
తగ్గుతున్న భూసారం
- పెరుగుతున్న కాలుష్యం
- విచక్షణారహితంగా రసాయన
- ఎరువుల వాడకమే కారణం
- బయోపెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్‌పై దృష్టి సారించడం అవశ్యం
- గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు
గజ్వేల్ :రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలను విచక్షణారహితంగా వాడుతుండంటం వల్ల భూముల్లో రసాయనిక చర్య జరిగి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు లోపిస్తున్నాయి. దీనివల్ల పంటలపై తెగుళ్లు దాడిచేసి దిగుబడులు తగ్గిపోతాయి. భారీ పెట్టుబడులు పెట్టినా పంటలు పండక రైతులు నష్టాలపాలవ తారు. అంతేకాక అహారపదార్థాల్లో పోషకవిలువలు తగ్గిపోతున్నాయి.
ఇలాంటి సందర్భంలో రైతులు బయోఫర్టిలైజర్స్‌పై దృష్టిసారించడం మంచింది. నాణ్యమైన కంపెనీలకు చెందిన బయో ఉత్పత్తులను ఎంపిక చేసుకొని యాజ మాన్య పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్.నం 7288894469) సూచిస్తున్నారు.
గతంలో రసాయనిక ఎరువులు రైతులకు ఎక్కువగా అందుబాటులో ఉండేవి కావు. అధిక దిగుబడులకోసం పశువుల ఎరువులను వినియోగించేవారు. అంతేకాక కానుగ, వేప, పాలకొడిసె, తంగేడు ఆకులను పొలంలో తొక్కేవారు. దీంతో భూమి సారవంతం కావడమే కాకుండా పంటలపై తెగుళ్లు, పురుగులు ఆశించేవి కావు.
రసంపీల్చే పురుగులను నివారించడం కోసం సంధ్యవేళల్లో పొలాల వద్ద అగ్గి కుంపట్లు వేసేవారు. ప్రస్తుతం పంటల సాగు విషయంలో రైతులు రసాయన ఎరువుల వాడకంపై ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. అంతేకాక భూమిలో రసాయన చర్య జరిగి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మపోషకాల లోపం ఏర్పడుతోంది. దీని వల్ల కాంప్లెక్సు ఎరువు వేసినా ఆశించిన ఫలితం ఉండటం లేదు. సూక్ష్మ పోషకాల లోపం ఉన్నా మొక్క ప్రధాన పోషకాలను తీసుకోదు. ఈ ప్రభావం దిగుబడులపై చూపుతుంది. అంతే కాక తెగుళ్లు పంటలపై దాడిచేయడానికి ప్రధాన కారణం ఇదే.
సహజ సస్యరక్షణ చర్యలు
వరి నాట్లువేసిన మూడు రోజుల తర్వాత నాచు మొక్కలను పెంచితే మొక్కలకు అవసరమయ్యే నత్రజనిని అందిస్తుంది. గాలిలో ఉన్న నైట్రోజన్‌ను గ్రహించే తత్వం ఈ మొక్కలకుంటుంది. జీవంతో కూడిన నాచుమొక్కలను తెచ్చి పొలంలో నాలుగు దిక్కుల వేస్తే 15 రోజుల్లో మొత్తం పారుతుంది. దీనివల్ల కొంతమేరకు కలుపు మొక్కలను కూడా నివారించవచ్చు.
అలాగే వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగటమే కాక సుమారు 20నుంచి 25 శాతం నత్రజని, భాస్వరం, పొటాష్‌ను ఆదా చేయవచ్చు. పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువులను వాడినట్లయితే భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
మొగిపురుగు నివారణ చర్యలు
సహజంగా పాలకొడిసె ఆకును చిన్నగా తరిగి పొలంలో వేసినట్లయితే మొగిపురుగు నశిస్తుంది. లేదా అగ్ని అస్త్రంతో నివారించవొచ్చు. దీనిని రైతులు ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో 10లీటర్ల గోమూత్రం తీసుకొని ఇందులో కిలో పొగాకు ముద్ద, 5కిలోల వేపాకు ముద్ద, కిలో పచ్చిమిరపకాయల ముద్ద, అరకిలో వెల్లుల్లి ముద్ద వేసి పాత్రపై మూత పెట్టి నాలుగుసార్లు పొంగువచ్చేట్లు ఉడికించాలి.
అనంతరం దానిని 48గంటల వరకు చల్లార్చాలి. చివరకు ఒక గుడ్డతో వడగట్టి డబ్బాలో వేసి భద్రపరుచుకోవాలి. పురుగు ఆశించినప్పుడు ఎకరానికి 100లీటర్ల నీటికి 2 నుంచి మూడు లీటర్ల అగ్ని అస్త్రం కలిపి పిచికారి చేస్తే మొగిపురును అరికట్టవచ్చు.
పచ్చపురుగు, లద్దెపురుగు నివారణ
ఈ పురుగుల నివారణ కోసం నీమ్ ఆయిల్‌ను పిచికారి చేయాలి. దీనివల్ల మొక్క ఆకు చేదెక్కడం వల్ల పురుగులు వాటిని ఆశించవు. పురుగులు ఉత్పత్తి చేసిన గుడ్లపై ఈ ద్రావణం చల్లడం వల్ల అవి కుళ్లిపోతాయి.
అంతేకాక ఈ ద్రావణం పడటం వల్ల ఆడపురుగులు గుడ్లుపెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కొన్ని పురుగులు బతికున్నా పంటకు ఎలాంటి నష్టం ఉండదు. లేదా పచ్చపురుగు, రబ్బరు పురుగులను సేకరించి బాగా నూర్పిడి చేసి దానిలో కొంత వైరస్ కలిపి పిచికారి చేయడం వల్ల పురుగులన్నీ నశించిపోతాయి.
రసంపీల్చే పురుగుల నివారణ చర్యలు
5కిలోల పచ్చివేపాకును తెచ్చి బాగా నూర్పిడి చేయాలి. లేదా 5కిలోల ఎండు వేపాకులు, కాయల పొడిని 100లీటర్ల నీళ్లలో వేసి 5లీటర్ల గోమూత్రం, కిలో ఆవుపేడ కలపాలి. ఈరకంగా కలిపిన దానిని 24 గంటల వరకు మూసి ఉంచి తర్వాత గుడ్డతో వడకట్టాలి. ఆ తర్వాత పంటలకు పిచికారి చేస్తే రసం పీల్చే పురుగలను నివారించవచ్చు.
ఆకుమచ్చ, కాయమచ్చ బూజు తెగుళ్ల నివారణ
ఎకరాకు 100లీటర్ల నీళ్లలో పుల్లటి మజ్జిగను కలిపి పిచికారి చేస్తే ఈ తెగుళ్లను నివారించవొచ్చు. నాలుగురోజులు బాగా బ్యాక్టీరియా వచ్చే విధంగా ఉంచిన తర్వాత మజ్జిగా తయారు చేసి పిచికారి చేయాలి. ఇలా ప్రతి పురుగుకు రసాయన మందులను వినియోగించకుండానే నివారించవచ్చు.
నాణ్యమైన ఉత్పత్తల ఎంపికే కీలకం
రసాయన ఎరువుల స్థానంలో బయోపెస్టిసైడ్స్ తయారు చేసి కొన్ని ప్రైవేటు కంపెనీలు మార్కెట్‌లో రైతులకు అందుబాటులోకి తెచ్చారు. సుమారుగా అన్ని పురుగులకు, తెగుళ్లకు బయోపెస్టిసైడ్స్ ప్రస్తుతం అన్ని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో రైతులకు లభిస్తున్నాయి. అంతేకాక రసాయన ఎరువులతో సరిసమానంగా ఫలితాలను సూచిస్తున్నాయి.
రసాయన ఎరువులు వాడితే పురుగులు అప్పటికప్పుడు నశించిపోతాయి. మళ్లీ కొద్దిరోజుల తర్వాత పంటలను ఆశించే అవకాశం ఉంది. బయోపెస్టిసైడ్స్‌ను వాడటం వల్ల సుమారుగా నెలవరకు ఆ పంటపై ఎలాంటి పురుగులు ఆశించవు.
బయో ఉత్పత్తుల పేరిట కొన్ని నాణ్యతలేని కంపెనీలు పుట్టుకొచ్చి రైతులు మోసం చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. రైతులు నాణ్యమైన కంపెనీలపై అవగాహన పెంచుకొని వాటినే వాడాలి.