మిత్రపురుగులే ఈ రైతన్న సైన్యం! | 8-acre garden of mango per year. 8 lakh income | Sakshi
Sakshi News home page

మిత్రపురుగులే ఈ రైతన్న సైన్యం!

Published Mon, Sep 28 2015 11:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

మిత్రపురుగులే ఈ రైతన్న సైన్యం! - Sakshi

మిత్రపురుగులే ఈ రైతన్న సైన్యం!

♦ మిత్రపురుగులను పెంచి.. తోటల్లో వదలడం ద్వారా చీడపీడల నియంత్రణ
♦ రెండేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగు మందుల్లేని సేద్యం..
♦ 8 ఎకరాల మామిడి తోటలో ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం
♦ సంప్రదాయ సాగుబాటలో విశ్రాంత మండల విద్యాధికారి అశోక్ కుమార్
 
  బడిలో పాఠాలు నేర్పిన చేతులు ఇప్పుడు సాగుబడిలో నాగలి పట్టాయి.  సాగు చే యాలన్న తపనతో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన అశోక్ కుమార్ ఎనిమిదెకరాల పొలం కొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత మామిడి మొక్కలు నాటారు. మొదట్లో అందరిలాగే రసాయనిక పద్ధతుల్లోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా అధిక ఖర్చు.. అయినా వీడని చీడపీడల బెడద.. అరకొర దిగుబడి! ఏం చేయాలో పాలుపోని అటువంటి పరిస్థితుల్లో హైద్రాబాద్‌లోని  జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం) ఆయనకు అండగా నిలిచింది. వ్యవసాయ విద్యార్థిగా మారి రసాయనిక ఎరువులు, పురుగు మందుల్లేకుండా సేద్యం చేసే పద్ధతులు నేర్చుకున్నారు. సొంతంగా జీవన ఎరువులను తయారు చేసుకొని వాడుతూ, మిత్రపురుగుల్ని స్వయంగా పెంచి, తోటలోకి వదలడం ప్రారంభించారు.
 తద్వారా తక్కువ ఖర్చుతో లాభదాయకంగా పంటలు పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.   

 
 కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన కొక్కు అశోక్ కుమార్ 39 ఏళ్లపాటు విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా, మండల విద్యా శాఖాధికారిగా పనిచేశారు. విశ్రాంత జీవన కాలంలో వ్యవసాయం చేయాలన్న తపనతో ఉద్యోగ విరమణకు ముందే మల్యాల మండలం ఓబులాపూర్ వద్ద ఎనిమిదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి అంతా రాళ్లు, రప్పలు, పొదలతో నిండి ఉండేది. ఉద్యోగ విరమణ చేశాక ఆ భూమిని చదును చేయించి మామిడి మొక్కలు నాటారు. అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల్ని వినియోగించారు. మామిడి వేర్లు తేలేటట్టు ట్రాక్టర్‌తో ఐదు నుంచి ఆరుసార్లు దున్నించేవారు.

ఈ పద్ధతుల్లో సాగుచేయడంతో మామిడి తోటకు కొమ్మ తొలిచే పురుగు, ఆకుమచ్చ వంటి రకరకాల చీడపీడలు తోటను తీవ్రంగా నష్టపరిచాయి. దీంతో, అశోక్ కుమార్ తన తోటలోని మామిడాకులను తీసుకొని జగిత్యాలలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి వెళ్లారు. అక్కడి అధికారులు హైదరాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్.ఐ.పి.హెచ్.ఎం.)కు తీసుకెళ్లి చూపించమని సూచించారు. దీంతో ఆ మామిడాకుల్ని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.కు తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు.

వ్యవసాయంలో సాధారణంగా రైతులు చేస్తున్న తప్పిదాలేమిటి? తక్కువ ఖర్చుతో చక్కని పంట దిగుబడుల కోసం ఏమేమి చేయాలన్న అంశాలను వివరించారు. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి? ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది? పంటలకు హాని చేసే పురుగులు ఎలా మొండిగా తయారవుతున్నాయి? పంటకు లాభం చేసే మిత్రపురుగులు పురుగుమందుల వల్ల ఏవిధంగా నశిస్తున్నాయి? వంటి విషయాలతో పాటు, జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి... వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.

శిక్షణ అనంతరం ఎన్.ఐ.పి.హెచ్.ఎం.కు చెందిన శాస్త్రవేత్తలు అశోక్ కుమార్‌కు  రెడ్ విడ్‌బగ్స్, బ్రేకాన్స్.. వంటి ఒక్కో జత మిత్ర పురుగుల్ని ఉచితంగా అందించారు. అప్పట్నుంచీ ఈ మిత్ర పురుగులను ఆయన లార్వా దశ నుండి ఎగిరేంత వరకు ఇంటి దగ్గరే పెంచుతున్నారు. బియ్యంలో ఉండే కొక్కు పురుగులు, కుళ్లిన పండ్లు, కూరగాయల్లో ఉండే పురుగులను మిత్రపురుగులకు ఆహారంగా వేస్తున్నారు.  మిత్రపురుగులు కొద్ది రోజుల్లోనే వందలాది గుడ్లు పెడుతుంటాయి. ఇలా.. ఏడాదిలోనే కోటానుకోట్ల మిత్రపురుగులను సంతానోత్పత్తి ద్వారా వృద్ధి చేస్తుంటాయి. భూమి పైన పెరిగే మిత్ర పురుగులు నశించకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏడాదికి ఒకసారి మాత్రమే తోటను దున్నుతున్నారు. మిత్రపురుగుల కోసం తోట చుట్టూ బంతి మొక్కలు, రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు.

 భూసారం పెంపు కోసం...
 భూసారం పెంపు కోసం సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. పెసర, కంది, మినుములు, ఉలవలు, జనుము, జీలుగ విత్తనాల్ని వర్షాలు కురియగానే తోటలో చల్లుతారు. అవి మొలకెత్తి, ఎండిపోయేంత వరకు అలాగే వదిలేస్తారు. భూమి పైన సజీవ ఆచ్ఛాదన (లైవ్ మల్చింగ్)గా కూడా ఈ ద్విదళ మొక్కలు పనిచేస్తాయి. ప్రకృతిసిద్ధంగానే నత్రజని తదితర పోషకాలను అందించడంలో సజీవ ఆచ్ఛాదన ఉపయోగపడుతోంది. ఈ విధంగా అశోక్‌కుమార్ తన తోటలో రసాయనిక ఎరువులు, పురుగుల మందులపై పెట్టే ఖర్చును ఏటా రూ.2 లక్షల వరకు ఆదా చేస్తున్నారు.

 వర్మీ కంపోస్టు, వర్మీ వాష్..
 మామిడి చెట్లకు వర్మీ కంపోస్టు వేయడంతోపాటు వర్మీ వాష్‌ను పిచికారీ చేస్తారు. పశువుల పేడతో వర్మీ కంపోస్టు తయారు చేసి మొక్కలకు వేస్తున్నారు. ఇందుకోసం దేశవాళీ ఆవును కూడా కొనుగోలు చేశారు. 15 రోజులకోసారి జీవామృతం వాడుతున్నారు. జీవామృతం తయారీలో బెల్లానికి బదులు రాలిన మామిడి కాయలను వాడుతున్నారు. గత రెండేళ్లుగా ప్రకృతికి అనుగుణమైన సేద్య పద్ధ్దతులు పాటించడంతో మామిడి దిగుబడులు పెరిగాయని ఆయన తెలిపారు.

గత ఏడాది రూ. 4 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ. 10 లక్షల వరకు రావచ్చని అశోక్ కుమార్ (98661 92761) అంచనా వేస్తున్నారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో జరిగే రైతులు, శాస్త్రవేత్తల శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని అశోక్ కుమార్ తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఆయన మామిడి తోటను పరిశీలించేందుకు రైతులతోపాటు శాస్త్రవేత్తలు కూడా వస్తుంటారు. తన దగ్గరకు వచ్చే వారందరికీ వివరాల్ని ఓపిగ్గా చెబుతుంటారు. మిత్ర పురుగులను, జీవన ఎరువులను తయారీకి అవసరమైన బ్యాక్టీరియాను వారికి అందిస్తుంటారు.  
 - పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
 
 రైతుల బృందాలకు ఎన్‌ఐపీహెచ్‌ఎంలో ఉచిత శిక్షణ
 రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా.. జీవన ఎరువులు, మిత్రపురుగుల తోడ్పాటుతో.. స్వల్ప ఖర్చుతో.. ప్రకృతికి అనుగుణమైన సేద్యం చేయాలనుకునే రైతులకు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. 3 రోజుల పాటు ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలను తెలుగులో నిర్వహిస్తుంటుంది. 30-40 మంది రైతులు బృందంగా ఏర్పడి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఎన్.ఐ.పి.హెచ్.ఎం. శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement