
ప్రకృతి నేర్పేదే నిజామైన జ్ఞానం
ప్రకృతి వ్యవసాయ విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న కర్ణాటక రైతు కిష్టప్ప చెరకులో ఎకరానికి రూ. 4.8 లక్షల ఆదాయం బహువార్షిక, ఏకవార్షిక పంటలతో ‘పంటల అడవి’కి రూపకల్పన భూమిలో జీవనద్రవ్యం(హ్యూమస్) పెరిగితేనే దిగుబడి పెరిగేది..
ప్రకృతి నేలకు అమర్చిన సహజ కవచ కుండలమే సారం. సారంలేని నేల ప్రాణం లేని దేహం లాంటిది. అజ్ఞానంలోనో, తెలియని అమాయకత్వంలోనో ఇవాళ మన దేశీయ వ్యవసాయం రసాయనాల వలయంలో చిక్కుకుపోయింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా అసలు మొక్క ఎదగదని, పంట పండదని బలంగా నమ్మేటంత దుస్థితిలోకి రైతు కూరుకుపోయాడు. ప్రకృతితో కలిసి సాగాల్సిన రైతు ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణించి సేద్య పద్మవ్యూహంలో ఒంటరి అభిమన్యుడిలా నిస్సహాయంగా మిగిలిపోయాడు. చివరకు నిరాశా నిస్పృహల్లో దిక్కుతోచక ఆత్మహత్యల ఉరితాళ్లకు వేలాడుతున్నాడు. వ్యవసాయం గుండెల మీద కుంపటిలా మారి అన్నదాతను ‘అంతరించిపోయే జాతుల జాబితా’లోకి చేరుస్తున్న ఈ పాపకాలంలో.. బన్నూర్ కిష్టప్పలాంటి రైతులు మండుటెండలో చిరుజల్లులా మనల్ని పలకరిస్తుంటారు. సేద్యంపై.. అంతిమంగా జీవితంపై.. కొత్త ఆశను కల్పిస్తుంటారు. కర్ణాటకలోని మైసూర్ దగ్గర మాండ్యా జిల్లాలోని బన్నూర్ గ్రామానికి చెందిన కిష్టప్ప వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి వ్యవసాయమే పరిష్కారంగా ఆవిష్కరిస్తూ.. ముందుకు సాగుతున్నాడు. 2006లో రెండెకరాలతో మొదలైన ఆయన ప్రయాణం ఇవాళ 24 ఎకరాలకు విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ వైభవాన్ని కళ్లారా చూడ్డానికి వచ్చే రైతులు కిష్టప్ప క్షేత్రంలో ప్రతి రోజూ కనిపిస్తారు. ఆయన అనుభవాల సారమిది...
‘‘మొదట్లో నేను వ్యవసాయంలో రసాయనాలు వాడేవాణ్ణి. మేమిక్కడ ఎక్కువగా చెరకు, ధాన్యం, అరటి పెంచేవాళ్లం. చెరకు పండించాలంటే ఎనిమిదేళ్ల క్రితం రూ. 25 వేల నుంచి 30 వేలు ఖర్చవుతూ ఉండేది. అరటికీ అంతే. మధ్యమధ్యలో పంటకు తెగుళ్లు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయేది. అన్నీ పూర్తయ్యాక చూస్తే వచ్చేది కూడా వడ్డీ కట్టడానికి సరిపోయేది. ఇలా జరుగుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలీక రైతులు ఆత్మహత్యల బాట పట్టేవారు. ఈ బాధలకు ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలని నేను ప్రయత్నిస్తూ ఉండేవాడిని.
అప్పుడు కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నాయకుడు కే ఎస్ పుట్టన్నయ్య రైతులు చస్తే దేశం కూడా చచ్చినట్లే.. అందువల్ల మీరెవరూ చావకండి. ఎన్ని అప్పులున్నా నిదానంగా తీర్చుకుందాం అని చెప్పి, మహారాష్ట్ర నుంచి సుభాష్ పాలేకర్‌ను తీసుకువచ్చి హుబ్లీలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అప్పుడక్కడ పాలేకర్ గారు ఒకే ఒక్క పశువుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయొచ్చన్నారు. పంటల్ని ఎలా పెంచాలో, ఏం చేయాలో ఆయన దగ్గర తెలుసుకొని ఇక్కడికి వచ్చి.. ఆచరించడం మొదలు పెట్టాను. కేవలం పది కేజీల పేడ, పది లీటర్ల పశువుల మూత్రం. రెండు కేజీల పప్పుల పిండి, రెండు కేజీల నల్లబెల్లం, గుప్పెడు మట్టిని తీసుకొని 200 లీటర్ల నీటిలో కలియబెట్టి జీవామృతం తయారుచేసి పంటలకు అందించాను. దాంతో నాణ్యమైన దిగుబడి సాధించాను. ఇక్కడ ఏమీ ఖర్చు పెట్టకుండానే పంట లభిస్తుంది.
అన్నిటికంటే జీరో బడ్జెట్ వ్యవసాయంలో పనివాళ్ల అవసరం కేవలం పది శాతం. నీటి అవసరం ఇరవై శాతం మాత్రమే. మొక్కలు అడవిలో సహజంగా ఎలా పెరుగుతాయో అలాగే ఇక్కడ కూడా పెరుగుతున్నాయి. ఎలాంటి చీడపీడలూ రావు. ఈ పద్ధతిలోనే నేనిక్కడ బాసుమతి ధాన్యం పండిస్తున్నాను. ఈ లోకల్ వెరైటీ పంట కాలం 145 రోజులు. ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం జీవామృతం వేసి నాటాం..
దిగుబడిని పెంచేది జీవనద్రవ్యమే!
దిగుబడి పెరగాలంటే చేయాల్సిందల్లా నేలలో అంతకంతకూ జీవనద్రవ్యాన్ని (హ్యూమస్) పెంచుకుంటూ పోవడమే. ఆకులు, అలములు, గడ్డీ గాదం వంటి వ్యర్థాలను కుళ్లబెట్టడం ద్వారా మేం జీవనద్రవ్యాన్ని పొలంలోనే పెంపొందిస్తున్నాం. దీనివల్ల ఎలాంటి చీడపీడలు లేకుండా నాణ్యమైన పంట దిగుబడులు వస్తున్నాయి. నిరంతరంగా ఆదాయం కూడా లభిస్తోంది. మట్టిలో ఉన్న ప్రతి కిలో జీవనద్రవ్యం రోజుకు 6 లీటర్ల నీటిని వాతావరణం నుంచి పీల్చుకుంటుంది. అయితే, రసాయన వ్యవసాయంలో జీవనద్రవ్యాన్ని మనమే పాడుచేస్తాం. పంట పూర్తయ్యాక గడ్డీగాదానికి నిప్పు పెట్టి దాన్ని పాడుచేస్తాం. బయటి నుంచి రసాయనిక ఎరువులు తెచ్చి వేస్తాం. తద్వారా పంటని పెంచుకుంటాం. దీనివల్ల రైతుకు ఖర్చులు ఎక్కువైనా.. పంటలకు తెగుళ్లొచ్చి పంటా సరిగ్గా చేతికి రాదు. భూమీ పాడౌతుంది.
సహజంగా అడవుల్లో పెరిగే చెట్ల నుంచి పూలు, కాయలు, ఆకులు.. వాటంతట అవే రాలిపోయి కుళ్లి జీవనద్రవ్యంగా మారి.. పునర్వినియోగం అవుతుంటాయి. ఇక్కడ పొలంలో కూడా అలాగే జీవనద్రవ్యం తయారవడం వల్ల పంటలు బాగా పండుతున్నాయి.
పోషకాలన్నీ భూమిలోనే ఉన్నాయి..!
రసాయనాలు, ఎరువులు ఎక్కువ వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పిన మాటలను మనం నమ్ముతూ వచ్చాం. అదంతా అబద్ధం. మా దగ్గర పంట ఇంత నాణ్యంగా రావడానికి కారణం పంచభూతాలైన సూర్యకిరణాలు, గాలి, నీరు, ఆకాశం, భూమి! చెట్లు పంచభూతాలను ఉపయోగించుకొని కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది. ఇది ప్రతి రోజూ జరిగే పని. వంద గ్రాముల ఆహారం తయారవడానికి 98.5% మేరకు కావాల్సింది కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. మిగిలిన 1.5% మేరకు మాత్రమే నత్రజని, భాస్వరం, పొటాష్ (ఎన్‌పీకే), లఘు పోషకాలు, సూక్ష్మపోషకాలు అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ వాతావరణం ద్వారా ఉచితంగానే లభిస్తాయి. మిగిలిన ఒకటిన్నర శాతం పోషకాలతోనే ఇబ్బంది. మీ భూమిలో సూక్ష్మపోషకాలు లేవు తీసుకొచ్చి వెయ్యండి.. ఇంకేదో చాలినంత లేదు తెచ్చి వెయ్యండి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. కానీ, ప్రకృతి వ్యవసాయంలో మనం వీటిని ఎక్కడి నుంచీ తెచ్చి వేయనక్కరలేదు. అవన్నీ కూడా మన భూమిలోనే ఉన్నాయి. మట్టిలో ఉన్న పోషకాలను మొక్కలు ఉపయోగించుకోగలిగే రూపంలో లేవు. వీటిని వేళ్లు ఉపయోగించుకోగలిగే రూపంలోకి మార్చి అందించేది వానపాములు, సూక్ష్మజీవులు. అయితే, మనం ఏం చేస్తున్నాం? రసాయనాలు వేసి చంపేస్తున్నాం.
మనం ఏమి చెయ్యాలంటే.. ఈ 1.5% పోషకాంశాలను జీవామృతం ద్వారా అందించాలి. జీవామృతం తయారీకి వాడే పేడలో గ్రాముకు 300 నుంచి 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులున్నాయి. దాన్ని నీరు, మూత్రంలో వేసి కలియబెట్టినప్పుడు సూక్ష్మజీవులు ఇరవై నిమిషాల్లో రెట్టింపవుతూ ఉంటాయి. ఒక రోజుకి లెక్కలేనన్ని సూక్ష్మజీవులు అభివృద్ధి అవు తాయి. జీవామృతం ఎరువు కాదు, కేవలం కల్చర్(తోడు వంటిది). పాలల్లో మజ్జిగ తోడేస్తే పెరుగు అవుతున్నట్లే.. జీవామృతం భూమిలో వేస్తే భూమిలోకి మేలుచేసే సూక్ష్మజీవులు కోటాను కోట్లు చేరి పంటలకు పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. పొటాష్ మొదలైనవన్నీ కూడా ఇక్కడే నేలలో అందు బాటులోకి వస్తాయి. కేవలం జీవామృతం ఒకటి వెయ్యగానే మొక్కకు కావలసినవన్నీ లభించవు. బీజామృతంతో విత్తన శుద్ధి, నేలతల్లికి ఆచ్ఛాదన, నీటి తడులు ఇవ్వడంలో మెలకువ పాటించడం.. ప్రకృతి వ్యవసా యంలో ఇవి కూడా ముఖ్యమే.
ఈశాన్య, నైరుతి సాళ్లతో మేలు
పంట పొలంలో సాళ్లను తూర్పు, పశ్చిమం వైపుగా నాటమని కొందరు చెబుతుంటారు. అయితే, సూర్యుడి కిరణాలు ఈశాన్యంలో మొదలై నైరుతి దిశగా వస్తాయి. ఆరు నెలలు దక్షిణాయనం, మరో ఆరు నెలలు ఉత్తరాణయణం. సాళ్లని ఈ విధంగా దున్నడం వల్ల దక్షిణాయన కాలంలో పంట మొక్కల ఆకులపై ఒక వైపు మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. మరోవైపు ఆకులపై సూర్యకిరణాలు పడవు. అలాగే ఉత్తరాయన కాలంలో సూర్యుడు పయనిస్తున్నప్పుడూ అంతే. ఒక వైపే కిరణాలు పడతాయి. తూర్పు, పశ్చిమ దిక్కులుగా సాళ్లు ఉంటే.. సూర్యకిరణాలు పడకపోవడం వల్ల ఏ కాలంలోనైనా సగం వైపు ఆకులు ఆహారాన్ని తయారు చేయలేవు. అందువల్ల దిగుబడి తగ్గుతుంది. రైతుకు సరిగ్గా ఆదాయం రాదు. అందువల్ల, ఈశాన్య, నైరుతి సాళ్లు వెయ్యడమే సరైనది. ఇలా చేయడం వల్ల పంటలపై సూర్యకిరణాలు ఏ కాలంలోనైనా సరిగ్గా పడి .. ఒక పిలకరావలసిన చోట వంద పిలకలు వచ్చాయి. సూర్యకిరణాలు, గాలి, వెలుతురు సరిగ్గా అందడం వల్లే కదా ఇదంతా అయ్యింది? నూటికి 98.5% మేరకు కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, సూర్యకిరణాలు అందేలా చూడాలి. అంతే.
ఇందులో నేను చేసిందేమీ లేదు. సహజ వనరుల్ని ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. దాంతో పంటంతా సహజంగా ఎదుగుతోంది. అందుకే అంటాను ప్రకృతి నేర్పేదే నిజమైన విజ్ఞానం. సుభాష్ పాలేకర్ నిజమైన విజ్ఞానాన్ని పంచుతున్నారు. దాన్ని నా పొలంలో ప్రయోగాత్మకంగా చేసి చూపించాను. అందుకే అమృతం లాంటి పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం మనం భారీగా ఖర్చుపెట్టి మరీ రసాయనాలు వేసి భూమిని, అలా పండించిన ఆహారం తిని ఆరోగ్యాన్నీ పాడు చేసుకుంటున్నాం. కానీ, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ సాగు పద్ధతిని రైతులందరూ అనుసరిస్తే వ్యవసాయం, భూమి, పరిసరాలు, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. ఇది రైతులకు చాలా సులభంగా, లాభదాయకంగా ఉంటుంది. మనందరం చేయి చేయి కలిపి సాగుదాం. ఒక ఆకుపచ్చ ప్రపంచాన్ని సృష్టిద్దాం..’’
(చిరునామా: కిష్టప్ప, బన్నూర్, మైసూర్ జిల్లా, కర్ణాటక. మొబైల్: 08805 87545)
ఫొటోలు, సంభాషణ : కె.క్రాంతికుమార్‌రెడ్డి
5 దొంతర్ల నమూనా.. ‘పంటల అడవి’!
రైతులు అప్పులు చేసి, ఆత్మహత్యల పాలవుతుంటుంటే.. నగరాల్లో ప్రజలు ‘హత్య’లకు గురవుతున్నారు! ఎలాగంటే.. నగర ప్రజలు విషపూరిత ఆహారాన్ని తింటూ అనారోగ్యానికి గురై జబ్బులపాలై మరణిస్తున్నారు. ఈ మరణాలన్నీ వ్యవసాయ రసాయనాలు చేస్తున్న హత్యలే. వీటిని ఆపాలంటే మనం నేలతల్లిని కాపాడుకోవలసి ఉంది. మనం ఆచరిస్తున్న రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల పంటలకు చీడపీడలు వస్తున్నాయి. విపరీతంగా పురుగుమందులు కొట్టాల్సివస్తోంది. ఖర్చు మోపెడై రైతు పూర్తిగా దెబ్బతింటున్నాడు.. దీనికి పరిష్కారంగా పాలేకర్ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంలో ‘5 దొంతర్ల పంటల నమూనా’ను రూపొందించారు. ఈ పొలం అడవిని పోలి ఉంటుంది. పెద్ద చెట్లు, మధ్యరకం చెట్లు, పొదలు, మొక్కలు, తీగజాతులు పొలంలో కలిసి పెరుగుతుంటాయి. అడవుల్లో పెద్ద చెట్టు పెరుగుతుంది. దాన్ని అనుసరించి మధ్యరకం చెట్టు పెరుగుతుంది. పొదలు పెరుగుతాయి. తీగలూ, గరికా పెరుగుతాయి. అదేమాదిరిగా అన్ని రకాల చెట్లని సహజీవనం చేయించే విధంగా పాలేకర్ ఈ పంటల నమూనాను రూపొందించారు. ఈ చెట్లన్నీ పొలంలో పక్కపక్కనే ఉండి అంగుళం భూమి కూడా వృథా కాకుండా వినియోగించుకుంటున్నాయి. ఈ పద్ధతిలో తెగుళ్ల సమస్య తక్కువ. కొబ్బరి చెట్టు నుంచి ఇంకో కొబ్బరి చెట్టుకు మధ్య దూరం 36 అడుగులు. వీటి మధ్యన 136 మొక్కల్ని నాటించాం. ఇప్పుడు మా దగ్గర ధాన్యం, చెరకు, కొబ్బరి, వక్క, అరటి, కోకో, కాఫీ, బత్తాయి, నారింజ.. గ్లైరిసీడియా(గిరిపుష్పం), వెనిలా మొదలైన పంటలున్నాయి. తద్వారా సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి మనుగడకు ఇది చాలా అవసరం. ఏడాది పొడవునా ఎంతోకొంత ఫలసాయం వస్తూనే ఉంటుంది. .
అంతర పంటల ద్వారా ఖర్చులొచ్చేస్తాయి..!
మేం మొదట్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులతో చెరకు సాగు చేసేవాళ్లం. రసాయనిక పద్ధతిలో చెరకు నాటడానికి ఎకరానికి 4 టన్నుల విత్తనం కావలసొచ్చేది. ఇక రసాయ నిక ఎరువులకు రూ. పది వేలు, విత్తనాలతో పాటు మొత్తంగా రూ. 40 వేలు ఖర్చవుతుండేది. అంతా చేస్తే చివరికి 40 నుంచి 50 టన్నుల చెరకు పండేది. కానీ, చివరికి ఏమీ మిగిలేది కాదు. అంతా జీరో. అందువల్ల పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని మేం మొదలుపెట్టాం. మాది కేవలం జీరో బడ్జెట్ వ్యవసాయం. ఒకే ఒక పశువుతో 30 ఎకరాల వ్యవసాయం చెయ్యవచ్చు. అదీ జీవామృతం సహకారంతోనే. ఇందులో ఎకరానికి కేవలం ఒక్క టన్ను విత్తనం చాలు. చెరకు గణుపు గణుపునకూ మధ్య రెండడుగులు, సాలు సాలుకూ మధ్య 8 అడుగుల దూరం ఉండాలి. మధ్యలో అంతరపంటలుగా ఉల్లి, మిరప, అలసందలు (బొబ్బర్లు), కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటల్ని పెంచుతాం. ఈ పద్ధతిలో నాటే ప్రతి చెరకు గణుపునకు వంద పిలకలు వస్తాయి. మనకి ఇందులో ఎకరానికి 200 టన్నుల వరకు దిగుబడి తీయవచ్చని పాలేకర్ చెబుతారు. ఇప్పుడు మాకు 60 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. బెల్లం ఆడించి అమ్ముతున్నా. రసాయనిక వ్యవసాయంలో టన్ను చెరకు నుంచి 95-100 కిలోల బెల్లం ఉత్పత్తి అవుతుంటే.. ప్రకృతి వ్యవసాయంలో పండించిన చెరకు టన్నుకు 120 కిలోల చొప్పున దిగుబడి వస్తోంది. ఎకరానికి రూ. 4.8 లక్షల ఆదాయం వస్తోంది. ఈ పద్ధతిలో దిగుబడి అంతకంతకూ పెరుగుతుంటే.. రసాయన పద్ధతిలో దిగుబడి అంతకంతకూ తగ్గుతూ పోతోంది. చెరకు మధ్యలో ఉల్లి, బొబ్బర్లు, మిరప, బంతిపూలు.. కూరగాయలు పెంచడం ద్వారా కూలీల ఖర్చులు వచ్చేస్తాయి. ఇక చెరకు నుంచి వచ్చే ఆదాయం మనకు బోనస్‌గా మిగులుతుంది. అందుకే ఈ పద్ధతిని మేం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అని గర్వంగా చెబుతాం. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించే ఏక పంట పద్ధతి (మోనోక్రాప్ సిస్టమ్) వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. రకరకాల పంటలు ఒకే పొలంలో వేస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి..