సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కంపెనీల లాబీయింగ్ కారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా మనిషికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2017 నుంచి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని చెప్పారు.
గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుడు గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2017–18 నుంచి 2019–20 వరకు రాష్ట్రంలో 29,200 ఎకరాల విస్తీర్ణం కలిగిన 584 క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2021–22 సంవత్సరానికి గాను జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 750 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రతిపాదించామన్నారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు బడ్జెట్‌లో రూ. 7,201.57 కోట్లు కేటాయించగా, రూ. 2,598.19 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన, శిక్షణ కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.
సవరించిన పేస్కేళ్ల అమలు: మంత్రి సబిత
యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా ఆగినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జనవరి 2016 నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి సవరించిన యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం 2019లోనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 3,350 మంది సిబ్బందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా వారికి ఇచ్చేందుకు సర్కార్‌ను గ్రాంట్ అడిగినట్లు వివరించారు.
అంతకుముందు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి 3,000 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి జీవో ఇచ్చినప్పటికీ అమలు కాలేదని వివరించారు. కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చి ఏడాదైనా అమలు కాలేదని, కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి 10 శాతం పన్నును ఆదాయపన్ను శాఖ వసూలు చేయడాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు అకాడమీ స్కాంలో నిధుల రికవరీ చేయాలి: ఎంఎస్ ప్రభాకర్
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను తస్కరించిన స్కాంలో నిందితులను అరెస్టు చేయడమే కాకుండా నిధులను రికవరీ చేయాలని సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ కోరారు. అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. అందుకు మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ నిందితుల నుంచి నిధులను రికవరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
గిరిజన తెగలకు...
ఆదిలాబాద్‌లో గిరిజన తెగల్లో ఒకటైన మన్నెవర్లను కొలవర్లుగా మార్చారని, అయితే మన్నెవర్లుగా ఉన్నప్పుడు వారికి లభించిన లబ్ధి ఇప్పుడు అందడం లేదని సభ్యుడు పురాణం సతీష్ సభ దృష్టికి తెచ్చారు. 55 వేల మంది మన్నెవర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సైనిక సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టి.జీవన్‌రెడ్డి కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, దసరా సెలవుల్లో బడులను సంస్కరించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment