నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్‌ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి.
వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్‌ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది.
అధిక భాస్వరంతో నష్టం
అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది.
సమతూల్యత ఏది?
ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి.
సేంద్రియ ఎరువులు తప్పని సరి
రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది.
అవగాహన కల్పిస్తున్నాం
ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం.
– ప్రసన్నలక్ష్మి, ఏఓ
Comments
Please login to add a commentAdd a comment