వాతావరణం గతి తప్పడానికి వ్యవసాయ విధానమే ప్రబలమైన కారణమని గుర్తించడంతో ప్రపంచం తాను అనుసరిస్తూ వస్తున్న వ్యవసాయ విధానంలో మార్పుకోసం ప్రయత్నిస్తూ వస్తోంది. సురక్షితమైన, ప్రకృతి సహజ పద్ధతుల్లో పండించిన ఆహారం కోసం ఇప్పుడు ప్రపంచం పిలుపునిస్తోంది. భారీ సబ్సిడీలను గుమ్మరించడమే వ్యవసాయంలో విధ్వంసానికి కారణం. ప్రపంచం తెలీకుండానే దీనికి మూల్యం చెల్లిస్తోంది. అందుకే సహజ వ్యవసాయ విధానాలవైపుగా ప్రభుత్వ వ్యవసాయ యంత్రాంగాన్ని పునర్‌వ్యవస్థీకరించాలి. ప్రతి ఏటా ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలను క్రమంగా తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఇలాంటి మార్పును ప్రారంభించాలంటే, మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రసాయన ఎరువులను పూర్తిగా దూరం పెట్టేలా తమ పరిశోధనా కార్యక్రమాలను పూర్తిగా రీడిజైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచం రసాయన వ్యవసాయ పద్ధతుల నుంచి బయటపడాల్సిన తరుణం ఆసన్నమైంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం అనుసరిస్తున్న సాంద్ర వ్యవసాయ విధానాలు 25 శాతం గ్రీన్ హౌస్ ఉద్గారాలకు కారణమై వ్యవసాయ సంక్షోభాన్ని తీవ్రతరం చేయడమే కాకుండా, ప్రకృతి వనరుల పునాదిని భారీగా దెబ్బతీస్తూ వచ్చాయి. వాతావరణం గతి తప్పడానికి వ్యవసాయ విధానమే ప్రబలమైన కారణమని గుర్తించడంతో ప్రపంచం తాను అనుసరిస్తూ వస్తున్న వ్యవసాయ విధానంలో నెమ్మదిగా అయినప్పటికీ మార్పుకోసం ప్రయత్నిస్తూ వస్తోంది. సురక్షితమైన, ప్రకృతి సహజ పద్దతుల్లో పండించిన ఆహారం కోసం ఇప్పుడు యావత్ ప్రపంచం పిలుపునిస్తోంది. వ్యవసాయాన్ని చుట్టుముడుతున్న పర్యావరణ సంక్షోభానికి పునాది ఏదంటే, వ్యవసాయంలో భారీ సబ్సిడీలను గుమ్మరించడమే. ప్రపంచం తెలీకుండానే దీనికి మూల్యం చెల్లిస్తోంది. ప్రపంచ సైంటిస్టులు, నిపుణులు, ఆర్థిక వేత్తలతో కూడిన ఫుడ్ అండ్ ల్యాండ్ యూజ్ కొయిలిషన్ (ఎఫ్‌ఓఎల్‌యూ) సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకా రం, మానవ ఆరోగ్యం, సహజ వనరులు, పర్యావరణంపై అపారమైన ‘రహస్య వ్యయం’ కారణంగానే చౌక ఆహారం అందుబాటులోకి వస్తోంది. చౌక ఆహారం 12 లక్షల కోట్ల డాలర్ల విలువైనదిగా (చైనా జీడీపీతో సమానం) పరిగణిస్తున్నప్పటికీ ఆహార వాణిజ్యం ఇలాగే హార లేమితో ఇబ్బంది పడుతుందని ఈ సర్వే హెచ్చరించింది. వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన కారణాలను పరిశీలించిన ఈ నివేదిక తక్షణం చేపట్టాల్సిన పది పరివర్తనా చర్యలను సూచించింది.
పెరుగుతున్న పోషకాహార లేమి లేక ‘నిగూఢ ఆకలి’ అనేది సహజ వనరుల విధ్వంసం, వాతావరణ ఉత్పాతం ఫలితంగా సంభవించిన విషాద పరిణామంగానే చెప్పాలి. ఇది పర్యావరణ ఆత్మహత్యకు తక్కువేమీ కాదు. ‘ఆహారాన్ని, భూ వినియోగాన్ని మార్చివేసేందుకు పది సంక్లిష్ట పరివర్తనలను అభివృద్ధి చేయడం’ అనే పేరుతో వచ్చిన మరో నివేదిక.. ఆహార ఉత్పత్తిపై ఏటా 700 బిలి యన్ డాలర్లు ఖర్చుపెడుతున్నారని అంచనా వేసింది. అయితే వ్యవసాయానికి ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ వస్తున్న సబ్సిడీల పరిమాణాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టసాధ్యం కాబట్టి ఆహారోత్పత్తికి సంబంధించిన గణాంకాలు ఇంకా ఎక్కువే ఉండవచ్చని నిపుణుల వ్యాఖ్య. నన్ను ఒక విషయంలో స్పష్టత ఇవ్వనీయండి. అదేమిటంటే, ఈ సబ్సిడీలన్నీ రైతులకు చేరలేదన్నదే. ప్రత్యక్ష నగదు మద్దతుతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా సబ్సిడీల రూపంలో రైతుల చేతికి వస్తున్నది చాలా చిన్న మొత్తమేనని చెప్పాలి.
ఉత్పత్తిదారు సబ్సిడీ సమతుల్యత (పీఎస్‌యూ) ప్రాతిపదికన నిర్వహించిన మరొక అధ్యయనం రైతులకు ప్రపంచ వ్యాప్తంగా లభించిన సబ్సిడీ మద్దతు కొలమానాలను అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వాణిజ్య మండలి ఓఈసీడీ (ఆర్థిక సహకారం, అభివృద్ది సంస్థ), చైనా కలిసి 2016–17లో ఒక్కొక్కటి వరుసగా 235 బిలియన్ డాలర్లు, 232 బిలియన్ డాలర్లను వార్షిక సబ్సిడీ కింద రైతులకు అందజేశాయని ఈ అధ్యయనం అంచనా. 2005 డిసెంబర్‌లో జరిగిన హాంకాంగ్ మినిస్టీరియల్ సమావేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ తొలి పదేళ్ల వ్యవసాయ ఒప్పందంపై సమర్పించిన నివేదిక ప్రధాన రచయితగా నా అంచనా ప్రకారం, వ్యవసాయ సబ్సిడీల్లో 80 శాతం వరకు నిజమైన రైతులకు కాకుండా ప్రపంచమంతటా వ్యవసాయ వాణిజ్య కంపెనీలకే అందాయి. 2005లో సంపన్న దేశాలు ఇచ్చిన 360 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ సబ్సిడీల స్థితిగతులను ప్రపంచ వాణిజ్య సంస్థ పరిశీలించింది. ప్రధానంగా ఎగుమతి ఆధారిత వ్యవసాయంలో భాగంగా ఈ సబ్సిడీల్లో అధికభాగం నేల సారాన్ని ధ్వంసం చేసి, భూగర్భ జలాన్ని కలుషితం చేసిన సాంద్ర వ్యవసాయ విధానాలకు ఉపయోగించారు. పైగా పశుపోషణకు, పామాయిల్ తోటలకు, బయో–ఫ్యూయల్ పంటలను పెంచడానికి, ఇండస్ట్రియల్ లైవ్‌స్టాక్ పెంపకానికి, పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా జీవవైవిధ్యతను నాశనం చేసి అనారోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసిన ఆహార ప్రాసెసింగ్, వాణిజ్య విధానాలకు ఈ సబ్సిడీలను ఉపయోగించడం గమనార్హం.
సంవత్సరానికి దాదాపు 700 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యవసాయ సబ్సిడీల్లో కేవలం ఒక శాతం మాత్రమే పర్యావరణ హితమైన వ్యవసాయ విధానాలకు అందటం విచారకరం. భారతదేశంలో కూడా వార్షికంగా అందచేస్తున్న సబ్సిడీ మద్దతులో ఒక్కటంటే ఒక్క శాతం మాత్రమే పునరుత్పాదక వ్యవసాయానికి లేక సహజ, సమగ్ర వ్యవసాయానికి అందించారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలకు చాలా తక్కువ మొత్తం సబ్సిడీలు మాత్రమే అందిస్తున్నారని ఫుడ్ అండ్ ల్యాండ్ యూజ్ కొయిలేషన్ సంస్థ ప్రిన్సిపల్ జెరెమీ ఒప్పెన్‌హైమ్ తెలియజేశారు. ఇకనైనా సానుకూల ఫలితాలను తీసుకొచ్చే రంగాలకు సబ్సిడీలను మళ్లించాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి పలు సవాళ్లు ఉన్నాయి. కానీ సరైన దిశగా చిన్ని అడుగులు వేయడం మొదలుపెడితే అది సురక్షిత ఆహార వృద్దిలో గణనీయ పరివర్తనకు దారితీస్తుంది. రసాయన ఎరువులనుంచి రైతులు వైదొలగాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు కానీ ఉన్నట్లుండి అలాంటి చర్యలు చేపడితే హరిత విప్లవం ద్వారా దేశం సాధించిన ప్రయోజనాలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోతాయని శాస్త్ర ప్రపంచం భావిస్తోంది. దీనికి బదులుగా నేచుర్ పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం చైనా రసాయనాల వాడకాన్ని 15 శాతానికి తగ్గించడం ద్వారా వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల్లో సగటున 11 శాతం మేరకు ఆహార పంటల ఉత్పత్తిలో పెరుగుదల సాధించిందని తెలుస్తోంది. అయితే సంవత్సరాలపాటు 14 వేల వర్క్‌షాపులు నిర్వహించడం, 65 వేల బ్యూరోక్రాట్లను, టెక్నీషియన్లను, వెయ్యి మంది పరిశోధకులను సమన్వయం చేసినటువంటి సుదీర్ఘమైన దృఢదీక్షా వైఖరి కారణంగానే చైనాలో ఇంతటి మార్పు సంభవించింది. పైగా 2020 సంవత్సరం లోపు ఎరువులు, పురుగుమందుల సబ్సిడీని జీరో స్థాయికి తీసుకొస్తానని చైనా ప్రకటించింది. అలాంటప్పుడు చైనా విధానాన్ని భారత్ కూడా అవలంబించి సహజ వ్యవసాయ విధానాలవైపుగా ప్రభుత్వ వ్యవసాయ యంత్రాంగాన్ని పునర్‌వ్యవస్థీకరించాలి. అదే సమయంలో ప్రతి ఏటా ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలను క్రమంగా తగ్గించుకునే చర్యలు చేపట్టాలి.
ఎరువుల సబ్సిడీలపై కోత విధించడంతోపాటు చైనా పంటల మార్పు, పంటల అవశేషాలను తిరిగి ఉపయోగించుకోవడం, నేల సారాన్ని కాపాడటం వంటి వాటిని ప్రోత్సహిస్తూ వచ్చింది. హరిత విప్లవం సమయంలో విజయవంతంగా అమలు చేసిన వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను ఊతంగా తీసుకున్న చైనా తాజాగా కనీసం 40 స్వావలంబనా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పర్చగలిగింది. పైగా పంటపొలాలను రసాయన సేద్యానికి దూరంగా ఉంచడంలో చిత్తశుద్ధితో వ్యవహరించింది. అదేసమయంలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలు నీటిని తాగేసే రకం పంటలను పండించడం ద్వారా తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ప్రావిన్స్‌లో నీటివినియోగాన్ని తగ్గించడంలో విశేషంగా కృషి చేసిన రైతులకు ప్రోత్సాహకరంగా 500 మిలియన్ల ఆసీస్ డాలర్ల నిధిని ఏర్పర్చింది. మరి వరికి బదులుగా తక్కువ నీటిని వినియోగించే రైతులకు పంజాబ్‌లో కూడా ఇలాంటి ఉద్దీపన ప్యాకేజీలను ఎందుకు అందించకూడదు? పరిశ్రమలకు రూ. 1.45 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వగలిగినప్పుడు మన రైతులకు కూడా అలాంటి ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇవ్వకపోవడంలో ఎలాంటి హేతువూ నాకు కనిపించడం లేదు. అయితే ఇలాంటి మార్పును ప్రారంభించాలంటే, మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రసాయన ఎరువులను పూర్తిగా దూరం పెట్టేలా తమ పరిశోధనా కార్యక్రమాలను పూర్తిగా రీడిజైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మన ఆలోచనా విధానంలో మార్పు ఎంతో అవసరం. దీనికి కాస్త సమయం అవసరమవుతుంది కానీ అసాధ్యమేమీ కాదు. అదే సమయంలో వ్యవసాయానికి బడ్జెటరీ మద్దతును పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైపుకు మళ్లించడం ఎంతో అవసరం. ప్రపంచ స్థాయిలో ఎఫ్‌ఓఎల్‌యూ నివేదిక కనీసం 500 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను రక్షణాత్మక వ్యవసాయం వైపు, దారిద్య్రాన్ని తొలగించడం, పర్యావరణ పునరుద్దరణ వైపు మళ్లించాలని పేర్కొంది. ఇది పెద్ద మొత్తమే కానీ కచ్చితంగా ఇది సాధించదగిన లక్ష్యమే మరి.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ :hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment