పంట ఎండిపోయి ఒకరు... తెగుళ్లు, నీటికొరతతో మరొకరు..
మిరుదొడ్డి (దుబ్బాక)/ రామగిరి (మంథని): ఏడు బోర్లు వేసినా నీరందక పంట ఎండిపోవడంతో మనోవేదనతో ఓ రైతు, ఆరుగాలం కష్టపడ్డా నీటి కొరతతో పత్తి పంటకు దిగుబడి రాలేదన్న బాధతో మరో రైతు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్‌కు (48) వ్యవసాయమే జీవనాధారం. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులా బాద్ శివారులో నాలుగు ఎకరాల భూమిని కొనుగో లు చేసి వరి పంట వేశారు.
భూగర్భ జలాలు వట్టిపోవడం.. మండుతున్న ఎండలతో రెండు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో సుమారు రూ.6 లక్షల వరకు అప్పు చేసి 7 బోరు బావులు తవ్వంచాడు. అందులో ఒకటి రెండు బోరు బావుల నుంచి సన్నటి నీటి ధార మాత్రం వస్తోంది. పొట్ట దశకు వచ్చిన రెండు ఎకరాలకు సాగు నీరు అందక ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ శనివారం సాయంత్రం పొలం వద్దే పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరోఘటనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) రెండేళ్లక్రితం ఇల్లు నిర్మించుకున్నాడు.
ఇందుకోసం కొంత అప్పు తీసుకొచ్చాడు. తనకున్న 8 ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం బ్యాంకులో మరికొంత లోన్ తీసుకున్నాడు. అప్పు రూ.35 లక్షల వరకు చేరింది. పత్తి పంట అధిక దిగుబడి వస్తే మొత్తం అప్పు తీర్చవచ్చని భావించాడు. కానీ, తెగుళ్లు, నీటి కొరతతో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఈనెల 3న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment