Crop yield
-
ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
మిరుదొడ్డి (దుబ్బాక)/ రామగిరి (మంథని): ఏడు బోర్లు వేసినా నీరందక పంట ఎండిపోవడంతో మనోవేదనతో ఓ రైతు, ఆరుగాలం కష్టపడ్డా నీటి కొరతతో పత్తి పంటకు దిగుబడి రాలేదన్న బాధతో మరో రైతు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్‌కు (48) వ్యవసాయమే జీవనాధారం. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులా బాద్ శివారులో నాలుగు ఎకరాల భూమిని కొనుగో లు చేసి వరి పంట వేశారు. భూగర్భ జలాలు వట్టిపోవడం.. మండుతున్న ఎండలతో రెండు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో సుమారు రూ.6 లక్షల వరకు అప్పు చేసి 7 బోరు బావులు తవ్వంచాడు. అందులో ఒకటి రెండు బోరు బావుల నుంచి సన్నటి నీటి ధార మాత్రం వస్తోంది. పొట్ట దశకు వచ్చిన రెండు ఎకరాలకు సాగు నీరు అందక ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ శనివారం సాయంత్రం పొలం వద్దే పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరోఘటనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) రెండేళ్లక్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకోసం కొంత అప్పు తీసుకొచ్చాడు. తనకున్న 8 ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం బ్యాంకులో మరికొంత లోన్ తీసుకున్నాడు. అప్పు రూ.35 లక్షల వరకు చేరింది. పత్తి పంట అధిక దిగుబడి వస్తే మొత్తం అప్పు తీర్చవచ్చని భావించాడు. కానీ, తెగుళ్లు, నీటి కొరతతో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఈనెల 3న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
వేలేరు/తలమడుగు: రాష్ట్రంలో ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నీరు తడి లేక పంట ఎడిపోయి ఒకరు.. పంట దిగుబడి సరిగా రాక అప్పుల్లో కూరుకుపోయి తీర్చే దారిలేక మరొక రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన ఈ రైతుల ఆత్మహత్య లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్(43)కు మూడెకరాల వ్యవ సాయ భూమి ఉంది. కొంతభాగం మొక్కజొన్న సాగుచేశాడు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో అప్పులు చేసి బావిలో సైడ్ బోర్లు వేయించాడు. అయినా నీరు పడకపోవడంతో పంట చేతికందే సమయంలో ఎండిపోయింది. బోర్లు వేసేందుకు, పంట పెట్టుబడికి, రెండేళ్ల క్రితం కూతురు పెళ్లికి తెచ్చిన అప్పు మిత్తి కలిపి రూ.12లక్షల వరకు ఉంది. ఇటు పంట ఎండిపోవడం, అటు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం చేలోకి వెళ్లిన సుధాకర్ ఎండిన పంటలను చూసి తీవ్ర మనోవేదనతో పురుగుల మందుతాగాడు. చుట్టు పక్కల రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. అప్పటికే సుధాకర్ మృతి చెందాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. పొలానికి వెళ్లొస్తానని చెప్పి... ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశన్న (43)కు రెండెకరాల 19 గుంటలతో పాటు తన భార్య సుచరిత పేరిట మూడెకరాల 30 గుంటల పొలం ఉంది. మొత్తం ఆరెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సీజన్లో అందులో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. పత్తి పెట్టుబడి కోసం ఆదిలాబాద్‌లోని ఎస్బీఐలో భార్యాభర్తల ఇద్దరు పేరుమీద రూ.4లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి మరో రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు సంతానం. కుమార్తె డిగ్రీ, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇటీవలే కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన ఆశన్న మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని చెప్పి ఇంటినుంచి బయల్దేరాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా...వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆశన్న మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అధిక ఎరువులు వాడితే అనర్థమే
నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్‌ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్‌ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది. అధిక భాస్వరంతో నష్టం అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. సమతూల్యత ఏది? ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులు తప్పని సరి రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. అవగాహన కల్పిస్తున్నాం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసన్నలక్ష్మి, ఏఓ -
దిగుబడి తగ్గినా.. విత్తన కంపెనీదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : పంట దిగుబడి తక్కువైనా విత్తన కంపెనీలే బాధ్యత వహించడంతోపాటు రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కీలక ప్రతిపాదన చేసింది. కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు–2019పై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ప్రైవేటు కంపెనీలు విత్తనాల సామర్థ్యంపై చేస్తున్న అధిక ప్రచారం వల్ల రైతులు వాటిని కొనుగోలు చేసి పంటలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని సర్కారు పేర్కొంది. తీరా పంట దిగుబడి తక్కువయ్యే సరికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయశాఖ ఆ సమావేశంలో ప్రస్తావించింది. అందువల్ల నిర్ధారించిన మేరకు పంట దిగుబడి రాకపోతే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్రం కోరింది. దీనివల్ల కంపెనీల ఇష్టారాజ్య ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. మరోవైపు విత్తనం ద్వారా పంట నష్టం జరిగితే పరిహారాన్ని వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం ఆయా కోర్టుల్లో నిర్ధారించాలని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారని, దీనివల్ల పరిహారం ఆలస్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. దానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే వ్యవసాయ నిపుణుల కమిటీలు నష్ట పరిహారాన్ని నిర్ధారించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. నకిలీ విత్తన దందా అడ్డుకట్టకు అనుమతి అక్కర్లేదు... నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలపై దాడులు చేయడం, ఆయా విత్తనాలను స్వాధీనం చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని కేంద్ర విత్తన ముసాయిదాలో ప్రస్తావించడాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ తప్పుబట్టింది. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతిని అప్పటికప్పుడు తీసుకోవడం కష్టమని, దీనివల్ల నకిలీ విత్తన విక్రయదారులు తప్పించుకునే ప్రమాదముందని అభిప్రాయపడింది. అందువల్ల ప్రత్యేకంగా అనుమతి అవసరంలేదని సూచించింది. ముసాయిదాపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పలు బడా కంపెనీలు కంపెనీకి, ప్రతి విత్తన వెరైటీకి ప్రతి రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధనను ఎత్తేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించొద్దని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వెరైటీ విత్తనాలు అన్ని రాష్ట్రాల వాతావరణానికి తగ్గట్లుగా ఉండవని, అన్నిచోట్లా పండవని, కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రాన్ని కోరింది. ధరల నియంత్రణపై అస్పష్టత విత్తన ధరల నియంత్రణపై ముసాయిదా బిల్లులో అస్పష్టత నెలకొంది. అవసరమైతే విత్తన ధరలను నియంత్రిస్తామని మాత్రమే ముసాయిదాలో ఉంది. దీనివల్ల ధరల నియంత్రణ సక్రమంగా జరిగే అవకాశం ఉండదు. విత్తన ధరలపై స్పష్టమైన నియంత్రణ లేకపోతే కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచే అవకాశముంది. దీనిపై ముసాయిదాలో మార్పులు చేయాలని కోరుతాం. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ఇకపై అన్ని విత్తనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి... ఇకపై అన్ని రకాల విత్తనాలు, వెరైటీలకు రిజిస్ట్రేషన్ తప్పనసరి చేయడాన్ని ముసాయిదా బిల్లులో ప్రస్తావించడం మంచి పరిణామమని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాల రిజిస్ట్రేషన్ జరగట్లేదని, కొత్త నిబంధన వల్ల ఇది తప్పనసరి అవుతుందని పేర్కొంది. ఖరీఫ్‌లో అన్ని పంటల కంటే పత్తి, మొక్కజొన్నను తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారని, అవన్నీ ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాలేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయా ప్రైవేటు విత్తనాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం వల్ల కంపెనీలకు బాధ్యత ఏర్పడుతుందని అంటున్నారు. మామిడి, మిరప, టమాట తదితర అన్ని రకాల నర్సరీలు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ముసాయిదాలో పేర్కొన్నారని వ్యవసాయశాఖ తెలిపింది. -
ఈ సారి భారీ దిగుబడి
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. కాస్త ముందుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం వచ్చేనెల 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించాలన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నిజామా బాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈసారి ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం మార్కెట్లో కి వస్తుందని అధికార యంత్రాంగం అం చనా వేసింది. సుమారు ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కే్రందాలకు రావచ్చంటున్నారు. గతే డాది కంటే రెం డున్నర రేట్లు అధికంగా ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ప్రైవేటు కొనుగోళ్లు తక్కువే.. ఈసారి కనీస మద్దతు ధర పెరగడంతో రైతులు ప్రైవేటులో విక్రయించే బదులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ఎక్కువ గా ధాన్యం తీసుకువస్తారని భావిస్తు న్నా రు. గ్రేడ్–ఎ రకం ధాన్యానికి కనీస మద్ద తు ధర గత ఏడాది కంటే క్వింటాలుపై సుమారు రూ.180 పెరిగింది. కామన్ రకానికి కూడా క్వింటాలుకు రూ.200 పెం చారు. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,770 పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఎన్నికల ఏడాది కావడం.. పైగా రైతులకు సంబంధించిన అంశం కావడంతో అధికా ర యంత్రాంగం ఈసారి కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రతిపక్ష పార్టీలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముంద స్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. రైతుల నుంచి పెద్ద ఎ త్తున డిమాండ్ వస్తుండటంతో ఈ కేం ద్రాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ముందస్తుగా ధాన్యం.. ఏటా నవంబర్ మాసంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే ఈసా రి కాస్త ముందస్తుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. బోధన్, వర్ని తదితర ప్రాంతాల్లో రైతులు ముందుగా వరినాట్లు వేసుకున్నారు. దీంతో ఇక్కడ ముందుగానే వరి కోతకొచ్చే అవకాశాలున్నాయి. అక్టోబర్ రెండో వారం నుంచే ధాన్యం మార్కెట్లోకి రానుందని, ఈ మేరకు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించారు. మంత్రి పోచారం సమీక్ష ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం అక్టోబర్ 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని, ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తా మని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, అనుమతి వచ్చిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎంఆర్ఎం రావు, సత్యనారాయణ, మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
జింక్ సబ్సిడీ.. అధికారుల దోపిడీ!
- వ్యవసాయ శాఖలో సూక్ష్మపోషక ఎరువులు పక్కదారి - రైతులకు సబ్సిడీతో ఇవ్వకుండా డీలర్ల ద్వారా విక్రయం సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీపై అందించాల్సిన జింక్ సల్ఫేట్‌ను రాష్ట్రంలో అనేక చోట్ల కొందరు వ్యవసాయాధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు విక్రయించాల్సింది పోయి ప్రైవేటు డీలర్లకు కొందరు వ్యవసాయాధికారులు (ఏవో)కట్టబెడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులు పూర్తి ధరకు ప్రైవేటు డీలర్ల వద్ద జింక్‌ను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్క్‌ఫెడ్ లోని కొందరు జిల్లాస్థాయి అధికారులు కూడా ఏవోలకు సహకరిస్తున్నట్లు సమాచారం. 70 శాతం భూముల్లో జింక్ లోపం రాష్ట్రంలో 70% పైగా పంట భూముల్లో జింక్ లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జింక్ లోపముంటే మొక్క ఎదగదు. పూత, కాత పడిపోతుంది. పంట దిగుబడి గణనీయం గా తగ్గిపోతుంది. భూసార పరీక్షల ఆధారంగా ఏ భూమిలో ఎంత జింక్ లోపముందో గుర్తి స్తారు. లోపమున్న భూముల్లో జింక్ సల్ఫేట్‌ను ప్రతీ మూడు పంటలకోసారి వేయాలి. 2,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు జింక్ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏటా జింక్ సల్ఫేట్‌ను సరఫరా చేసే బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. జింక్ లోపాన్ని గుర్తించాక జిల్లా వ్యవసాయ శాఖల నుంచి ఇండెంట్ ఆధారంగా ప్రభుత్వం జింక్ సల్ఫేట్‌ను సరఫరా చేస్తుంది. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.36,400 ధరకు పలు కంపెనీల నుంచి 2,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. వరి రైతుకు సబ్సిడీ పోను కిలో రూ.24, పప్పుధాన్యాలు వేసే రైతుకు సబ్సిడీ పోను కిలోకు రూ.18.20కు రైతుకు విక్రయించాలి. 2016–17కు సంబంధించి రూ.9.1 కోట్ల విలువైన 2,500 మెట్రిక్ టన్నుల జింక్‌ను జిల్లాలకు మార్క్‌ఫెడ్ సరఫరా చేసింది. సబ్సిడీ సొమ్ము ఇలా కాజేశారు జింక్ సల్ఫేట్‌ను జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ల ద్వారా ఏవోలకు సరఫరా చేశారు. ఏవోలే నేరుగా రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయాలి. అయితే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కొందరు ఏవోలు రైతులకు విక్రయించకుండా స్థానికంగా ఉండే ప్రైవేటు ఎరువుల డీలర్లకు అప్పగించి వారి ద్వారా సబ్సిడీ లేకుండానే రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలంలో ఒక ప్రైవేటు డీలర్ వద్ద జింక్ సల్ఫేట్ బస్తాలు తాజాగా పట్టుబడ్డాయి. ఇలాగే మరిన్ని జిల్లాల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. యుటిలైజేషన్ సర్టిఫికెట్లూ రాలేదు 2016–17లో సరఫరా చేసిన జింక్ సల్ఫేట్కు సంబంధించి ఇంకా అనేక జిల్లాల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) రాలేదని మార్క్‌ఫెడ్ ఎరువుల విభాగం ముఖ్య అధికారి బాలు నరేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. గత రబీకి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క యూసీ రాలేదన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రైతులకు జింక్ అమ్మకుండా డీలర్ల ద్వారా విక్రయించినట్లు తెలిసిందని చెప్పారు. జింక్ సల్ఫేట్ అక్రమ దందాలో రూ.2 కోట్లకు లెక్కలు తేలడం లేదని అంచనా. ఖమ్మం జిల్లాలో జింక్ పక్కదారి పట్టినట్లు తెలిసినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలున్నాయి.