కిచెన్ గార్డెన్ | leafs are the kitchen garden | Sakshi
Sakshi News home page

కిచెన్ గార్డెన్

Published Tue, Jan 28 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

కిచెన్ గార్డెన్

కిచెన్ గార్డెన్

 ఇంటిపంట
 రసాయన ఎరువులతో పండించే కాయగూరలు తింటూ మనం ఎదుర్కొంటున్న ఆరోగ్యసమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ఆకుకూరలైన సేంద్రీయ ఎరువులతో పండించుకుని తినే భాగ్యం మనకు లేదా? అని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారికి కిచెన్‌గార్డెనింగ్ చాలా సాయపడుతుంది. ఓ నాలుగు మట్టి కుండీలు, ఆకుకూరల విత్తనాలు చేతిలో ఉంటే ఎంచక్కా మీరే స్వయంగా సేంద్రీయ పంటలు పండించుకోవచ్చు.
 
 ఆకుకూరలతో ఆరంభం...
 ఒకటి లేదా రెండు కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. వెడల్పు ఎక్కువ, ఎత్తు తక్కువ ఉండే కుండీలు/ట్రేలు/మడులలో  ఆకుకూరలు ఎంచక్కా సాగు చేయొచ్చు. మొదట.. ఎర్రమట్టి, చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి. కొబ్బరి పొట్టు, వేపపిండి కొంచెం కలిపితే మంచిది. కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి(ఈ బెజ్జం పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం). ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి.
 
 ఏ కాలమైనా...
 విత్తనాలు లేవా? పర్లేదు. పోపు డబ్బాలో మెంతులు ఉన్నాయి కదా? మెంతి కూర ఎంత ఆరోగ్యమో మీకు తెలుసు కదా! గుప్పెడు మెంతులు తీసుకొని కుండీలో చల్లండి. వాటిపైన పల్చగా మట్టి వేసి.. నెమ్మదిగా నీటిని చిలకరించండి. మొక్కలు మొలిచే వరకూ తడి  ఆరకుండా చూడండి. మొలకలొచ్చే వరకు పైన ఎండు ఆకులు కప్పితే మరీ మంచిది.  కుండీలో/ట్రేలో మట్టి ఏకాలంలోనైనా తడీపొడిగా ఉండాలి. నీరు నిలవ కూడదు.. అంతే! వారం/పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర పచ్చగా పలకరిస్తుంది! మెంతికూర ఒక్కటేనా? పాలకూర, చుక్కకూర.. ఒకటేమిటి ఆకుకూరలేవైనా.. ఏ కాలంలోనైనా సాగు చేయొచ్చు. అలాగే కొత్తిమీర పెంచుకోవాలంటే కూడా ఇదే పద్ధతిని అనుసరించాల్సిందే. అయితే ధనియాలను యథాతథంగా చల్లకూడదు. బాగా పలుకులుగా నలిచి ఆ తర్వాత చల్లాలి. చేత్తో నలిపితే ధనియంలోని గింజ బయటకు రాదు, ధనియాలను నేల మీద వేసి గట్టి అట్టముక్కతో నలపాలి.
 - పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement