జిల్లాలో పంటలు విస్తారంగా పండిస్తున్నారు. వాటి దిగుబడి పెరగడానికి లక్షలాది బస్తాల రసాయనిక ఎరువులు కుమ్మరిస్తున్నారు. తెగుళ్లు ఆశించకుండా ఇబ్బడి ముబ్బడిగా పురుగుమందులు స్ప్రే చేస్తున్నారు. ఇలా పండించే పంట కాస్తా విషతుల్యం చేస్తున్నారు. సేంద్రియంపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... ఎందుకో మారలేకపోతున్నారు.
విజయనగరం ఫోర్ట్: రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరుగుతోంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం లేదు. సాగువిస్తీర్ణానికి సరి సమాన స్థాయిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తున్నారు. చిన్న సమస్యకూ రసాయనిక మందులే విరుగుడుగా భావిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యంగా పడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో నాట్లు ఆలస్యంగా వేశారు. దీనివల్ల పంట ఎదుగుదల కోసం రైతులు ఎరువులను అధికంగా వినియోగించారు. పంటలకు తెగుళ్లు ఆశించడంతో పురుగుమందులను అధికంగా వినియోగించారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో లక్ష 90 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు తదితర పంటలు సాగు చేశారు. వాటికి 12.39 లక్షల బస్తాల ఎరువులను రైతులు వినియోగించారు. అంతేగాదు... 1.60 లక్షల లీటర్ల పురుగుమందులను వాడారు. తెగుళ్ల నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేప కషాయం, వేపనూనె వంటి వాటితో తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. కాని చాలా మంది రైతులు అవగాహన లేక రసాయనిక ఎరువులు, పురుగు మందులనే వినియోగిస్తున్నారు. రైతులు పంట దిగుబడి పెంచేందుకు పోటీపడి నారుమడి నుంచి పంటకోత దశ వరకు ఎకరానికి 4 నుంచి 5 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, 2 లీటర్ల వరకు పురుగు మందులు వాడుతున్నారు. ఇలా మొత్తం ఎరువులు, పురుగుమందులకోసం దాదాపు రూ.150 కోట్లు వరకు వెచ్చించారు.
సేంద్రియంపై పెరగని ఆసక్తి..
రైతాంగంలో ఒకప్పుడు ఉండే సహనం... ఆసక్తి ఇప్పుడు సన్నగిల్లుతోంది. ఒకప్పుడు పూర్తిగా గెత్తం వంటివాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవా రు. కానీ సునాయాసంగా మార్కెట్లో లభ్యమ య్యే ఎరువులను కొనుగోలు చేసి వేసేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే సేంద్రియ ఎరువులుగానీ... తెగుళ్ల నివారణకోసం తయారయ్యే ద్రావణాల జోలికి పోవడం లేదు. దీనికి కాస్తంత శ్రమపడాల్సి రావడమే కారణం. వాస్తవానికి ర సాయనిక ఎరువుల వినియోగంవల్ల ఏడాదికేడాదికీ భూసారం తగ్గిపోతోంది. దిగుబడిపై దాని ప్రభావం చూపుతోంది. అయినా రైతాంగం మా త్రం రసాయనికంపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.
సేంద్రియమే మేలు..
పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగులను సేంద్రియ ఎరువుల ద్వారా కూడ నివారించవచ్చు. ప్రకృతిలో దొరికే వేపగింజలతో చేసే వేపకషాయం, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేపనూనె తయారీకి అతి తక్కువ ఖర్చు వుతుంది. వీటిని వినియోగించి తెగుళ్లను సమర్థంగా నివారించవచ్చు. వర్మీకంపోస్టు, అజొల్లా వంటివి వేసి కూడా పంటలను పండించవచ్చు. దీనివల్ల పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటి ఉత్పత్తులకు మంచి డి మాండ్ ఉంటుంది.
– టి.ఎస్.ఎస్.కె.పాత్రో, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి
Comments
Please login to add a commentAdd a comment