పిడి వంటి పనులకు మాత్రమే ఖర్చయింది. తొలకరిలో జీలుగును సాగు చేస్తారు. పొలంలో తిరిగే పాములను చంపరు. ఆదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణకు జీవవైవిధ్య వ్యవసాయమే సరైన మార్గమని.. మిశ్రమ పంటల సాగుతోనే రైతుకు కలిమి బలిమి అని నిరూపిస్తున్నారు బాలగంగాధర్‌ తిలక్‌.
– అయికా రాంబాబు, సాక్షి,గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా

కలుపును అదుపు చేస్తే చాలు..!
రసాయన సేద్యం సకల జీవులను కకావికలు చేసింది. ఎన్నో ప్రాణులు అంతరించిపోవటానికి పరోక్షంగా కారణమయింది. రసాయనిక ఎరువులు, కలుపు మందులు, పురుగు మందుల వాడకంతో భూసారం క్షీణిస్తోంది. మనుషులకు కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. కలుపును దుంపనాశనం చేస్తేనే పంటలు పండుతాయనే భ్రమలను రైతులు వీడాలి. కలుపును నాశనం చేయాల్సిన అవసరం లేదు. మిశ్రమ పంటలు, అంతర పంటలు, కంచె పంటల సాగుతో కలుపును అదుపులో ఉంచితే చాలు. ఖర్చు ఉండదు, పర్యావరణానికి హాని ఉండదు. పంట దిగుబడులకు కూడా ఢోకా ఉండదు.
– నల్లమోతుల బాలగంగాధర్‌ తిలక్‌ (99498 28578),సీనియర్‌ ప్రకృతి వ్యవసాయదారుడు,కౌతవరం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement