అక్రమాలకు ఎరువు! | Private dealers dealings in the distribution of chemical fertilizers | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ఎరువు!

Published Fri, Jun 2 2017 9:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

అక్రమాలకు ఎరువు!

అక్రమాలకు ఎరువు!

► ఈ–పోస్‌ మిషన్‌ల ద్వారా ఎరువుల పంపిణీ ఒట్దిదే
►ఏప్రిల్‌ నుంచి ఇదిగో అదుగో అంటూ హడావుడి
► జిల్లాకు అవసరమైన మిషన్‌లు 819.. వచ్చింది 60
► డీబీటీకి కంపెనీల మొకాలడ్డు
► ఖరీఫ్‌ మొదలయినా అతీగతీ లేని నూతన విధానం


కర్నూలు(అగ్రికల్చర్‌): రసాయన ఎరువుల పంపిణీలో ప్రయివేట్‌ డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన డైరెక్టు బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) విధానం అభాసు పాలవుతోంది. ఎరువుల కంపెనీలే ఈ విధానానికి మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఎరువుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కంపెనీలకు మింగుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే డీబీటీ విధానంపై ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది. మొదట్లో ఫర్టిలైజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, ఆ తర్వాత మొబైల్‌ ఫర్టిలైజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ అమలులోకి వచ్చింది. అయితే ఈ విధానాలు అక్రమాలను అరికట్టలేకపోయాయి. హోల్‌సేల్‌ డీలర్లు ఆడింటే ఆట.. పాడిందే పాటగా వ్యాపారం సాగింది.

డిమాండ్‌ను బట్టి అడ్డూఅదుపు లేకుండా బ్లాక్‌లో విక్రయించడం, ఇక్కడ డిమాండ్‌ లేకపోతే ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలించడం జరుగుతోంది. కేవలం 2 గదుల ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్క బస్తా ఎరువును దించకుండానే కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న హోల్‌సేల్‌ డీలర్లు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ర్యాక్‌ పాయింట్‌ నుంచే ఎరువులను అక్రమంగా తరలిస్తుండటం గమనార్హం. జిల్లాకు ఇస్తున్న ఎరువులు ఇక్కడే వినియోగిస్తున్నారా.. ఏఏ రైతు ఎన్ని బస్తాలు కొన్నారనే వివరాలు అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం అక్రమాలకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

జిల్లాకు 819 ఈ–పోస్‌ మిషన్‌లు అవసరం.. వచ్చింది 60 మాత్రమే..
మొదటి దశ కింద జిల్లాలో హోల్‌సేల్‌ డీలర్లకు ఈ–పోస్‌ మిషన్‌ల ద్వారా ఎరువులు మే నుంచి పంపిణీ చేయతలపెట్టారు. జిల్లాకు 819 ఈ–పోస్‌ మిషన్‌లు అవసరం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎరువుల కంపెనీలే వీటిని సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాకు క్రిబ్‌కో కంపెనీ 598, ఎంసీఎఫ్‌ఓల్‌ కంపెనీ 136, పీపీఎల్‌ 22, జువారి కంపెనీ 28, ఎంఎఫ్‌ఎల్‌ 11, ఆర్‌సీఎఫ్‌ 24 ప్రకారం ఈ–పోస్‌ మిషన్‌లను సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా అయిన ఎరువులను రైతులు కొనుగోలు చేస్తేనే కంపెనీలకు సబ్సిడీ జమ అవుతుంది. కొనకపోతే సబ్సిడీ వచ్చే అవకాశం లేదు. దీంతో డీబీటీ అమలుకు కంపెనీలే సహకరించడం లేదనే విమర్శలు వ్యక్తమతున్నాయి. ఖరీఫ్‌ మొదలయినా ఇప్పటి వరకు కేవలం 60 ఈ–పోస్‌ మిషన్‌లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎరువుల పంపిణీలో అక్రమాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఏర్పడింది.

ఖరీఫ్‌ సీజన్‌కు 3,38,077 టన్నుల ఎరువులు అవసరం
ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు యూరియా 1,13,312 టన్నులు, డీఏపీ 65,600, ఎంఓపీ 16432, కాంప్లెక్స్‌ ఎరువులు 1,42,733 టన్నులు మొత్తంగా 3,38,077 టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ప్రతి ఏటా 25 శాతం ఎరువులు ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలుతున్నాయి. డీబీటీ విధానం వల్ల అక్రమాలకు తావుండదు. ఈ–పోస్‌ మిషన్‌లలో అందరి ఆధార్‌ డేటా, వెబ్‌ల్యాండ్‌ డేటాను లోడ్‌ చేస్తారు. రైతు ఈ మిషన్‌పై వేలిముద్ర వేయడంతో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలకు ఎన్ని బస్తాల ఎరువుల అవసరం అనేది వస్తుంది.

రైతు ఎరువులు కొనుగోలు చేసిన వెంటనే ఏ కంపెనీ ఎరువులు ఎన్ని బస్తాలు తీసుకున్న వివరాలు ఆన్‌లైన్‌లో వెంటనే కేంద్రానికి వెళ్తాయి. దీన్ని బట్టి కేంద్రం సబ్సిడీ విడుదల చేస్తుంది. డీబీటీ విధానం వల్ల కంపెనీలకు గండి పడే ప్రమాదం ఉండటంతో జిల్లాకు ఈ–పోస్‌ మిషన్‌లను సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితి ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ఉంది. జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటే తప్ప ఈ–పోస్‌ మిషన్‌లు జిల్లాకు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement