ఆదివాసుల పెన్నిధి ‘పెద్ద జొన్న’! | Large corn god to adivasi farmers | Sakshi
Sakshi News home page

ఆదివాసుల పెన్నిధి ‘పెద్ద జొన్న’!

Published Tue, Mar 21 2017 3:52 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

ఆదివాసుల పెన్నిధి ‘పెద్ద జొన్న’!

ఆదివాసుల పెన్నిధి ‘పెద్ద జొన్న’!

- ఆదిలాబాద్‌ సంప్రదాయ జొన్న రకాల్లో రారాజు ‘పెద్ద జొన్న’
- అధిక పోషక విలువలతో కూడిన జొన్నలతో పాటు.. బలవర్ధకమైన చొప్పనూ పుష్కలంగా అందించే అపురూప వంగడం
- ఐదేళ్లుగా తిరిగి సాగు చేసుకొని తింటున్న రాజ్‌గోండ్‌ ఆదివాసీ రైతులు
- మైదాన ప్రాంత రైతులకూ అనువైనదేనంటున్న శాస్త్రవేత్తలు


రైతు కుటుంబానికి రుచికరమైన, పుష్టికరమైన ఆహారాన్ని.. పశువులను బలిష్టంగా ఉంచే ఇంపైన గడ్డిని సమృద్ధిగా అందించే పంటే ఆదివాసుల దృష్టిలో మంచి పంట కింద లెక్క. సంప్రదాయ జొన్న రకాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆదిలాబాద్‌ జిల్లాలో రాజ్‌ గోండ్‌ ఆదివాసీల దృష్టిలో ‘పెద్ద జొన్న’ (పెర్స జొన్న)కు మించినది లేదు. కొండ ప్రాంతాల్లో తరతరాలుగా సాగులో ఉన్న ఈ అపురూప వంగడం కాలక్రమంలో కనుమరుగైన పరిస్థితుల్లో ఐదేళ్లుగా ‘పెద్ద జొన్న’ మళ్లీ ఆదివాసీ రైతుల పొలాల్లోకి, కంచాల్లోకి వచ్చింది. అమ్మటం కోసం కాకుండా.. ఇంట్లో వాళ్లంతా తినడం కోసం మాత్రమే కొద్ది విస్తీర్ణంలో పెద్ద జొన్నను వారు సాగు చేసుకుంటున్నారు. దీని చొప్ప గొప్ప రుచిగా ఉండడంతో ఎద్దులు, ఆవులు కూడా తృప్తిగా తిని సత్తువను పెంచుకుంటున్నాయి. నాగోబా జాతరలో బండి లాగుడు పోటీల్లో తమ యజమానులను విజేతలుగా నిలబెడుతున్నాయి. చిరుధాన్యాలపై మళ్లీ ఆసక్తి పెరుగుతున్న ప్రస్తుత కాలంలో మార్కెట్‌లోనూ మంచి గిరాకీ ఉన్న పెద్ద జొన్న సాగు ఏ ప్రాంత రైతులకైనా ప్రయోజనకరమైనదే..

సారవంతమైన పొలాలు, పుష్కలమైన వర్షపాతం కలిగిన ఆదిలాబాద్‌ జిల్లాను పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలు చుటుముట్టక ముందు గిరిజనులు తమ సంప్రదాయ పంటలనే పండించుకునేవారు. అందువల్లనే ఆ జిల్లాలో పంటల జీవవైవిధ్యం చాలా ఎక్కువ. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్య పంటల ధాటికి సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో సిరికొండ మండలం మల్లాపూర్‌కు చెందిన రాజ్‌ గోండ్‌ గిరిజన రైతులు పాతకాలం నాటి ‘పెద్ద జొన్న’ (పెర్స జొన్న)ను మళ్లీ సాగులోకి తెచ్చుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది రబీ సీజన్‌లో పెద్ద జొన్నను వారు సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటకు మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పటికీ విక్రయించకుండా తమ ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవటం విశేషం. మదురైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ధన్‌ ఫౌండేషన్, మల్లాపూర్‌ రైతులకు  విత్తనాలు ఇచ్చి పెద్ద జొన్న సాగు పునరుద్ధరణను ప్రోత్సహించింది. ఆ తరువాత క్రమంగా పక్క గ్రామాలకు దీని సాగు విస్తరించింది.

6 నెలల పంట..
మల్లాపూర్‌ గ్రామంలో 95 గిరిజన రైతు కుటుంబాలున్నాయి. ఆ గ్రామంలోని ప్రతి రైతు ఎకరం పొలంలో పెద్ద జొన్నను సాగు చేస్తున్నారు. ఇక్కడి నల్లరేగడి భూముల్లో ఖరీఫ్‌ పంటగా పత్తి, సోయా సాగు చేస్తున్నప్పటికీ.. రబీ పంటగా పెద్ద జొన్నను సాగు చేస్తున్నారు. ముందటేడాది పండిన జొన్నలను తీసిపెట్టుకొని తర్వాత విత్తనంగా వాడుకుంటున్నారు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. ఆకు ఈనె తెలుపు రంగులో ఉంటుంది. గింజ లేత పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. పంటకాలం ఆరు నెలలు. ఏటా నవంబర్‌లో ఈ పంటను విత్తుకుంటారు.

రబీ పంటకు రెండు తడులు
దుక్కిలో చివికిన పశువుల ఎరువు తప్ప ఎలాంటి ఇతర ఎరువులు వేయరు. చీడపీడలు ఆశించకపోవటం వల్ల పురుగు మందులు చల్లరు. దీనివల్ల రైతుకు ఖర్చు తగ్గటమే గాక పెద్దగా పంటను పర్యవేక్షించాల్సిన అవసరమూ తప్పింది. రబీ నీటి ఎద్దడికి పెద్ద జొన్న సాగును సమర్థ పరిష్కారంగా చెప్పవచ్చు. విత్తనాలు వేసినప్పుడు మొలకెత్తేందుకు, కంకి దశలో గింజ పోసుకునేందుకు రెండుసార్లు నీటి తడులు ఇస్తే చాలు. పంట చేతికొస్తుంది.

కిందికి వంగి ఉండే పెద్ద జొన్న కంకి..
హైబ్రిడ్‌ జొన్న సాగులో పొలానికి వారం వారం తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి పిట్టలు, చిలుకల బెడద కూడా ఎక్కువే. అయితే పెద్ద జొన్నలో మాత్రం కంకులు కిందకు వంగి ఉండటం వల్ల పక్షుల బెడద ఉండదు. పెద్ద జొన్న సాగులో స్వంత విత్తనాన్ని వాడటం, ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల రైతుకు ఖర్చు కాదు.

పెద్ద జొన్న చొప్పంటే పశువులకు ఇష్టం
హైబ్రిడ్‌ రకాల చొప్ప రుచిగా ఉండకపోవడం వల్ల పశువులు మొదళ్లను వదలి చివర్లను మాత్రమే మేస్తాయి. అయితే పెద్ద జొన్న చొప్ప తియ్యగా ఉండటం వల్ల వేర్లతో సహా పశువులు ఇష్టంగా మేస్తాయని, పశువులకు ఈ చొప్ప మంచి బలమని గిరిజన రైతులు చెబుతున్నారు. పెద్ద జొన్నల దిగుబడి హైబ్రిడ్‌ జొన్నల కన్నా ఎకరానికి 5 క్వింటాళ్లు తక్కువ దిగుబడి వచ్చినప్పటికీ.. ఎకరం పొలం నుంచి వచ్చే పెద్ద జొన్న చొప్ప రెండు ఎడ్లు, 8 ఆవులకు ఏడాదంతా సరిపోతుందని రైతులు చెబుతున్నారు. నాగోబా జాతరలో బండి లాగుడు పోటీల్లో తమ ఎడ్లకు ఎదురు లేకపోవడానికి కారణం బలవర్ధకమైన పెద్ద జొన్న చొప్పేనని రాజ్‌ గోండ్‌ రైతులు గర్వంగా చెబుతున్నారు.  

పెద్ద జొన్నలతో తయారుచేసిన ఆహారోత్పత్తులు చాలా రుచిగా ఉంటాయి. జొన్న అంబలి, గట్క, రొట్టె వంటి వాటిని తయారు చేస్తారు. వేసవి కాలంలో గిరిజనులు అంబలిని చలువ పానీయంగా తీసుకుంటారు. మధుమేహాన్ని నియంత్రిస్తుందని చెబుతారు. అందుకే మల్లాపూర్‌ రైతులు తమ పెద్ద జొన్నలను విక్రయించకుండా ఇంటి అవసరాలకు మాత్రమే వాడుతున్నారు.

విత్తనం ఇచ్చి పుచ్చుకుంటారు..
రైతులకు విత్తనాలను ఉచితంగానే ఇస్తారు. మరుసటి పంట వచ్చాక వారి నుంచి రెట్టింపు పరిమాణంలో విత్తనాలను తీసుకుంటారు. పెద్ద జొన్నలో ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీటితో చేసిన ఆహారోత్పత్తులు రుచిగా ఉండటం, ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉండటం వల్ల పెద్ద జొన్నలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ౖహెబ్రిడ్‌ జొన్నలు క్వింటాల్‌ రూ. 3 వేల వరకు ఉండగా పెద్ద జొన్నలకు మాత్రం రూ. 10 వేల వరకు ధర పలుకుతోంది.
 – రొడ్డ దేవిదాస్, సాక్షి, ఆదిలాబాద్‌

రుచికరం.. ఆరోగ్యదాయకం..
మా పూర్వీకులు పండించిన పంటను మళ్లీ మేం సాగు చేస్తున్నాం. ఏ పంటను సాగు చేసినా కనీసం ఎకరాకు రూ. 10 వేల ఖర్చు చేయాలి. పెద్ద జొన్న సాగులో రూపాయి పెట్టే అవసరం ఉండదు. రెండంటే రెండే తడులు చాలు. పెద్ద జొన్న వంటలు రుచిగా ఉంటాయి. ఆరోగ్యదాయకమైనవి కూడా.
– పూసం ఆనంద్‌రావు (95509 61811),పెద్ద జొన్న రైతు, మల్లాపూర్, ఆదిలాబాద్‌ జిల్లా

పశువుల ఎరువు మాత్రమే వేస్తాం..
పెద్ద జొన్న పంటను మా ఊళ్లోని రైతులందరు వేస్తారు. జొన్నలను మా అవసరాల కోసం మాత్రమే సాగు చేస్తున్నాం. పొలంలో పశువుల ఎరువును మాత్రమే వేస్తాం.
– ఆత్రం భీంరావు (85009 12214) పెద్ద జొన్న రైతు, మల్లాపూర్‌ పెద్ద జొన్న రొట్టెలే ఎక్కువగా తింటాం..

మా పెద్దలు కూడా పెద్ద జొన్నలు తినేవారు. మధ్యలో వీటి జాడలేకుండాపోయింది. గత ఐదేళ్లుగా మళ్లీ ఈ పంటను పండిస్తున్నాం. నాకున్న మూడు ఎకరాల్లో పెద్ద జొన్న సాగు చేస్తున్నా.  మా ఇంట్లో ఈ జొన్నతో చేసిన అంబలి, గట్క, రొట్టెలే ఎక్కువగా తింటాం.
– మడావి భారతి బాయి, పెద్ద జొన్న రైతు, మల్లాపూర్‌

మైదాన ప్రాంత రైతులకూ అనువైన వంగడం
పెద్ద జొన్న వంటి సంప్రదాయ పంటను కొన్ని వందల సంవత్సరాల నుంచి గిరిజన రైతులు సాగు చేస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో పెద్ద జొన్న సాగు నిలిచిపోయింది. ఐదేళ్లుగా మళ్లీ కొనసాగిస్తున్నారు. గిరిజనులు వారి తిండి గింజల కోసమే వీటిని సాగు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల రైతులు మేలైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే మంచి దిగుబడి, ఆదాయం కూడా లభిస్తుంది.
– డాక్టర్‌ దండు మోహన్‌దాస్‌ (96037 16774),శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement