జింక్ సబ్సిడీ.. అధికారుల దోపిడీ!
జింక్ సబ్సిడీ.. అధికారుల దోపిడీ!
Published Mon, Jul 3 2017 2:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- వ్యవసాయ శాఖలో సూక్ష్మపోషక ఎరువులు పక్కదారి
- రైతులకు సబ్సిడీతో ఇవ్వకుండా డీలర్ల ద్వారా విక్రయం
సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీపై అందించాల్సిన జింక్ సల్ఫేట్‌ను రాష్ట్రంలో అనేక చోట్ల కొందరు వ్యవసాయాధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు విక్రయించాల్సింది పోయి ప్రైవేటు డీలర్లకు కొందరు వ్యవసాయాధికారులు (ఏవో)కట్టబెడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులు పూర్తి ధరకు ప్రైవేటు డీలర్ల వద్ద జింక్‌ను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్క్‌ఫెడ్ లోని కొందరు జిల్లాస్థాయి అధికారులు కూడా ఏవోలకు సహకరిస్తున్నట్లు సమాచారం.
70 శాతం భూముల్లో జింక్ లోపం
రాష్ట్రంలో 70% పైగా పంట భూముల్లో జింక్ లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జింక్ లోపముంటే మొక్క ఎదగదు. పూత, కాత పడిపోతుంది. పంట దిగుబడి గణనీయం గా తగ్గిపోతుంది. భూసార పరీక్షల ఆధారంగా ఏ భూమిలో ఎంత జింక్ లోపముందో గుర్తి స్తారు. లోపమున్న భూముల్లో జింక్ సల్ఫేట్‌ను ప్రతీ మూడు పంటలకోసారి వేయాలి.
2,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు
జింక్ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏటా జింక్ సల్ఫేట్‌ను సరఫరా చేసే బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. జింక్ లోపాన్ని గుర్తించాక జిల్లా వ్యవసాయ శాఖల నుంచి ఇండెంట్ ఆధారంగా ప్రభుత్వం జింక్ సల్ఫేట్‌ను సరఫరా చేస్తుంది. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.36,400 ధరకు పలు కంపెనీల నుంచి 2,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. వరి రైతుకు సబ్సిడీ పోను కిలో రూ.24, పప్పుధాన్యాలు వేసే రైతుకు సబ్సిడీ పోను కిలోకు రూ.18.20కు రైతుకు విక్రయించాలి. 2016–17కు సంబంధించి రూ.9.1 కోట్ల విలువైన 2,500 మెట్రిక్ టన్నుల జింక్‌ను జిల్లాలకు మార్క్‌ఫెడ్ సరఫరా చేసింది.
సబ్సిడీ సొమ్ము ఇలా కాజేశారు
జింక్ సల్ఫేట్‌ను జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ల ద్వారా ఏవోలకు సరఫరా చేశారు. ఏవోలే నేరుగా రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయాలి. అయితే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కొందరు ఏవోలు రైతులకు విక్రయించకుండా స్థానికంగా ఉండే ప్రైవేటు ఎరువుల డీలర్లకు అప్పగించి వారి ద్వారా సబ్సిడీ లేకుండానే రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలంలో ఒక ప్రైవేటు డీలర్ వద్ద జింక్ సల్ఫేట్ బస్తాలు తాజాగా పట్టుబడ్డాయి. ఇలాగే మరిన్ని జిల్లాల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
యుటిలైజేషన్ సర్టిఫికెట్లూ రాలేదు
2016–17లో సరఫరా చేసిన జింక్ సల్ఫేట్‌కు సంబంధించి ఇంకా అనేక జిల్లాల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) రాలేదని మార్క్‌ఫెడ్ ఎరువుల విభాగం ముఖ్య అధికారి బాలు నరేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. గత రబీకి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క యూసీ రాలేదన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రైతులకు జింక్ అమ్మకుండా డీలర్ల ద్వారా విక్రయించినట్లు తెలిసిందని చెప్పారు. జింక్ సల్ఫేట్ అక్రమ దందాలో రూ.2 కోట్లకు లెక్కలు తేలడం లేదని అంచనా. ఖమ్మం జిల్లాలో జింక్ పక్కదారి పట్టినట్లు తెలిసినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలున్నాయి.
Advertisement
Advertisement