ఇద్దరు రైతుల ఆత్మహత్య  | Suicide of two farmers In Telangana | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల ఆత్మహత్య 

Published Wed, Mar 20 2024 6:25 AM | Last Updated on Wed, Mar 20 2024 6:25 AM

Suicide of two farmers In Telangana - Sakshi

సుధాకర్‌ (ఫైల్‌)

ఒకరు పంటలు ఎండిపోయి.. మరొకరు అప్పుల్లో కూరుకుపోయి..

వేలేరు/తలమడుగు: రాష్ట్రంలో ఇద్దరు అన్నదాతలు ఆత్మహ­త్య చేసుకున్నారు. నీరు తడి లేక పంట ఎడిపోయి ఒక­రు.. పంట దిగుబడి సరిగా రాక అప్పుల్లో కూరుకుపోయి తీర్చే దారిలేక మరొక రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన ఈ రైతుల ఆత్మహత్య లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్‌(43)కు మూడెకరాల వ్యవ సాయ భూమి ఉంది. కొంతభాగం మొక్కజొన్న సాగుచేశాడు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో అప్పులు చేసి బావిలో సైడ్‌ బోర్లు వేయించాడు.

అయినా నీరు పడకపోవడంతో పంట చేతికందే సమయంలో ఎండిపోయింది. బోర్లు వేసేందుకు, పంట పెట్టుబడికి, రెండేళ్ల క్రితం కూతురు పెళ్లికి తెచ్చిన అప్పు మిత్తి కలిపి రూ.12లక్షల వరకు ఉంది. ఇటు పంట ఎండిపోవడం, అటు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం చేలోకి వెళ్లిన సుధాకర్‌ ఎండిన పంటలను చూసి తీవ్ర మనోవేదనతో పురుగుల మందుతాగాడు. చుట్టు పక్కల రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. అప్పటికే సుధాకర్‌ మృతి చెందాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. 

పొలానికి వెళ్లొస్తానని చెప్పి...
ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం బరంపూర్‌ గ్రామానికి చెందిన కాకర్ల ఆశన్న (43)కు రెండెకరాల 19 గుంటలతో పాటు తన భార్య సుచరిత పేరిట మూడెకరాల 30 గుంటల పొలం ఉంది. మొత్తం ఆరెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సీజన్‌లో అందులో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. పత్తి పెట్టుబడి కోసం ఆదిలాబాద్‌లోని ఎస్‌బీఐలో భార్యాభర్తల ఇద్దరు పేరుమీద రూ.4లక్షలు, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి మరో రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు సంతానం. కుమార్తె డిగ్రీ, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

ఇటీవలే కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన ఆశన్న మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని చెప్పి ఇంటినుంచి బయల్దేరాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా...వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆశన్న మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement