
చిన్న రైతే పెద్ద దిక్కు!
వివరం
మానవుల జీవితాన్ని సులభసాధ్యంగా, భద్రంగా, మరింత ఆనందమయంగా మార్చిన విజ్ఞాన ధారలు అనేకం. వాటిల్లోకెల్లా ముఖ్యమైనది వ్యవసాయ విజ్ఞానమే. మానవ నాగరికత చరిత్రే వ్యవసాయ చరిత్ర కూడా. వ్యవసాయ విజ్ఞానాన్ని సంతరించుకోనంత కాలం మనుషులు సంచార జీవనమే సాగించారు. విత్తనాలు చల్లి పంటలు పండించడం, జంతువులను మచ్చిక చేసుకొని ఉపయోగించుకోవడం మొదలైనప్పుడే స్థిర జీవనానికి పునాది పడింది. వ్యవసాయం తెలియకపోయి ఉంటే అసలు పట్టణాలు, నగరాలకు పుట్టుకే లేదు. డిసెంబర్ 23 ‘కిసాన్ దివస్’ (రైతు దినోత్సవం) సందర్భంగా వ్యవసాయం గురించి ఓసారి అవలోకిస్తే...
సుమారు 10 వేల ఏళ్ల క్రితం వ్యవసాయం తొలిగా పశ్చిమాసియా, ఈజిప్టు, భారత్ తదితర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఎవరికి తోచిన పద్ధతిలో వారు పంటలు పండించడం మొదలైంది. రకరకాల ప్రయోగాలు చేసి సంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోదిచేసిన అలనాటి రైతులే తొలి వ్యవసాయ శాస్త్రవేత్తలు. సింధు తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ ప్రారంభం కావడంతో పాడి, పంటల సాగు ప్రత్యేక జీవన విధానంగా వేళ్లూనుకొని వ్యవసాయ సంస్కృతి వెల్లివిరిసింది. దండయాత్రలు, వాణిజ్య కార్యకలాపాల వల్ల వ్యవసాయ పద్ధతులూ వ్యాప్తిచెందాయి. మానవాళికి ఇప్పుడు తిండిపెడుతున్న చాలా వంగడాలు పూర్వీకులు పెట్టిన భిక్షే!
పారిశ్రామిక వ్యవసాయం- పర్యవసానాలు
లిపి పుట్టక ముందునుంచే వేలాది ఏళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయం వేల ఏళ్ల పాటు ప్రకృతికి అనుగుణమైన రీతిలో స్థానిక వనరులతోనే సాగింది. గత శతాబ్దంలోనే పారిశ్రామిక రూపం సంతరించుకుంది. 1913లో జర్మనీలో వాణిజ్యపరంగా అమ్మోనియా ఎరువు తయారీతో వ్యవసాయ పారిశ్రామీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ‘హరిత విప్లవం’ రాకతో రసాయనిక పురుగుమందులు, కలుపుమందులు, హైబ్రీడ్ వంగడాలు, ఒకే రకం పంటను విస్తారంగా సాగు చేయడం, యంత్రాల వినియోగంతో సాంద్ర వ్యవసాయం (ఇంటెన్సివ్ ఫార్మింగ్) జోరందుకుంది. జన్యుమార్పిడి సాంకేతికత రంగప్రవేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా బహుళజాతి కంపెనీల రాజ్యంగా మారిపోయింది. అత్యధిక జనులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే దేశాల్లో సాగు రంగాన్ని ఆధునికత, అభివృద్ధి పేరిట పారిశ్రామిక వ్యవసాయం విధ్వంసకరమైన మలుపు తిప్పింది. వ్యవసాయ సంస్కృతిని వాణిజ్య దృష్టి కమ్మేసింది. ‘హరిత విప్లవం’ పరాయి దేశం నుంచి తిండిగింజలు తెచ్చుకొని కడుపు నింపుకునే దుస్థితి నుంచి భారతీయులను బయటపడేసిన మాట నిజం. అయితే, వ్యవసాయంలో వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు నేలను, నీటిని, పర్యావరణాన్ని.. చివరకు తల్లి పాలను కూడా విషపూరితం చేశాయి.
రైతుల ఉసురు తీస్తున్న సంక్షోభం
రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో వాణిజ్య విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా పారిశ్రామిక వ్యవసాయ పద్ధతులను విదేశీ కంపెనీలు వ్యవసాయాధారిత దేశాల నెత్తిన రుద్దాయి. వ్యవసాయ ఉత్పాదకాలు అమ్ముకొని పబ్బం గడుపుకునే ఈ కంపెనీల ధోరణికి భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులు నేటికీ దాసోహమంటున్నారు. కాయకష్టంతో స్వేదం చిందించి ధాన్యపు రాశులు పండించే రైతులు కంపెనీల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు తదితర ఉత్పాదకాలన్నీ కొని వాడే వినియోగదారులుగా మిగిలి.. అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోయారు. సాగు ఖర్చుల్లో సగాన్ని అదనంగా జోడించి వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటుధర కల్పిస్తే తప్ప రైతు బతుకుబండి సాగదని డా. ఎమ్మెస్ స్వామినాథన్ సారథ్యంలోని జాతీయ రైతుల కమిషన్ సిఫారసు చేసి ఏడేళ్లు దాటుతున్నా అతీ గతీ లేదు. అస్థిర వ్యవసాయ పద్ధతులు, వనరులకు కంపెనీలపైనే పూర్తిగా ఆధారపడడం, మార్కెట్ సదుపాయ లేమి, ప్రభుత్వ విధాన లోపం.. ఆసరాగా సంక్షోభ రాకాసి తెగబలిసిపోయింది. మన దేశంలో 2.5 లక్షలకు పైగా అమాయక రైతుల ఉసురు తీసింది. వ్యవసాయం అనగానే అప్పులు, ఆత్మహత్యలే చప్పున మదిలో మెదులుతాయి. కానీ నిజానికి ఈ ఆర్థిక ఉపరితలం అడుగున పంట పొలంలో పర్యావరణ సంక్షోభం బుసలు కొడుతోంది. భూసారం సర్వనాశనమైంది.
పద్ధతి ఏదైనా.. ప్రకృతే ప్రాణం!
పద్ధతి ఏదైనా ప్రకృతికి అనుకూలమైన రీతిలో పంటలు పండించడమే వ్యవసాయ సంక్షోభానికి అసలు పరిష్కార మన్న సత్యానికి మన కళ్ల ముందే పచ్చని ఆనవాళ్లున్నాయి. సేంద్రియ వ్యవసాయం, నాన్ పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్(ఎన్‌పీఎం), పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం, శ్రీవరి సాగు, పర్మాకల్చర్, బయోడైనమిక్ వ్యవసాయం.. పేరు ఏదైనా ప్రకృతి ఒడిలో సుస్థిర పద్ధతులతోనే వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని చాటి చెబుతున్న వారికి కొదవ లేదు. తక్కువ ఖర్చుతో విష వలయం నుంచి బయటపడుతున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నారు. ఇది నిస్సందేహంగా కారు చీకట్లో కాంతి రేఖే!
అన్నం పెడుతున్నది చిన్న రైతులే!
అపసవ్య విధానాల వల్ల నలిగిపోతున్న రైతుల్లో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఈక్రమంలో ఐక్యరాజ్యసమితి 2014ను ‘అంతర్జాతీయ చిన్న, సన్నకారు రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల చిన్న, సన్నకారు రైతులున్నారు. 60 కోట్ల భారతీయ రైతుల్లో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఇంటిల్లిపాదీ కాయకష్టం చేసే చిన్న రైతు కుటుంబాల సాగులోనే మన దేశంలోని 83శాతం భూకమతాలున్నాయి. అయినా.. చిన్న, సన్నకారు రైతులు పాలకుల నిరాదరణకు గురవుతున్నారు. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ ‘ఈటీసీ గ్రూప్’ ప్రపంచ ఆహార భద్రతపై ఆశ్చర్యకరమైన నిజాలను ఇటీవల క్రోడీకరించింది.
ప్రపంచవ్యాప్తంగా చిన్న కమతాల్లో పేద రైతు కుటుంబాల ద్వారా 30 శాతం వ్యవసాయ వనరుల ఖర్చుతో 70 శాతం జనాభాకు సరిపోయే ఆహారం పండుతోంది. పెద్ద కమతాల్లో, భారీ యంత్రాలతో జరుగుతున్న రసాయనిక వ్యవసాయం ద్వారా 70 శాతం వ్యవసాయ వనరుల ఖర్చుతో 30 శాతం జనాభాకి సరిపోయే ఆహారం మాత్రమే పండుతోంది!
70-80 శాతం సాగు భూమిలో రసాయనిక సాంద్ర వ్యవసాయానికి 70 శాతం సాగునీటిని, 80 శాతం శిలాజ ఇంధనాన్ని వాడుతున్నారు. 44-57 శాతం వ్యవసాయ కర్బన ఉద్గారాలు ఈ పొలాల నుంచే వెలువడుతున్నాయి. ఈ పొలాల విస్తరణ కోసం ప్రతి ఏటా కోటి 30 లక్షల హెక్టార్ల అడవులను నరికివేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో అమ్ముడవుతున్న ఆహారం అంతా ఈ పొలాల్లో పండిందే.
ప్రపంచవ్యాప్తంగా సాగు భూమిలో 20-30 శాతం మాత్రమే చిన్న, సన్నకారు రైతుల చేతిలో ఉంది. దాదాపు 20 శాతం శిలాజ ఇంధనం, 30 శాతం సాగునీటితో ఏకకాలంలో ఎక్కువ రకాల పంటలను వీళ్లు పండిస్తున్నారు. ఈ ఆహారంలో 85 శాతం ఆయా దేశ ప్రజలే వినియోగిస్తున్నారు.
రసాయనిక ఎరువులు, పురుగుమందులు విపరీతంగా వాడుతూ వ్యవసాయాన్ని యథాతథంగా కొనసాగిస్తే ఏమవుతుంది? వ్యవసాయం మరింత భారమై రైతులు, గ్రామీణులు చాలా ఎక్కువగా పట్టణాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. 2030 నాటికి పట్టణ జనాభా 70 శాతం పెరుగుతుంది. ఊబకాయం బాధితుల సంఖ్య రెట్టింపవుతుంది. ఆహారపు అవసరం 50 శాతం, నీటి అవసరం 30 శాతం పెరుగుతాయి. వ్యవసాయ ఉద్గారాలు ఇప్పటికన్నా 60 శాతం పెరుగుతాయి. ఆ మేరకు పెనుతుపానులు, కరువు కాటకాలు ఎక్కువ అవుతాయి. విత్తనాలు దాచుకొని వాడుకునే హక్కు అంతరిస్తుంది. విత్తనాలన్నీ బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్తాయి.
అలాకాకుండా.. చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ భద్రత కల్పించి, పర్యావరణ హితమైన వ్యవసాయానికి, పరిశోధనలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకొని, గ్రామీణులకు సక్రమంగా భూమి హక్కులు కల్పిస్తే 2030 నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది? రైతులు సుభిక్షంగా ఉంటారు. 80-90 శాతం పంటల విత్తనాలు కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా రైతుల చేతుల్లోనే ఉంటాయి. జనాభాలో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ గ్రామాల్లోనే హాయిగా ఉండొచ్చు. ఆహార సార్వభౌమత్వం వల్ల వ్యవసాయక జీవవైవిధ్యం పెంపొందుతుంది. పౌష్టికాహారం, ఆహార లభ్యత రెట్టింపవుతాయి. ఊబకాయుల సంఖ్య తగ్గుతుంది. ఉద్గారాలు కనీసం 60 శాతం తగ్గుతాయి. నీటి అవసరం 50 శాతం తగ్గుతుంది. వ్యవసాయంలో శిలాజ ఇంధనాల వాడకం 75-90 శాతం తగ్గుతుంది.
మనకున్న ముఖ్యమైన పంటలు వంద. ఇందులో 71 పంటల్లో ఫలదీకరణ తేనెటీగల ద్వారానే జరుగుతుంటుంది. మానవాళి ఆహార భద్రతతో ముడిపడి ఉన్న తేనెటీగలు పురుగుమందుల వల్ల నశిస్తున్నాయి. కాబట్టి, వ్యవసాయ పద్ధతులను ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడమే శ్రేయస్కరం.
‘ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధికి దోహదపడుతున్న చిన్న రైతులు, జాలర్ల పాత్రను గుర్తించి, వారికి వెన్నుదన్నుగా నిలవాలి. వ్యవసాయ రంగంలో ప్రాధాన్యతలను పునర్ నిర్వచించుకోవాల్సిన తరుణం ఇది. అంతర్జాతీయ సమాజం ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు’ అని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ డెరైక్టర్ జనరల్ జాక్యూస్ డియుఫ్ పిలుపునిచ్చారు. రైతు బాంధవుడు, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ స్మృత్యర్థం ఆయన జన్మదినం సందర్భంగా డిసెంబర్ 23న ఏటా జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్) జరుపుకుంటున్నాం. కొత్త ఏడాదిలో ‘అంతర్జాతీయ చిన్న, సన్నకారు రైతుల సంవత్సరం’ జరుపుకోబోతున్నాం. ఇప్పుడైనా బడుగు రైతులను వ్యవసాయం నుంచి బయటకు నెట్టే విధానాలకు విడనాడి.. వారికి గట్టి భరోసానిచ్చే పనులకు శ్రీకారం చుడితే ఎంతో బాగుంటుంది.
పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్
క్యూబా.. ఓ వెలుగు బాట!
సోవియట్ యూనియన్ అంతరించిన తర్వాత 1990 అనంతర కాలంలో క్యూబా తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో క్యూబా సేంద్రియ వ్యవసాయం చేపట్టింది. రైతుల పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి సంక్షోభాన్ని అధిగమించింది. క్యూబా జనాభా 80 శాతం నగరాలు, పట్టణాల్లోనే ఉంటున్నారు. గ్రామాల్లో ఆహారాన్ని పండించడానికి రసాయనిక ఎరువులు, తరలించడానికి ఇంధనం కూడా కొరతే. దీంతో, సమస్య ఉన్న చోటే పరిష్కారం వెదికారు. పట్టణాలు, నగరాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను కూడా పంట పొలాలుగా మార్చారు.
ఎక్కువ మంది మనుషులు ఉన్న చోటే ‘కొత్త పంట భూముల’ను సృష్టించారు. 1994లో ‘అర్బన్ అగ్రికల్చర్’ కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి అందర్నీ పనిలోకి దించారు. సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాయి. క్యూబా సాధించిన తొలి విజయం ఇదే. ఎత్తు మడులు, కంటెయినర్లలో స్థానిక వనరులతోనే వర్మీ కంపోస్టు తయారు చేసుకొని అన్ని రకాల పంటలూ పండించారు. పరిశోధనలకు పదును పెట్టి మంచి దిగుబడులు సాధించారు. 1989 తో పోల్చితే 2003 నాటికి రసాయనిక ఎరువుల వాడకం 90శాతం, పురుగుమందులు 93 శాతం తగ్గింది. ఒకప్పుడు ఆహార కొరతతో నకనకలాడిన పట్టణాల నుంచే ఇప్పుడు గ్రామాలకు కూరగాయలు, పండ్లు పంపిస్తున్నారు!
అన్నదాతల ఆత్మహత్యలకు ఎల్లల్లేవు!
అన్నదాతలపై వల్లమాలిన నిర్లక్ష్యం.. ఆత్మహత్యలు.. అభివృద్ధి చెందుతున్న మన దేశానికే పరిమితం కాదు. సంపన్న దేశమైన ఫ్రాన్స్‌లోనూ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2007-2009 మధ్య కాలంలో కనీసం 500 మంది ఫ్రెంచ్ రైతులు ఆర్థిక కారణాల రీత్యా బలవన్మరణం పాలయ్యారు. వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గడం, ఐరోపా దేశాల కూటమి నుంచి సహాయం కొడిగట్టడం ఫ్రాన్స్ రైతులను కుంగదీశాయి. పాలకులు మౌలిక సమస్యలను పట్టించుకోకుండా ప్యాకేజీల వంటి పైపూత పరిష్కారాలతో పబ్బం గడుపుకుంటున్న ఫలితమే ఈ దుర్గతి. ఇక మన దేశంలో జాతీయ నేర నమోదు సంస్థ గణాంకాల ప్రకారం.. 1995-2012 మధ్యలో 2,84,694 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో తెలుగు రైతులు 35,898 మంది. మన రాష్ట్రంలో 2011లో 2,206 మంది, 2012లో 2,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 9% వృద్ధి సాధిస్తున్నప్పుడు కూడా దేశంలో ఏటా 17,000 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి.
2014ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిన్న, సన్నకారు రైతుల సంవత్సరంగా ప్రకటించింది