అతికించేద్దాం.. ఆదా చేద్దాం.. | Krupa Varanasi Making Wonders With Chemical Fertilizers | Sakshi
Sakshi News home page

అతికించేద్దాం.. ఆదా చేద్దాం..

Published Tue, Oct 2 2018 1:37 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Krupa Varanasi Making Wonders With Chemical Fertilizers - Sakshi

ఓ చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. కృపా వారణాసి విషయంలో ఆరేళ్ల క్రితం ఇదే జరిగింది. బోలెడంత డబ్బు పెట్టి కొనే టమాటా కెచప్‌ చివరి బొట్టును కూడా వాడుకునేందుకు ఈయన ఓ వినూత్నమైన ప్లాస్టిక్‌ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. కెచప్‌ బాటిల్‌లోంచి చివరి బొట్టు సులువుగా జారిపోయే వీడియో అప్పట్లో వైరల్‌ అయ్యింది కూడా. ఆ తరువాత ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కంపెనీలు వాడుకోవడం మొదలుపెట్టాయి. లిక్వీ గ్లైడ్‌ పేరుతో కృపా వారణాసి స్థాపించిన కంపెనీ కోటింగ్‌లు, ప్యాకేజింగ్‌ మొదలుకొని వైద్య పరికరాలు.. ఆఖరికి చమురు పైపుల్లోపలకూ చేరిపోయాయి. దీనికీ చారాణా కోడికి.. సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం.

10% పురుగుల మందుల వాడకంతో...
పంటలు ఏపుగా పెరగాలని రైతులు పురుగుల మందులను అవసరానికి మించి వాడుతున్నారని శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. అవగాహన రాహిత్యమనండి.. పంట ఏపుగా పెరగాలన్న ఆకాంక్ష కానివ్వండి.. రైతు తమ అలవాట్లను మార్చుకున్నది లేదు. అయితే ఓ చిన్న ఐడియాను అమల్లోకి తెస్తే కేవలం 10% పురుగు మందులతోనే మంచి దిగుబడులు సాధించవచ్చని కృపా వారణాసి గుర్తించారు. అదేంటంటే పురుగుల మందులు ఆకులకు అంటుకు పోయేలా చేయడం!. నీళ్లు, నీళ్లు కలిపిన పురుగుల మందులు వరితోపాటు గోధుమ, ఉల్లిపాయ, క్యాబేజీ వంటి పంటల ఆకులకు అస్సలు అంటుకోవు. ఇలాకాకుండా.. పురుగుల మందుల తయారీలో మార్పులు చేసి ఇవి ఆకులకు అతుక్కునేలా చేస్తే ఖర్చు కలిసొస్తుందని కృపా వారణాసి చెబుతున్నారు.

హైదరాబాద్, జునాగఢ్‌లో పరిశీలన..
ఆకులకు అతుక్కునే పురుగుల మందు తయారీకి కృపా వారణాసి ప్రయత్నాలు ఐదేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని ‘టాటా సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌’అందించిన నిధులతో కృపా పరిశోధనలు ప్రారంభించారు. మహేర్‌ దామక్‌ అనే పరిశోధక విద్యార్థితో కలసి హైదరాబాద్, జునాగఢ్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకున్నారు.

250 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఏటా వాడుతున్న పురుగుల మందు (కిలోల్లో)

25 కోట్లు
కొత్త పద్ధతి అమల్లోకి వస్తే వాడకం (కిలోల్లో)

‘‘చారాణా కోడికి.. బారాణా మసాలా’’ అని సామెత!
ఏ విషయంలోనైనా అవసరానికంటే ఎక్కువ వాడకూడదన్నది అర్థం! 
వ్యవసాయంలో పురుగుల మందు వాడకానికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది!
కానీ గత్యంతరం లేక మందులను విపరీతంగా వినియోగిస్తున్నారు!
ఇకపై మాత్రం అలా కాదు.. 

థ్యాంక్స్‌ టు
కృపా వారణాశి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement